ప్రతీకాత్మక చిత్రం
Cyber Crime And Phone Addiction Prevention Tips: లాస్య (పేరు మార్చడమైనది) డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవలే ఆన్‌లైన్‌లో వినీత్ (పేరు మార్చడమైనది)తో పరిచయం ఏర్పడింది. ఇంటర్నెట్‌లోనే చాటింగ్, వీడియో కాలింగ్‌తో రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి ఇద్దరికీ. ఇంట్లో కూడా వినీత్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇరువైపుల పెద్దలు ఆన్‌లైన్‌లో పరిచయాలు చేసుకున్నారు. నిశ్చితార్థం ముహూర్తం ఫిక్స్ చేసుకొని, ఆ రోజున కలుసుకుందామనుకున్నారు.
చివరికి ఎంగేజ్‌మెంట్ దగ్గర పడుతున్నా లాస్య నిర్లిప్తంగా... ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుండడంతో తల్లిదండ్రులు విషయం ఏంటని ఆరాతీశారు. తను మోసపోయిన విధానం గురించి లాస్య ఎలాగూ నిశ్చితార్ధం ఫిక్స్ అయింది కదా అని, వ్యక్తిగత వీడియోలను వినీత్‌తో పంచుకుంటే.. వాటిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు లక్షల రూపాయలు ఇవ్వమని వేధిస్తున్నాడని, లేదంటే వాటిని ఇతర సైట్‌లలో పెడతానని బెదిరిస్తున్నాడంటూ భోరున ఏడ్చింది. ఏం చేయాలో తోచక తలలు పట్టుకున్నారు తల్లిదండ్రులు. డిజిటల్ మాధ్యమంగా అనుకోని పరిచయాల వల్ల జరిగే మోసాలు ఎన్నో.
;పదే పదే అదే పనిగా..
అనురాధ (పేరుమార్చడమైనది) ఆఫీసులో పనిలో ఉంది. కానీ, ఫోన్‌ని పదే పదే చూస్తోంది. మరో గంటలో ఫైల్ కంప్లీట్ చేసి, పై అధికారికి సబ్‌మిట్ చేయాలి. కానీ, ఉదయం అప్‌లోడ్ చేసిన పోస్ట్‌కి పెద్దగా స్పందన లేదు. ఏం చేయాలి?! కొత్తగా ఎవరైనా కామెంట్స్ పెట్టారా లేదా.. అని నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి ఫోన్ చూస్తూనే ఉంది. పని మీదకు ధ్యాస వెళ్లడం లేదు.
సాధారణంగా శారీరక, మానసిక సమతుల్యంపై గతంలో దృష్టి పెట్టేవారు. ఇప్పుడు వీటికితోడు డిజిటల్ వెల్‌బీయింగ్ కూడా తోడైంది. అవగాహన లేమి కారణంగా డిజిటల్ మాధ్యమంగా ఆన్‌లైన్ వ్యసనానికి, రకరకాల మోసాల బారిన పడుతున్నవారి సంఖ్యా పెరుగుతుంది. ఎన్నోవిధాలుగా వచ్చే సమాచారం నిజమని నమ్మితే, ఆ తర్వాత జరిగే అనర్థాలు వేరు.
డిజిటల్‌లో మంచిని తీసుకుంటూ, చెడును వదిలేస్తూ మన జీవనానికి ఉపయోగపడే సమాచారం తీసుకోవడానికి వెల్‌బీయింగ్ ఆఫీసర్ ఎందుకు అవసరమో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి.
దాదాపు రోజులో 6–7 గంటల పాటు ఫోన్‌కే సమయాన్ని కేటాయిస్తుంటారు. ఆన్‌లైన్‌లో ఉంటున్నవారిలో గృహిణులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆఫీసులో ఉన్నవారు అక్కడి పని మర్యాదను ఎలా పాటించాలి, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి? పిల్లలు తమ చదువుకు సంబంధించిన విషయాల పట్ల ఎలా శ్రద్ధ చూపాలి... వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. దీనిని చీఫ్ వెల్బీయింగ్ ఆఫీసర్ ద్వారా సాధించవచ్చు.
డిజిటల్ క్షేమం...
స్మార్ట్‌ఫోన్‌ని ఉదాహరణగా తీసుకుంటే.. ఇందులో అలారం గడియారం, కెమరా, నగదు ట్రాన్సాక్షన్‌లను భర్తీ చేసేసింది. మీరు దీని నుంచి దూరం అవ్వాలనుకున్నా కాలేరు. అయితే, వీటిమూలాన ప్రతికూల పరిణామాలూ తప్పవు.
1. అలవాటు–స్వీయ నియంత్రణతో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది.
2. సామాజిక బాధ్యతలలో బాహ్య ఒత్తిడి కూడా ఉంటుంది.
3. డిజిటల్ వెల్‌బీయింగ్‌ను అర్థం చేసుకోవడం, కుటుంబం, పని, వివిధ అవసరాలకు తగిన సాంకేతికతతో సమతుల్యతను సాధించడం అవసరం.
4. సాంకేతికతను ఉపయోగించడంలో సమయం పైనా దృష్టి పెట్టాలి.
5. డిజిటల్‌ను ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి.
6. ముఖ్యంగా పరధ్యానాన్ని తగ్గించాలి.
ఒక్క క్లిక్...
కేవలం అప్లికేషన్‌ను క్లిక్ చేయడం ద్వారా డిజిటల్ అనుభవాన్ని పొందలేం. వాటిని ఆచరణలో పెట్టడం ద్వారానే అనుకున్నవి సాధించవచ్చు.
మానసిక ఆరోగ్యం కోసం చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలు, ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్, టైమ్ మేనేజ్‌మెంట్ సెషన్‌లను గుర్తించి, వాటిని ఉపయోగించుకోవచ్చు. భౌతిక శ్రేయస్సు కోసం డిజిటల్ వినియోగం అంతగాలేని పర్యటనలు, వ్యాయామాలు, ఉత్తరాలు.. వంటి వాటిమీద దృష్టి పెట్టవచ్చు.
సోషల్ మీడియాను నిర్వహించడం, డిజిటల్ పేరెంటింగ్ వంటి డిజిటల్ శ్రేయస్సు చుట్టూ ఉన్న కొన్నింటిని ఉపయోగించుకోవచ్చు.
ఉపయోగపడే యాప్‌లు
మీరు రోజూ ఎన్నిగంటలు నిద్రపోతున్నారో తనిఖీ చేయడానికి స్లీప్ ట్రాకింగ్ యాప్‌లు ఉన్నాయి.
డైటరీ ట్రాకింగ్ యాప్‌లతో భోజనాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. కేలరీలను లెక్కించడం, హైడ్రేటెడ్‌గా ఉండాలని గుర్తుచేయడం.. వంటి పనులను ఆ యాప్స్ చేస్తాయి.
ఫిజికల్ యాక్టివిటీ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. లేచి కదలాలని లేదా యోగా లేదా సైక్లింగ్ వంటి యాక్టివిటీస్ చేయడంలో గైడ్ చేయాలని గుర్తు చేస్తాయి.
ఆందోళన, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌ను ఎదుర్కోవడానికి విశ్రాంతి, ధ్యానం చేయడంలో మానసిక ఆరోగ్య యాప్‌లు సహాయపడతాయి.
మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి స్క్రీన్ టైమ్‌ను సెట్ చేసుకోండి.
డిజిటల్ సంక్షేమ అధికారి పాత్ర ఎందుకంటే...
డిజిటల్ వెల్‌బీయింగ్ పాలసీని రూపొందిండంతోపాటు దానిని ఆచరించాలి. అమలు వ్యూహాన్ని అభివృద్ధి చేయాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎంతవరకు డిజిటల్ ఉపయోగపడుతుందో.. సమీక్షించుకోవాలి. మీ చుట్టూ ఉన్నవారిని కూడా గైడ్ చేస్తూ, మంచి పనులను ప్రోత్సహించండి. ఈ పనిని మీకు మీరుగా, కుటుంబంలో, స్నేహితుల్లో ఎవరైనా చేయచ్చు.
- అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment