
కారుకు ఎంపికైనట్లు పంపిన కార్డు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15 లక్షల ఫ్రైజ్‌మనీకి ఎంపికైనట్లు వాట్సప్‌లో పంపిన సమాచారం
జనాల బలహీనతే వారి పెట్టుబడి.. ఆశ చూపి మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. గిఫ్ట్ తగిలిందని ఫలానా అకౌంట్లో డబ్బు జమ చేస్తే పంపుతామంటూ తియ్యటి మాటలతో మాయ చేస్తారు. వారు అనుకున్నట్టుగా డబ్బు పడగానే ఫోన్ స్విచ్చాఫ్ చేస్తారు. ఇదీ ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాల తంతు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా జనాల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా ఆన్‌లైన్ మాయగాళ్ల చేతిలో మోసపోతూ పోలీస్‌స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు.
అనంతపురం, శింగనమల: ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువుకు రూ.15 లక్షలు బహుమతి తగిలిందని, తాము చెప్పిన మొత్తం అకౌంట్లో జమ చేస్తే రూ.15 లక్షల నగదు లేక రూ.15 లక్షల విలువజేసే కారు అందిస్తామని చెప్పారు. ఈ మేరకు వాట్సప్‌లో కార్డు కూడా పంపారు. తీరా అకౌంట్‌లో డబ్బు వేశాక ఫోన్ ఎత్తకుండా మానేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకెళితే..మండలంలోని తరిమెల గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కరెంట్ కాంట్రాక్ట్ పని చేసేవాడు. మూడు నెలల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.459 పెట్టి బ్లూటూత్ కొనుగోలు చేశాడు. ఈనెల 13న మధ్యాహ్నం సమయంలో 9870511627 నంబర్ నుంచి శ్వేతాశర్మ పేరుతో ఫోన్ వచ్చింది.
జార్కండ్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు తెలుగులో మాట్లాడింది. ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులు కొనుగోలు చేసిన వారి ఐడీలతో సంస్థ లక్కీ డ్రా తీసిందని, ఇందులో మీకు రూ.15 లక్షలు తగిలిందని చెప్పుకొచ్చింది. రూ.15 లక్షల నగదు మీ ఖాతాలోకి వేయాలంటే ముందుగా రూ.15 వేలు తమ ఖాతాలోకి జమ చేయాలని సూచించింది. నగదు జమ అయిన అరగంటలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పింది. ఒకవేళ రూ.15 లక్షల నగదు వద్దనుకుంటే రూ.15 లక్షల విలువజేసే మహీంద్ర ఎక్స్‌యూవీ 500 కారు అందిస్తామని, ఇందుకు రూ.15,500 జమ చేయాల్సి ఉంటుందని వివరించింది. ఇందుకు సంబంధించిన కారు ఫొటో, లక్కీడ్రా ఎంపికైన పత్రాలను వాట్సప్ (7256812304) ద్వారా పంపింది. ఆమె మాటలను పూర్తిగా నమ్మిన సురేష్ గూగుల్ పే ద్వారా రూ.15,000 ఆమె సూచించిన ఖాతాలో జమ చేశాడు. గంట పాటు ఎదురుచూసినా డబ్బు జమకాకపోవడంతో అతడు పై నంబర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ రింగవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, నిందితులు వాడిన ఫోన్ నంబర్ బిహార్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment