కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి | Six People Trapped In Cambodia Cyber Scam Gang In Karimnagar | Sakshi
Sakshi News home page

కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి

Published Mon, Sep 19 2022 2:12 AM | Last Updated on Mon, Sep 19 2022 2:12 AM

Six People Trapped In Cambodia Cyber Scam Gang In Karimnagar - Sakshi

కంబోడియాలో బాధిత యువకులు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి పేరుతో వెళ్లి కంబోడియా సైబర్‌ స్కాం గ్యాంగ్‌ చేతిలో చిక్కుకున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి వెళ్లి.. క్రిప్టోకరెన్సీ, క్రెడిట్‌కార్డ్, హనీట్రాప్‌ పనులు చేయిస్తుండటంతో ఆందోళనలో పడ్డారు. ఆ పనులు చేయలేక, చేయబోమంటే వారు పెడుతున్న చిత్ర హింసలు భరించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

అసలు ఏం జరిగింది? 
కరీంనగర్‌లోని గాంధీరోడ్‌ చౌరస్తా సమీపంలో ఓ కన్సల్టెన్సీ ఉంది. కంబోడియాలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఉన్నాయని, మంచి జీతం వస్తుందని కన్సల్టెన్సీ నిర్వాహకుడు స్థానిక ముస్లిం యువకులకు చెప్పాడు. దీనితో కొందరు యువకులు రూ.2 లక్షల చొప్పున అతడికి చెల్లించారు. కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఈ ఏడాది ఆగస్టు చివర్లో, సెప్టెంబరు మొదటివారంలో ఆరుగురు యువకులను కంబోడియాకు పంపాడు.

అక్కడికెళ్లాక ఓ కంపెనీ వాళ్లు ఆ యువకులను చుట్టూ ఎత్తయిన గోడలు, విద్యుత్‌ కంచె లు, సాయుధ పహారాతో ఉన్న ఓ టౌన్‌షిప్‌కు తీసుకెళ్లారు. అమెరికా, యూరప్‌ వాసుల నంబర్లు ఇచ్చి.. వారిని వాట్సా ప్‌ ద్వారా సంప్రదించి క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే బాగా డబ్బులు వస్తాయంటూ ఒప్పించాలని చెప్పారు. ఆ పని చేయలేమంటే.. పాస్‌పోర్టులు ఇవ్వబోమని, జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారని యువకులు వాపోతున్నారు. 

నేరాలు ఇలా చేయిస్తూ.. 
కరీంనగర్‌కు చెందిన బాధిత యువకుడు షాబాజ్‌ఖాన్‌ చెప్పిన వివరాల మేరకు.. ఈ యువకులు అమెరికా, యూరోపియన్‌ కస్టమర్లను వాట్సాప్‌లో, ఫోన్లలో సంప్రదించాలి. సాఫ్ట్‌వేర్‌ సాయంతో మహిళల్లా గొంతు మార్చి మాట కలపాలి. బాగా డబ్బులు వస్తాయని మెల్లగా వారిని ఒప్పించి ఓ క్రిప్టోకరెన్సీ యాప్‌లో కనీసం 100 డాలర్లు పెట్టుబడి పెట్టించాలి. రెండు, మూడు రోజుల్లో.. లాభం వచ్చి ఆ సొమ్ము 1000 డాలర్లకు పెరిగినట్టు చూపిస్తుంది.

ఇది చెప్పి.. వారిని మరింత ఆశపెట్టి భారీగా డబ్బు పెట్టుబడి పెట్టించాలి. తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌. ఆ సొమ్మంతా ఈ సైబర్‌ నేర గ్యాంగ్‌ కాజేస్తుంది. తర్వాత మరొకరికి గాలం వేయాలి. తమకు రోజూ ఇదే పని అని షాబాజ్‌ఖాన్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి విలపిస్తూ చెప్పాడు. తనను వదిలేయాలంటే 3,000 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.2.4 లక్షలు) చెల్లించాలని, లేదా తనకు బదులు మరో యువకుడిని అక్కడికి పిలిపించాలని ముఠా సభ్యులు తేల్చిచెబుతున్నారని వివరించాడు. తనతోపాటు సిరిసిల్ల, చింతకుంట, వేములవాడ, మానకొండూరుకు చెందిన యువకులు కూడా బందీగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకున్నాడు. అయితే వారిని ఫోన్‌లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

అక్కడి ప్రజాప్రతినిధుల అండదండలతోనే.. 
కాంబోడియాలో సైబర్‌ మాఫియా ముఠాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తాయని.. మాఫియా నిర్వాహకుల్లో కొందరు అక్కడ ప్రజాప్రతినిధులు కూడా అని ప్రచారం ఉంది. ఆ ముఠాలు క్యాసినోలు, సైబర్‌ స్కాం కేఫ్‌లు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటుంటాయి. స్థానికులు తిరగబడే అవకాశం ఉంటుందని.. మలేసియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్‌ తదితర దేశాల నుంచి యువతీ యువకులను ఉద్యోగాల పేరిట వల వేసి రప్పించుకుంటాయి.

సైబర్‌ నేరాల్లో శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటాయి. ఇచ్చిన టార్గెట్‌ చేరకపోతే కొట్టడం, కరెంటు షాక్‌లు ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. చిత్ర హింసలు భరించలేని విదేశీయులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు, అక్కడి అకృత్యాలపై ఇంటర్‌నెట్‌లోనూ వార్తలు ఉన్నాయి. 

బాధితులు ముందుకురావాలి 
కంబోడియాలో చిక్కుకున్న యువకుల గురించి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తాం. 
– సత్యనారాయణ, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement