మంగళగిరి: సైబర్ మోసగాళ్ల ఐపీజీ రెంట్ యాప్ ఉచ్చులో మంగళగిరికి చెందిన 700 మందికిపైగా చిక్కి విలవిల్లాడుతున్నారు. పెట్టుబడికి వారం రోజుల్లో రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపడంతో వీరు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. వీరు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు రెండురోజుల కిందట పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ప్రారంభంలో ఒకరిద్దరుగా ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు తిరిగి ఇచ్చిన యాప్ నిర్వాహకులు తరువాత క్రమంగా చెల్లింపులు నిలిపేశారు.
నిదానంగా ముఖం చాటేసిన నిర్వాహకులు ఫోన్ లిఫ్ట్ చేయకపోగా యాప్‌లోను సమాధానం చెప్పకపోవడం, ఐపీజీ రెంట్ కామ్ యాప్‌ను సైతం మూసేయడంతో పెట్టుబడిదారులు మోసపోయామని గ్రహించారు. తొలుత కిషోర్‌కు అతడి స్నేహతుడు ఐపీజీ యాప్ లింక్ పంపారు. తన స్నేహితులు చాలామంది ఆ యాప్‌లో పెట్టుబడి పెట్టారని, మంచి ఆదాయం వస్తుందని అతడు చెప్పడంతో కిషోర్ ఆ యాప్‌లో నమోదు చేసుకున్నారు.
మొదట రూ.800 పెట్టుబడి పెట్టగా వారానికి రూ.1,600 ఆదాయం వచ్చింది. రెండుమూడుసార్లు పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రావడంతో కిషోర్ తన స్నేహితులకు యాప్ లింక్ పంపి రెట్టింపు ఆదాయం గురించి చెప్పారు. కిషోర్ స్నేహితులు, బంధువులతోపాటు చైన్‌లింక్‌గా మారి ఒక్క మంగళగిరిలోనే 700 మందికిపైగా ఈ యాప్‌లో నమోదు చేసుకున్నారు. రూ.800, రూ.1,200 నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు.. ఇలా శక్తిమేర పెట్టుబడులు పెట్టారు.
మార్చి నెలాఖరు కావడంతో యాప్ ఆఫర్ ప్రకటించిందని చెప్పి రూ.30 వేలు పెట్టుబడి పెట్టినవారికి అదనంగా ఆదాయంతోపాటు వారం రోజులకు వడ్డీ రూ.27 వేలు కలిపి రూ.80 వేలు వస్తాయని ఆశచూపారు. దీంతో పలువురు ఎక్కువ సొమ్ము యాప్‌లో పెట్టుబడి పెట్టారు. బాధితుల్లో అత్యధికంగా మహిళలున్నారు. వారం రోజుల తర్వాత మోసగాళ్లు యాప్‌ను మూసేయడంతో కిషోర్ ఆన్‌లైన్‌లో సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. మరికొందరు బాధితులతో కలిసి ఈ నెల 7వ తేదీన పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తమకు ఫిర్యాదు చేసినట్లు పట్టణ సీఐ బి.అంకమ్మరావు చెప్పారు. సైబర్ క్రైమ్ కావడంతో దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్‌కు అప్పగించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment