Cyber Crime Prevention Tips: ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలను లక్షంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్లతో ఏమార్చి ప్రజలను దోచుకుంటున్నారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులతో మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేర్లతోనూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినబడుతోంది. వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీ ఒశ్వాల్(82)ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఆయన నుంచి ఏకంగా 7 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ చోరులు.
సైబర్ నేరాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి.. వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం, నిపుణులు పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల్లో ఎక్కువగా 10 రకాల మోసాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అవేంటో తెలుసుకుందాం.
1. ట్రాయ్ ఫోన్ స్కామ్:
మీ మొబైల్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నట్టు టెలికం రెగ్యులెటరీ అథారిటీ (ట్రాయ్) నుంచి ఫోన్ వస్తుంది. మీ ఫోన్ సేవలు నిలిపివేయకూడదంటే అధికారితో మాట్లాడాలంటూ భయపెడతారు. సైబర్ చోరుడు.. సైబర్ క్రైమ్ సెల్ పోలీసు అధికారిగా మిమ్మల్ని భయపెట్టి ఏమార్చాలని చూస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏటంటే ట్రాయ్.. ఫోన్ సేవలు నిలిపివేయదు. టెలికం కంపెనీలు మాత్రమే ఆ పని చేస్తాయి.
2. పార్శిల్ స్కామ్:
నిషేధిత వస్తువులతో కూడిన పార్శిల్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, ఈ కేసు నుంచి బయట పడాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఫోన చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డిస్‌కనెక్ట్ చేసి పోలీసులను సంప్రదించాలి. బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన నంబరును పోలీసులకు ఇవ్వాలి.
3. డిజిటల్ అరెస్ట్:
మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని ఎక్కడికి వెళ్లినా తమ నిఘాలోనే ఉండాలని స్కామర్లు బెదిరిస్తారు. పోలీసులు, సీబీఐ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు గుంజాలని చూస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. వాస్తవం ఏమిటంటే పోలీసులు డిజిటల్ అరెస్టులు లేదా ఆన్‌లైన్ విచారణలు నిర్వహించరు.
4. కుటుంబ సభ్యుల అరెస్ట్:
కాలేజీ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న మీ అబ్బాయి లేదా అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని మీకు ఫోన్ కాల్ వస్తే అనుమానించాల్సిందే. ఎందుకంటే సైబర్ స్కామర్లు ఇలాంటి ట్రిక్స్‌తో చాలా మందిని బురిడీ కొట్టించారు. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు చిక్కుల్లో పడ్డారనగానే ఎవరికైనా కంగారు పుడుతుంది. ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కంగారు పడకుండా స్థిమితంగా ఆలోచించాలి. ఆపదలో చిక్కుకున్నారని చెబుతున్నవారితో నేరుగా మాట్లాడటానికి ప్రయత్నించండి.
5. రిచ్ క్విక్ ట్రేడింగ్:
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వెంటనే ఎక్కువ లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక రాబడి ఆశ చూపి స్కామర్లు జనాన్ని కొల్లగొడుతున్నారు. స్వల్పకాలంలోనే అత్యధిక రాబడి వస్తుందని ఆశ పడితే అసలుకే మోసం రావొచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
6. ఈజీ వర్క్.. ఎర్న్ బిగ్:
చిన్నచిన్న పనులకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ముగ్గులోకి లాగుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఉదాహరణకు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేస్తారు. చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తమతో పాటు పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి.. భారీ మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈజీ మనీ పథకాలు స్కామ్‌లని గుర్తిస్తే సైబర్ చోరుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
7. క్రెడిట్ కార్డ్ స్కామ్:
మీరు వాడుతున్న క్రెడిట్ కార్డ్‌తో భారీ లావాదేవి జరిగిందని, దీన్ని నిర్ధారించుకోవడానికి ఫోన్ చేసినట్టు మీకు ఫోన్ వస్తే కాస్త ఆలోచించండి. సాయం చేస్తానని చెప్పి మీకు ఫోన్ చేసిన వ్యక్తి.. తన మరొకరికి కాల్ ఫార్వార్డ్ చేస్తాడు. మిమ్మల్ని నమ్మించిన తర్వాత సీవీవీ, ఓటీపీ అడిగి ముంచేస్తారు. మీ పేరుతో క్రెడిట్ కార్డు ఉన్నయిట్టయితే, దాంతో చేసే లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఒకవేళ ఏదైనా అనుమానం కలిగితే బ్యాంకును సంప్రదించాలి. అంతేకానీ అపరిచితులకు వివరాలు చెప్పకండి.
8. నగదు బదిలీతో మస్కా:
కొంత నగదు బ్యాంకు ఖాతాలో పడినట్టు స్కామర్లు మీ ఫోన్‌కు ఫేక్ మేసేజ్ పంపిస్తారు. తర్వాత మీకు ఫోన్ చేసి.. పొరపాటున నగదు బదిలీ అయిందని, తన డబ్బు తిరిగిచ్చేయాలని మస్కా కొడతారు. నిజంగా ఆ మేసేజ్ బ్యాంకు నుంచి వచ్చింది కాదు. నగదు బదిలీ కూడా అబద్ధం. ఎవరైనా ఇలాంటి ఫోన్ కాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. నిజంగా నగదు బదిలీ జరిగిందా, లేదా అనేది నిర్ధారించుకోండి.
9. కేవైసీ గడువు:
కేవైసీ గడువు ముగిసిందని, అప్‌డేట్ చేసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి అంటూ.. ఎస్‌ఎంఎస్, కాల్, ఈ-మెయిల్ ఏవైనా వస్తే జాగ్రత్త పడండి. పొరపాటున ఈ లింకులు క్లిక్ చేస్తే మీరు స్కామర్ల బారిన పడినట్టే. ఈ లింకులు స్కామర్ల డివైజ్‌లకు కనెక్ట్ అయివుంటాయి. కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు లింకుల ద్వారా కేవైసీ అప్‌డేట్ చేసుకోమని చెప్పవు. నేరుగా వచ్చి మాత్రమే కేవైసీ వివరాలు ఇమ్మని అడుగుతాయి.
10. పన్ను వాపసు:
ట్యాక్స్‌పేయర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నావారికి ఫోన్ చేసి తమను తామును అధికారులుగా పరిచయం చేసుకుంటారు. ట్యాక్స్ రిఫండ్ చేయడానికి బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించాలని కోరతారు. డిటైల్స్ చెప్పగానే మీ బ్యాంకు అకౌంట్‌లోని సొమ్మును స్వాహా చేసేస్తారు. ట్యాక్స్‌పేయర్ల బ్యాంకు ఖాతాల వివరాలు పన్నుల శాఖ వద్ద ఉంటాయి. కాబట్టి వారికే నేరుగా ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తాయి. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలను అసలు నమ్మకండి.
స్కామర్ల బారిన పడకుండా ఉండాలంటే..
1. స్పందించే ముందు సమాచారాన్ని ధృవీకరించుకోండి
2. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి
3. నగదు లావాదేవీలను బ్యాంకుల ద్వారా నిర్ధారించుకోండి
4. అనుమానాస్పద కాల్‌లు/నంబర్‌లపై రిపోర్ట్ చేయండి
5. అధిక రాబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండండి
6. కేవైసీని వ్యక్తిగతంగా అప్‌డేట్ చేయండి
7. వ్యక్తిగత/బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు
స్కామర్లపై ఫిర్యాదు చేయండిలా..
1. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (1800-11-4000)
2. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in)
3. స్థానిక పోలీస్ స్టేషన్
4. ఈ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి
sancharsaathi.gov.in/sfc/Home/sfc-complaint.jsp
Comments
Please login to add a commentAdd a comment