ప్రేమికులూ జరభద్రం! | Sakshi
Sakshi News home page

ప్రేమికులూ జరభద్రం!

Published Mon, Feb 12 2024 4:15 AM

Cyber scams in the name of Valentines Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు ప్రేమికులపై ఫోకస్‌ పెట్టారు. వాలెంటైన్స్‌ డే దగ్గర పడుతుండడంతో డిస్కౌంట్‌లు, ఆఫర్లు, సర్‌ఫ్రైజ్‌ గిఫ్ట్‌  లు, గిఫ్ట్‌ కూపన్లు అంటూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఏటా ఈ తరహా మోసాలు షరామామూలే అయినా.. ఎప్పటికప్పుడు సైబర్‌ నేరగాళ్ల బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని సైబర్‌ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు తెరతీ స్తున్నారు. మీకు అత్యంత సన్నిహితులు  వాలెంటైన్స్‌ డే సందర్భంగా మీకు సర్‌ఫ్రైజ్‌ గిఫ్ట్‌ పంపారు.. దాన్ని పొందాలంటే మేం చెప్పిన ఖాతాకు కస్టమ్స్‌ చార్జి కోసం కొంత మొత్తం పంపండి అంటూ వల వేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.  ప్రధానంగా చేస్తున్న మోసాలు చూస్తే..

షాపింగ్‌ ఫ్రాడ్స్‌..: 
ఆన్‌లైన్‌ షాపింగ్, బెస్ట్‌ ఆఫర్స్, గిఫ్ట్‌లు, డిన్నర్‌లు అంటూ సోషల్‌మీడియా ఖాతాల్లో మోసపూరిత యాడ్స్‌ ఇస్తు న్నారు. ఈ ఆఫర్ల కోసం సంప్రదించే వారి నుంచి వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని మోసం చేస్తున్నారు.

ఫిషింగ్‌ ఈమెయిల్స్‌..
 సైబర్‌ నేరగాళ్లు వాలెంటైన్స్‌ డేకు సంబంధించి ప్రత్యేక కొటేషన్లు, మెసేజ్‌లు, ఎమోజీలు, గ్రాఫిక్‌ వీడియోలు అంటూ ఫిషింగ్‌ లింక్‌లను ఈమెయిల్స్‌కు పంపుతున్నారు. వీటిపై క్లిక్‌ చేసిన వెంటనే మన మొబైల్, ల్యాప్‌టాప్‌లోకి మాల్‌వేర్‌ వచ్చేలా చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. 

ఈ విషయాలు మరవొద్దు..: 
► ఆన్‌లైన్‌లో వాలెంటైన్స్‌ డే గిప్ట్‌లు కొనాలంటే నమ్మదగిన ఈ కామర్స్‌ వెబ్‌సైట్లనే ఉపయోగించాలి. కొత్త యాప్స్‌ వినియోగించాల్సి వస్తే వాటి రేటింగ్‌ తప్పక చూసుకోవాలి.
వాలెంటైన్స్‌ డే ప్యాకేజీలు, గిఫ్ట్‌ల పేరిట నమ్మశక్యం కాని ఆఫర్లు ఉంటే అది సైబర్‌ మోసగాళ్ల అనుమానాస్పద ప్రకటనగా గుర్తించాలి. 

►అనుమానాస్పద మెసేజ్‌లు,ఈ మెయిల్స్‌లోని లింక్‌లపై క్లిక్‌ చేయవద్దు.  మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా నంబర్లు, క్రెడిట్, డెబిట్‌ కార్డుల వివరాలు, పిన్‌ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దు.

Advertisement
 
Advertisement