ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌: మోసాల నుంచి తప్పించుకోండి ఇలా.. | online trading scam | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌: మోసాల నుంచి తప్పించుకోండి ఇలా..

Published Thu, Sep 8 2022 4:17 AM | Last Updated on Thu, Sep 8 2022 1:29 PM

online trading scam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను స్క్రోల్‌ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు పాప్‌ అప్‌ అవుతూ ఉంటాయి. కానీ, అవి ఎలాంటి రిజిస్టర్‌ కాని వాణిజ్య పోర్టల్స్‌. ఎవరైనా నమ్మి వీటిలో మెంబర్స్‌గా చేరితే, అధిక మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గృహిణులను లక్ష్యం చేసుకునే ఈ మోసాలు జరుగుతుంటాయి. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి స్కామర్లు కొత్తమార్గాలను ఎంచుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పక తెలిసుండాలి. అప్పుడే మోసాల బారిన పడకుండా ఉండగలం.

ఇంటర్నెట్‌ ఆధారిత సమాచారం రోజు రోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఎక్కువ మంది వ్యక్తులు తమ పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడానికి ఆన్‌లైన్, సోషల్‌ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఫింగర్‌ టిప్స్‌ మీద లభిస్తుండటమే కారణం. అందుకే, స్కామర్లు కూడా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి వేగవంతంగా కొత్త మార్గాలను అమలు చేస్తుంటారు.

► ఫ్యాన్సీ ప్రకటనలు
చాలావరకు ఆన్‌లైన్‌ ప్రకటనలన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ల ద్వారా సమాచారం కోసం స్క్రోలింగ్‌ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అవి అలా కుప్పలు తెప్పలుగా ఆన్‌లైన్‌లోకి రావడం కూడా బ్రోకరేజీ రహితంగా ఉండటం, సులభమైన వాణిజ్య పోర్టల్, తక్షణ పరిష్కారాలు ఉండటం వల్లనే. వీటిలో చాలా ఏజెన్సీలు రిజిస్టర్‌ చేసి ఉండవు. కానీ ప్రముఖ అధికారిక కార్పొరేట్‌ ట్రేడింగ్‌ కంపెనీల కంటే మరింత శక్తిమంతమైన ఫ్యాన్సీ ప్రకటనలను ఉంచుతుంటారు.

స్కామర్లు ఆకర్షణీయంగా ఉన్న ప్రకటనలను ఎర వేసి ఈ బోగస్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌లలో తమ వివరాలతో రిజిస్టర్‌ చేసుకున్న వారికి మొదట్లో కొంత మొత్తంలో డబ్బులు జమ చేస్తుంటారు. ఈ విధానం ద్వారా డబ్బు సంపాదించినట్లు చెప్పుకునే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను వీరు అనుసరిస్తారు. పాయింట్లకు బదులుగా వారు యాప్‌ వాలెట్‌లో డబ్బును డిపాజిట్‌ చేయమని అడుగుతారు, అది తర్వాత ట్రేడింగ్‌ కోసం ఉపయోగిస్తారు.

మోసగాళ్లు ఉపయోగించే కొన్ని పథకాలు

పోంజీ పథకం
ఇది కొత్త పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బుతో చేసే మోసం. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు కొంత మొత్తం చెల్లిస్తూ వారి ద్వారా మరిన్ని పెట్టుబడులను రాబట్టడం.

పంప్, డంప్‌ స్కీమ్‌
ఇది ఒక పెట్టుబడి మోసం. ఇక్కడ సలహాదారులు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని అందించి, షేర్ల ధరను బంప్‌ చేయడానికి (పెంచడానికి) ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ పెట్టుబడిదారులు సలహాదారులను నమ్మి తమ షేర్లను (అవి మంచి విలువ కలిగినప్పుడు) అమ్మేస్తారు.

యాప్‌ ఆధారిత స్కీమ్‌లు
పెట్టుబడిదారులకు మోసగాళ్లు తరచు వాలెట్‌ బ్యాలెన్స్‌ల నకిలీ చిత్రాలను చూపుతూ ఫిషింగ్‌ ఇ–మెయిల్స్‌ను పంపుతారు. సాధారణంగా క్రిప్టో కరెన్సీలు స్టాక్‌లు లేదా ఈ కామర్స్‌ ఉత్పత్తులు.. వీటిలో భాగంగా ఉంటాయి.

ప్పుదారి పట్టించడానికి..
పెట్టుబడి పోకడలు, పరిశోధన స్టాక్‌లపై సమాచారాన్ని సేకరించడానికి, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా వేగవంతంగా ఆదాయ అవకాశాలను చర్చించడానికి పెట్టుబడిదారులు ఫేస్‌బుక్, ట్విటర్, టీమ్‌ వ్యూవర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌.. వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. స్కామర్‌లు నకిలీ సిఫారసులు చేస్తారు. అయాచిత పెట్టుబడి చిట్కాలు ఇస్తారు. వీటిలో నకిలీ గుర్తింపు లేదా తప్పుదారి పట్టించే సమాచారం ద్వారా పెట్టుబడిదారులను ఒప్పించే కొన్ని పద్ధతులు ఉంటాయి.

పెట్టుబడిని ఎరగా వేస్తారు
చాలా మంది పెట్టుబడిదారులు మొదట్లో సంస్థ నుండి కొంత రాబడిని పొందుతారు. దీంతో ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ విజయవంతమైందని స్కామర్లు అనుకుంటారు. స్కామర్‌లు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి శిష్యుడిని లేదా స్నేహితుడిని పరిచయం చేయడానికి మరింత ప్రోత్సహిస్తారు. డబ్బులు వస్తాయి కదా అని తమకు తెలిసినవారికి సదరు యాప్‌ లేదా వెబ్‌సైట్‌ వివరాలు ఇచ్చి వారిని కూడా చేరమని అంటారు. అయితే, చివరికి రిటర్న్‌లు ఆగిపోతాయి, కస్టమర్‌ ఖాతా సస్పెండ్‌ చేయబడుతుంది. డబ్బు వాలెట్‌లో ఇరుక్కుపోయి ఉంటుంది. సంస్థతో తదుపరి ఎలాంటి పరిచయం ఉండకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడిని ఎలా పొందాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు.

► అవకాశాల కోసం  7 రకాల వలలు
దశ 1: ముందుగా బాధితులను వాట్సాప్‌ / టెలిగ్రామ్‌ గ్రూపుల్లో చేరమని అభ్యర్థిస్తారు.
దశ 2: లింక్‌ల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయమని అడుగుతారు. ఈ కొత్త సభ్యులందరికీ మొదట్లో జాయినింగ్‌ బోనస్‌ లభిస్తుంది. అయితే అది వారి వాలెట్‌లో మాత్రమే కనిపిస్తుంది.
దశ 3: ట్రేడింగ్‌ జరుగుతుంది (బాధితులు విధులు నిర్వర్తించమని అడుగుతారు), అంటే, షేర్ల అమ్మకం/కొనుగోలు, లేదా కొన్నిసార్లు బాధితులు ఇ–కామర్స్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయమని లేదా విక్రయించమని అడుగుతారు.
దశ 4: బాధితులను సిస్టమ్‌కి కొత్త వ్యక్తులను పరిచయం చేయమని అడుగుతారు. ఇది నిజమని, తమకూ కొంత పెట్టుబడి చేరుతుందన్న ఆశతో మంచి పార్టీలను పరిచయం చేస్తారు. అలా పరిచయం చేసిన వ్యక్తి ద్వారా స్కామర్లు వారి వాలెట్‌కి డబ్బు చేరేలా చేస్తారు.
దశ 5: చేసిన పనుల ఆధారంగా వాలెట్‌ డబ్బును కూడగట్టుకుంటుంది.
దశ 6: బాధితుడు వారి వాలెట్ల నుండి తమ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీలుపడదు. ఒక్కోసారి వీలున్నా ఆదాయపు పన్ను, ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ రుసుము మొదలైనవి చెల్లించాల్సి ఉంటుంది.
దశ 7: కోరిన ఫీజు చెల్లించిన తర్వాత, యాప్‌లు పని చేయవు. అవి ఏదో ఒక సాంకేతిక లోపాన్ని చూపుతాయి. కస్టమర్‌ సేవను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలూ ఫలించవు.
 
మోసానికి మార్గాలు
స్కామర్లు తాము విజయవంతమైన వ్యాపారులుగా, గ్యారెంటీ రిటర్న్‌ ఇస్తున్నట్టుగా, ట్రేడింగ్‌ సలహాలను అందిస్తున్నట్లు క్లెయిమ్‌ చేసుకుంటారు ∙ఇందుకోసం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చేసిన ఫోనీ టెస్టిమోనియల్‌ యూట్యూబ్‌ వీడియోలను ఉపయోగిస్తారు ∙‘పంప్‌ అండ్‌ డంప్‌‘ కార్యకలాపాలను నిరోధించడానికి ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు ∙నకిలీ సమాచారంతో ఆన్‌లైన్‌ పెట్టుబడి చిట్కాలు, నకిలీ ఎండార్స్‌మెంట్‌లను పంపుతుంటారు ∙స్టాక్‌ సిఫార్సులు లేదా పెట్టుబడి సలహాలకు బదులుగా సబ్‌స్క్రిప్షన్‌ రుసుమును సేకరించేందుకు ఉద్దేశించిన స్టాక్‌ పోర్ట్‌ ఫోలియో స్క్రీన్‌షాట్‌లను ప్రదర్శిస్తుంది ∙పెట్టుబడిదారులను టెక్నికల్‌ అనలిస్ట్‌లు లేదా ట్రేడింగ్‌ నిపుణులను చేస్తానని నమ్మబలికి స్కామర్లు వర్క్‌షాప్‌ల కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజులను తీసుకుంటారు కానీ వారికి హోస్ట్‌ చేయరు.

పెట్టుబడులకు డేంజర్‌ సిగ్నల్స్‌
బాధితుల ఆశను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన విభిన్న పద్ధతులతో మోసగాళ్లు వారి లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలా కాకుండా మనల్ని మనం కాపాడుకోవా లంటే..
అసాధారణంగా అధిక హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు, గమనించాలి.
అధిక ప్రారంభ పెట్టుబడిని అభ్యర్థిస్తారు.
సంక్లిష్టమైన, నిలకడలేని వ్యాపార నమూనా ఉంటుంది.
నష్టాలను తిరిగి చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు.
వెంటనే డబ్బు పెట్టుబడిగా పెట్టమని ఒత్తిడి చేయచ్చు.  
యాప్‌ స్టోర్‌ లేదా ప్లే స్టోర్‌లలో లిస్ట్‌లో లేని యాప్‌లలో పెట్టుబడి పెట్టమని కోరతారు.
అధిక రాబడిని పొందినట్లు పేర్కొంటూ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మద్దతును కోరుతారు.
స్కామర్ల కార్యాలయాలు మన దేశం లోపల ఉన్నాయా, వెబ్‌సైట్, యాప్‌లలో ఉండే చిరునామాలను చూపుతున్నాయా అనేది చెక్‌ చేసుకోవాలి.

ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement