రూ.1,130 కోట్ల ‘సైబర్ స్కామ్’! | Rs .1,130 crores cyber scam | Sakshi
Sakshi News home page

రూ.1,130 కోట్ల ‘సైబర్ స్కామ్’!

Published Fri, Oct 14 2016 3:56 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

రూ.1,130 కోట్ల ‘సైబర్ స్కామ్’!

రూ.1,130 కోట్ల ‘సైబర్ స్కామ్’!

 బ్రిటన్ కేంద్రంగా పాక్‌కు చెందిన ఫిజాన్ నేతృత్వంలో దందా
  కీలకపాత్ర పోషించిన పలువురు ‘తెలుగువారు’
  శిక్షపడ్డాక తప్పించుకువచ్చిన కరీంనగర్ జిల్లా వాసి
  దర్యాప్తు దశలోనే పారిపోయిన ఖమ్మం జిల్లా వ్యక్తి
  ఇంటర్‌పోల్ సాయంతో భారత్‌కు లండన్ పోలీసులు

 
 సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి లండన్ కేంద్రంగా భారీ ‘సైబర్ స్కామ్’కు పాల్పడ్డాడు. పదుల సంఖ్యలో ముఠా సభ్యుల్ని ఏర్పాటు చేసుకుని వివిధ బ్యాంకులకు చెందిన కస్టమర్ల నుంచి రూ.1,130 కోట్లు(113 మిలియన్ పౌండ్లు) కాజేశాడు. ఈ ఘరానా మోసానికి పాల్పడ్డ అంతర్జాతీయ ముఠాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. కరీంనగర్ వాసి ముఠా నాయకుడికి కుడి భుజంగా వ్యవహరిస్తే.. ఖమ్మం, రాజమండ్రి యువకులు ‘మనీ మ్యూల్స్’ను ఏర్పాటు చేసే పని చేశారు.
 
 సొలిసిటరీ ఖాతాలే టార్గెట్...
 పాక్‌కు చెందిన ఫిజాన్ హమీద్ చౌదరి బ్రిటన్‌లో 20 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. వివిధ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు ఎరవేసి ఏజెంట్లుగా మార్చుకున్నాడు. వీరి ద్వారానే ఆయా బ్యాంకు కస్టమర్లుగా ఉన్న సొలిసిటర్ కంపెనీ(న్యాయవాదులు)ల లావాదేవీలు, కాంటాక్ట్ నంబర్లు తెలుసుకునే వాడు. లండన్‌లో స్థిరాస్తి కొనుగోళ్లన్నీ సొలిసిటరీ కంపెనీల ద్వారానే జరుగుతాయి. ఓ ఆస్తిని విక్రయిస్తున్న వ్యక్తి, ఖరీదు చేస్తున్న వ్యక్తి.. తరఫునా ఈ సొలిసిటర్లు ఉంటారు. వారు ఆస్తి పూర్వాపరాలు పరిశీలించి ఖరీదు ఖరారు చేస్తారు. ఆపై ఆస్తిని ఖరీదు చేస్తున్న వ్యక్తి ఆ మొత్తాన్ని తన సొలిసిటర్ కంపెనీ ఖాతాలో జమ చేస్తారు. ఈ నగదు కంపెనీ ద్వారానే ఆస్తిని విక్రయించే వ్యక్తి సొలిసిటరీ కంపెనీ ఖాతాలోకి వెళ్తుంది. బ్రిటన్‌లో బ్యాంకు రుణంపై వడ్డీ రేట్లు తక్కువ కావడంతో ప్రతి ఒక్కరూ రుణంపైనే ఆస్తులు కొంటారు. బ్యాంకు రుణాలు సైతం సొలిసిటరీ కంపెనీ ఖాతాల్లోకే వెళ్తాయి. ఈ నేపథ్యంలోనే ఫిజాన్ గ్యాంగ్ ఈ ఖాతాలను టార్గెట్ చేసుకుంది.
 
 బ్యాంకు డేటాతో...
 సొలిసిటరీ కంపెనీల ఖాతాల వివరాలు, కాంటాక్ట్ నంబర్లు సేకరించే ఫిజాన్.. గ్యాంగ్ మెంబర్ల ద్వారా ఆయా కంపెనీలకు ఫోన్లు చేయించేవాడు. ఇంటర్నెట్ ఆధారంగా స్ఫూఫింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కాల్స్ చేయడంతో రిసీవ్ చేసుకునే వ్యక్తికి సదరు బ్యాంకు నంబరే డిస్‌ప్లే అయ్యేది. సదరు కంపెనీ చేసిన రెండు లావాదేవీలను చెప్పి వారికి నమ్మకం కలిగించే వారు. ఆపై వారు చేయని లావాదేవీ ఒకటి చెప్పి, పేమెంట్ ప్రాసెసింగ్‌లో ఉందని సదరు లావాదేవీ మీరే చేశారా? అని అడిగే వారు. దీంతో కంపెనీ వారు ఆ లావాదేవీతో తమకు సంబంధం లేదని చెప్పగా.. దాన్ని రద్దు చేయడానికని ఓ కోడ్ నంబర్  చెప్పేవారు. బ్యాంక్ ఫ్రాడ్‌‌స వింగ్‌కు కాల్ చేసి ఈ నంబర్ చెప్పాలని, ఆపై వారు చెప్పిన విధంగా చేస్తే సదరు లావాదేవీ క్యాన్సిల్ అవుతుందని నమ్మబలికేవారు.
 
 పరారీలో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు
 ఈ పంథాలో ఫిజాన్ ముఠా కొన్ని నెలల్లోనే 750 కంపెనీల నుంచి రూ.1,130 కోట్ల వరకు స్వాహా చేసింది. లండన్ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ స్కామ్‌గా రికార్డుకెక్కిన ఈ కేసును స్కాట్‌ల్యాండ్ యార్డ్, యూకే మెట్రోపాలిటన్ పోలీసులు గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఛేదించారు. ఫిజాన్‌తో పాటు లండన్‌లోని అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారిని పట్టుకున్నారు. గత నెల్లో అక్కడి న్యాయస్థానం నిందితులను దోషులుగా నిర్థారించింది. అయితే దర్యాప్తు నుంచి దోషిగా తేలే వరకు వివిధ దశల్లో ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు పారిపోయి వచ్చారు. వీరి కోసం గాలిస్తున్న అక్కడి పోలీసులు ఇంటర్‌పోల్ సాయంతో ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
 రద్దు చేస్తామంటూ అన్నీ తెలుసుకుని...

 సైబర్ నేరగాళ్లు వినియోగించే ప్రత్యేక పరిజ్ఞానం కారణంగా వాళ్లు ఫోన్ పెట్టేసినా.. కాల్ కనెక్టయ్యే ఉండేది. దీంతో సొలిసిటరీ కంపెనీ వాళ్లు బ్యాంక్ ఫ్రాడ్ వింగ్‌తో పాటు ఎవరికి కాల్ చేసినా.. అది నేరగాళ్లకే చేరేది. అలా కాల్‌ను రిసీవ్ చేసుకునే సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారుల మాదిరిగా మాట్లాడేవారు. లావాదేవీ క్యాన్సిల్ చేయడానికి అవసరమంటూ వినియోగదారుడి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో పాటు కస్టమర్ నుంచే కార్డ్ రీడర్ జనరేటెడ్ కోడ్ సైతం తీసుకుని నిమిషాల్లో వారి ఖాతాలు ఖాళీ చేసేవారు. ఈ నిధుల్ని ‘మనీ మ్యూల్స్’ ఖాతాల్లోకి మళ్లించి తక్షణం డ్రా చేయించేవారు. కమీషన్ తీసుకుని తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించే వారిని మనీ మ్యూల్స్ అంటారు. మనీ మ్యూల్స్‌ను ఏర్పాటు చేసిన వారిలో కరీంనగర్, ఖమ్మంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారూ ఉన్నారు. వీరిని ఏర్పాటు చేసే బాధ్యతల్ని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తే ఎక్కువగా నెరిపేవాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement