cyber securities
-
ఆన్లైన్ మోసాలు.. విస్తుపోయే వాస్తవాలు!
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ యువ రైతు ఆన్లైన్ మోసాలకు బలయ్యాడు. సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకున్న వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన బందెనోల్ల పోచిరెడ్డి(30) అనే రైతు బలవనర్మణం చెందాడు.11 వేల కోట్ల రూపాయలు నష్టంప్రతిఏటా వేల కోట్ల రూపాయలను సైబర్ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ మోసాలకు మనదేశం 2024 మొదటి 9 నెలల్లోనే 11,333 కోట్ల రూపాయలు నష్టపోయిందని హోంశాఖ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) వెల్లడించింది. స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.4636 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ సంబంధిత పేర్లతో రూ.3216 కోట్లు మాయం చేశారని పేర్కొంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి రూ1616 కోట్లు దోచేశారని లెక్క చెప్పింది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 12 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) తెలిపింది. వచ్చే ఏడాదిలోనూ సైబర్ దాడుల ముప్పు కొనసాగుతుందని డేటా సెక్యురిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్‌సీఐ) హెచ్చరించింది.డిజిటల్ అరెస్ట్.. లేటెస్ట్ ట్రెండ్మన దైనందిన జీవితాల్లో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో తప్పనిసరిగా ఆన్లైన్, మొబైల్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. మన అవసరాలు, ఆశలను ఆసరాగా తీసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త అవతారాల్లో జనాన్ని వంచించి, కేసుల పేరుతో భయపెట్టి సొమ్ములు చేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో సైబర్ మోసాల కేసులు నానాటికీ ఎగబాకుతున్నాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ కార్యక్రమం 115వ ఎపిసోడ్లో డిజిటల్ అరెస్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేపట్టదని ఆయన తెలిపారు.30 లక్షల ఫిర్యాదులుఅమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ దుండగులు మోసాలకు పాల్పుడుతున్నారు. వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసి సొమ్ములు కాజేస్తున్నారు. సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ డేటా ప్రకారం 2021 నుంచి ఇప్పటి వరకు సైబర్ మోసాలపై 30.05 లక్షల ఫిర్యాదులు నమోదు కాగా, రూ.27,914 కోట్లను కేటుగాళ్లు కొల్లగొట్టారు. 2023లో 11,31,221 కేసులు నమోదు కాగా, 2022లో 5,14,741, 2021లో 1,35,242 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, కంబోడియా, మయన్మార్, లావోస్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు సైబర్ మోసాలకు అడ్డాలు మారాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో నమోదైన ఆన్లైన్ మోసాల్లో 45 శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నట్టు గుర్తించారు. చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..అప్రమత్తతే రక్షణ కవచంసైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే ఆయుధమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత ఇ-మెయిల్, వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులు.. సందేశాలకు స్పందించవద్దని కోరుతున్నారు. ఎక్కువ డబ్బు ఆశచూపే వారి పట్ల అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పేరుతో ఎవరైనా భయపడితే కంగారు పడొద్దని, నేరుగా పోలీసులను సంప్రదించాలని నిపుణులు సలహాయిస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్టు భావిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మున్ముందు కూడా కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. -
జర్మనీలో విప్రో సైబర్ డిఫెన్స్ సెంటర్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో తాజాగా జర్మనీలోని డుసెల్డార్ఫ్లో సైబర్ డిఫెన్స్ సెంటర్ ప్రారంభించింది. క్లయింట్లకు ఈ కేంద్రం ద్వారా సైబర్ సెక్యూరిటీ పర్యవేక్షణ, ఏదైనా సంఘటన జరిగితే ప్రతిస్పందన, సమస్య పరిష్కారానికి మద్దతు వంటి సేవలు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులను విప్రో వినియోగిస్తుంది. -
సైబర్ మోసాల నియంత్రణకు పటిష్ట రక్షణలు
ముంబై: డేటా/సైబర్ సెక్యూరిటీ ఫైర్‌వాల్స్ (రక్షణ వ్యవస్థలు)ను మరింత బలోపేతం చేసుకోవాలని, సైబర్ మోసాల నుంచి తమ కస్టమర్లకు రక్షణ కల్పించాలని బ్రోకింగ్ కంపెనీలను సెబీ కోరింది. మార్కెట్లో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేసే టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించింది. శుక్రవారం ముంబైలో నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (యాన్మి) సమావేశాన్ని ఉద్దేశించి సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీపీ గార్గ్ మాట్లాడుతూ.. కస్టమర్లకు అనుకూలమైన, సురక్షిత టెక్నాలజీల అభివృద్ధికి సెబీ ఏర్పాటు చేసిన శాండ్బాక్స్ నుంచి ప్రయోజనం పొందాలని బ్రోకర్లను కోరారు. కరోనా మహమ్మారితో నిత్యజీవితంలో చాలా వరకు కార్యకలాపాలు డిజిటల్‌కు వేగంగా మళ్లినట్టు జీపీ గార్గ్ చెప్పారు. టెక్నాలజీ తెలిసిన ఇన్వెస్టర్లే కాకుండా.. సాధారణ పౌరులు సైతం వినియోగించుకునే విధంగా సాంకేతిక పరిష్కారాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. యామ్ని సర్వే వివరాలను ఈ సందర్భంగా గార్గ్ విడుదల చేశారు. కరోనా వచ్చిన తర్వాత స్టాక్ బ్రోకర్లలో 92.6 శాతం మంది టెక్నాలజీపై మరింత నిధులను వెచ్చించినట్టు ఈ సర్వే గుర్తించింది. 41 శాతం మంది బ్రోకర్లు ఈ వ్యయాలు 20 శాతానికి పైనే పెరిగినట్టు చెప్పారు. -
వైరస్ వల.. సాయం వంకతో భారీగా సైబర్ నేరాలు
బెంగళూరు: టెక్నికల్ సపోర్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ చింతలు తీరుస్తామంటూ చిక్కుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఈ తరహా నేరాలు భారీగా జరుగుతున్నాయి. సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వల విసురుతున్న సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే టెక్ సపోర్ట్ పేరుతో మెసాలకు పాల్పడుతున్న 2,00,00ల మంది సైబర్ నేరగాళ్లను గుర్తించామంటూ ప్రముఖ టెక్ సర్వీసెస్ సంస్థ అవాస్ట్ పేర్కొంది. ఇలా గుర్తించిన వారందరినీ బ్లాక్ చేయడం చేసినట్టు తెలిపింది. హానికర మాల్వేర్ సైబర్ నేరగాళ్లు టెక్ సపోర్ట్ పేరుతో వల వేస్తున్నారు. సామాన్యుల కంప్యూటర్లతో యాక్సెస్ దొరకగానే ... మాల్వేర్లను చొప్పిస్తున్నారు. అనంతరం డేటాను దొంగిలిస్తున్నారు. కొన్నిసార్లు సిస్టమ్ మొత్తం క్రాష్ అయ్యేలా హానికరమైన మాల్వేర్ను సైతం పంపిస్తున్నారు. దీంతో వీరి వలలో పడినవారు తీవ్రంగా నష్టపోతున్నట్టు అసలైన టెక్సపోర్ట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. సపోర్ట్ పేరుతో.. టెక్ సపోర్ట్ పేరుతో ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పంపడం ద్వారా కంప్యూటర్ యూజర్లతో సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌లో సమస్య ఉందని దాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచిస్తారు. తమ టెక్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను వాడితే సమస్య దూరమైపోతుందంటూ నమ్మిస్తున్నారు. ఆ వెంటనే తమ ప్రణాళికను అమల్లో పెడుతున్నారు. ఆర్థిక నేరాలు కంప్యూటర్లలో విలువైన సమాచారం చేతికి వచ్చిన తర్వాత కొందరు నేరగాళ్లు బ్యాంకు ఖాతాల ఆధారంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఆన్లైన్ టెక్ సపోర్ట్ పేరుతో సంప్రదించే నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి. -
అంతర్జాలంతో జాగ్రత్త
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ప్రస్తుతం సైబర్ క్రైం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఖాతాల వివరాలను మరింత గోప్యంగా ఉంచుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారు. బంజారాహిల్స్ తాజ్దక్కన్ హోటల్లో మంగళవారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సేఫ్ సర్ఫింగ్ క్యాంపెయిన్’ అంశంపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. డిజిటల్ ప్రపంచంలో చిన్నారులకు సైబర్ బెదిరింపులు అంశంపై ప్రసంగించారు. అంతర్జాలంలో వ్యక్తిగత ఖాతాలను, నెంబర్లను మరింత భద్రంగా చూసుకోవాలని చెప్పారు. బ్యాంక్ ఖాతాలు, ఫేస్‌బుక్‌లు, వెబ్సైట్లలో పాస్‌వర్డ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని... ఎప్పటికప్పుడు వాటిని మార్చుకుంటే మంచిదన్నారు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య బాగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారన్నారు.