షేర్ మార్కెట్ పేరుతో వల
బాధితుల నుంచి రూ.కోట్లాది దోపిడీ
బెంగళూరులో పెరిగిన నయా నేరాలు
బనశంకరి: ఐటీ బీటీ నగరం భారీ సైబర్ నేరాలకు అడ్డాగా మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా విస్తరించినప్పటికీ అంతేస్థాయిలో ఆన్‌లైన్ నేరగాళ్లు జనం డబ్బును కొట్టేస్తున్నారు. ఒకప్పుడు ఓటీపీ తెలుసుకుని బ్యాంకు ఖాతాను దోచేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల క్లోనింగ్ వంచన వంటివి జరిగేవి. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ షేర్లు, ట్రేడింగ్ గురించి ఆశలు కల్పించి లక్షలాది రూపాయలు దోచేస్తున్నారు. టెక్కీలు, డాక్టర్లు, విశ్రాంత ఉద్యోగులు, విద్యావంతులు వీరి వలలో చిక్కుకుంటున్నారు.
– జయనగరలో 50 ఏళ్ల వ్యక్తికి రూ.1.61 కోట్లు టోపీ వేశారు
– బెల్లందూరు 41 ఏళ్ల మహిళకు రూ.1.22 కోట్లు మస్కా
– సుబ్రమణ్యపురలో 38 ఏళ్ల మహిళకు రూ.1.10 కోట్లు..
– మైసూరురోడ్డు నాయండహళ్లి 70 ఏళ్ల డాక్టరుకు రూ.2.09 కోట్లు..
– హెచ్‌ఏఎల్ మూడోస్టేజ్‌లో 70 ఏళ్ల వృద్ధునికి రూ.1.33 కోట్లు..
– వైట్‌ఫీల్డ్‌లో డ్రగ్స్ కొరియర్ పేరుతో మహిళా టెక్కీకి రూ. 22.50 లక్షల టోకరా
నకిలీ గ్రూపులు, యాప్‌ల ద్వారా..
ఎంచుకున్న బాధితులకు మొదట ఒక లింక్‌ను పంపి, లేదా కాల్ చేసి మాట్లాడతారు. కొన్నిసార్లు బాధితులే ఆసక్తితో ఇంటర్నెట్‌లో వెదికినప్పుడు మోసగాళ్లు తగులుతారు. ఆపై వారిని మోసపూరిత వాట్సాప్ గ్రూప్‌లోకి చేరుస్తారు. షేర్లు, పెట్టుబడుల గురించి 15 రోజుల పాటు శిక్షణ అంటూ ఏవో మెసేజ్‌లు పోస్ట్ చేస్తూ ఉంటారు.
తరువాత యాప్ లింక్ పంపించి డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుబడి పెట్టవచ్చునని సలహా ఇస్తారు. వంచకులు తీయని మాటలతో పెద్దమొత్తంలో పెట్టుబడులు లాగేస్తారు. కొన్నిసార్లు పెట్టుబడి డబ్బులో 10 శాతం నగదు లాభం పేరుతో బ్యాంక్ అకౌంట్‌కు జమచేసి ఊరిస్తారు. ఆ డబ్బు కూడా యాప్‌లో మాత్రమే కనిపిస్తుంది. డ్రా చేయడానికి ఆస్కారం ఉండదు.
పెట్టుబడి ఇక చాలు, విత్‌డ్రా చేసుకుందాం అనుకుంటే యాప్ బ్లాక్ అవుతుంది. మోసగాళ్లకు కాల్ చేసి డబ్బు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేయగానే ఫోన్లు స్విచాఫ్ చేసుకుంటారు. సిలికాన్ సిటీలో ఇలాంటి ముఠాలకు చిక్కి కోట్లాది రూపాయలు పోగొట్టుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment