అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: వాహనదారులను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్ లింక్‌లు పంపుతున్నారు. అందులో.. మీ వాహనాలపై ఉన్న ఈ–చలాన్‌లు చెల్లించండని.. పేర్కొంటున్నారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని వచ్చే ఎస్‌ఎంఎస్‌లో నకిలీ వెబ్‌సైట్ లింక్ ఉంటుందని, వాహనదారులు దీన్ని క్షుణ్ణంగా గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ–చలాన్‌కు సంబంధించిన నిజమైన వెబ్‌లింక్ echallan.parivahan.gov.in కాగా దీన్ని కొద్దిగా మార్పు చేసి సైబర్ నేరగాళ్లు challaanparivahan.inను పంపుతున్నట్టు తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
‘డిజిటల్ అరెస్టు’ మోసగాడి పట్టివేత
రాయదుర్గం: ‘డిజిటల్ అరెస్ట్’ కేసులో మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్‌స్పెక్టర్ కె రామిరెడ్డి నేతృత్వంలో పుణేలో ఈ మేరకు నిందితుడు కపిల్‌కుమార్ (42)ను అరెస్ట్ చేశారు. ఇతను 40 ఏళ్ల మహిళను లక్ష్యంగా చేసుకొని డిజిటల్ అరెస్ట్ మోసానికి పాల్పడ్డాడు. బాధితురాలికి ఆమె పేరుతో ఉన్న సమస్యకు సంబంధించి ఢిల్లీ హైకోర్టునుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన మహిళను మీ బ్యాంకు ఖాతా ద్వారా మోసపూరిత కార్యకలాపాలు, మనీ లాండరింగ్ లావాదేవీలు జరిగాయని పేర్కొన్న నిందితులు డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను 24 గంటలపాటు భయపెట్టారు. అనంతరం భారీ మొత్తం నగదును బదిలీ చేయించుకున్నారు. ఈ కేసులో ఈ కేసులో ఏ1గా కింగ్‌శుక్ శుక్లా, ఏ2గా కపిల్‌కుమార్ ఉన్నారు.
పనిచేసే సంస్థకే కన్నం
బంజారాహిల్స్: నమ్మకంగా పనిచేస్తూ పనిచేసే సంస్థకే ఉద్యోగి దాదాపు రూ.1.40 కోట్ల మోసానికి పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏషియన్ ముక్తా ఏ2 సినిమాస్‌లో దాదాపు ఏడున్నర ఏళ్లుగా విశ్వనాథ్‌రెడ్డి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో అతని భార్య సఫియా నజీర్ మేనేజర్‌గా పనిచేస్తుంది. ఈ నెల 18న ఏషియన్ ముక్తా సంస్థలో అంతర్గతంగా నిర్వహించిన ఆడిటింగ్‌లో భాగంగా విశ్వనాథ్‌రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసినట్లు గుర్తించారు.
చదవండి: సైబర్ మోసాల నుంచి తప్పించుకోండిలా..
నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించి సంస్థ రూ.1,47,08,928 నిధులను తన భార్య, సోదరుడు రాసిం రాజశేఖర్, స్నేహితుడు శశాంక్ పేరుతో ఉన్న ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. హిందుస్థాన్ కోకోకోలా బేవరేజస్, సాయి నైన్ ఎంటర్‌ప్రైజెస్‌ల పేర్లతో మొత్తం నాలుగు ఖాతాల్లోకి ఈ మొత్తం డబ్బును మళ్లించినట్లు గుర్తించారు. ఆడిటింగ్‌లో భాగంగా ఈ నిధుల గోల్‌మాల్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఏషియన్ ముక్తా ఏ2 సినిమాస్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ సునీల్ నారంగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులపై బీఎన్‌ఎస్ సెక్షన్ 316 (4), 318 (4), 335, 336 (3), 338, రెడ్ విత్ 3(5)ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు
తిరుపతి క్రైమ్: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గత వారం రోజుల్లో పలుమార్లు నగరంలోని ప్రముఖ హోటల్స్‌ను టార్గెట్ చేస్తూ బాంబులు పెట్టామని మెయిల్స్ ద్వారా బెదిరిస్తున్న దుండగులు తాజాగా తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్‌లో బాంబు పెట్టామని ఆదివారం బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసు యంత్రాంగం ఇస్కాన్ టెంపుల్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టింది. జాఫర్ సాధిక్ అనే పేరుతో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment