సాక్షి, హైదరాబాద్: చనిపోయిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సిమ్ కార్డుతో సైబర్ కేటుగాళ్లు రూ. లక్షలు కొట్టేశారు. ఈ మోసంలో కీలక నిందితుడు మహ్మద్ ఆసిఫ్ పాషాను కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసినట్టు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాల ప్రకారం..
పాత పరిచయాన్ని వాడి...
ఇరిగేషన్ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి 2013లో పదవీ విరమణ చేసిన ఎండీ సమీఉద్దీన్ 2022లో చనిపోయారు. సమీఉద్దీన్‌కు చెందిన ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్ ఖాతాలతోపాటు అతడి సోదరి సబిహా సుల్తానా ఎస్‌బీఐ ఖాతాకు సైతం సమీఉద్దీన్ ఫోన్‌నంబర్ లింక్ చేసి ఉంది. ఇరిగేషన్ విభాగంలో సమీఉద్దీన్ పనిచేసే సమయంలోనే జహంగీర్‌కు పాత పరిచయం ఉంది. దీంతో ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. సమీఉద్దీన్ చనిపోయిన తర్వాత అతడికి సంబంధించి వ్యక్తిగత వివరాలు తన వద్ద ఉండడంతో జహంగీర్ ఓ కుట్రకు తెరతీశాడు. మహ్మద్ ఆసిఫ్ పాషాకు ఈ విషయాలు చెప్పాడు.
దీంతో మహ్మద్ ఆసిఫ్ పాషా ఈ ఏడాది జూన్‌లో సమీఉద్దీన్ ఎయిర్‌టెల్ సిమ్‌కార్డును బ్లాక్ చేయించాడు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి వాటితో మళ్లీ తన పేరిట ఆ సిమ్‌కార్డును రీ యాక్టివేట్ చేయించాడు. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాలకు లింక్ అయి ఉన్న ఆ ఫోన్‌నంబర్‌తో ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే వంటి బ్యాంకింగ్ యాప్‌లు ఇన్‌స్టాల్ చేశాడు. వీటి ద్వారా సమీఉద్దీన్, ఆమె సోదరి సబిహా సుల్తానాల బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.20,18,557 తమ ఖాతాల్లోకి నిందితులిద్దరూ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. క్రెడిట్‌కార్డు బిల్లులు సైతం చెల్లించారు.
సబిహా సుల్తానా ఫిర్యాదుతో...
తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు పోతుండడంతో సబిహా సుల్తానా కరీంనగర్ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసిన సైబర్‌క్రైం పోలీసులు ఈ కేసులో ఏ–1గా ఉన్న మహ్మద్ ఆసిఫ్ పాషాను ఈనెల 23న అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.18 లక్షల నగదు, సెల్‌ఫోన్, క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు బిల్లులు స్వాదీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఏ–2 జహంగీర్ కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. డీఎస్పీ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కరీంనగర్ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ సిబ్బందిని టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ అభినందించారు. ప్రజలెవరూ బ్యాంకు ఖాతాలకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్లు ఇతరులకు చెప్పవద్దని ఆమె హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment