టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోయాయి. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో సంఘటన తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలో ఏకంగా 'ఇలాన్ మస్క్' (Elon Musk) పేరుతో మోసం చేశారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సౌత్ కొరియాకు చెందిన ఒక మహిళను ఓ వ్యక్తి ఇలాన్ మస్క్ పేరుతో మోసం చేసి, ఆమె దగ్గర నుంచి ఏకంగా రూ. 41 లక్షలు కాజేశారు. జియోంగ్ జిసన్ అనే మహిళ ఈ డబ్బు పోగొట్టుకున్నట్లు తెలిసింది.
నిజానికి జియోంగ్ జిసన్ ఇలాన్ మస్క్ జీవిత చరిత్ర చదివి, ఆయనకు పెద్ద అభిమానిగా మారిపోయింది. అయితే ఒక వ్యక్తి ఈమె ఇన్‌స్టాగ్రామ్‌ను ఇలాన్ మస్క్ పేరుతో ఉన్న అకౌంట్ ఫ్రెండ్స్ లిస్టులో యాడ్ చేసాడు. మొదట్లో అతడు మస్క్ అంటే నమ్మలేదు, కానీ అతడు మాట్లాడే మాటలు.. పనిచేసే ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసేవాడు. అప్పుడప్పుడు తన పిల్లల గురించి కూడా మాట్లాడేవాడు. ఇవన్నీ ఆ మహిళను నమ్మేలా చేసాయి.
మస్క్ పేరుతో పరిచయమైన వ్యక్తి ఆ తరువాత మహిళను (జియోంగ్ జిసన్) ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఒక సారి వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు కూడా సమాచారం. దీనికి డీప్‌ఫేక్ టెక్నాలజీ ఉపయోగించినట్లు మ్యానేజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇలా మాటలు సాగుతున్న కొంత కాలానికి స్కామర్ చివరికి 70 మిలియన్ కొరియన్ వోన్ లేదా 50,000 డాలర్లను పెట్టుబడిగా పెట్టమన్నాడు. తన వల్ల అభిమానులు ధనవంతులైతే.. నేను చాలా సంతోషిస్తానని స్కామర్ నమ్మబలికాడు. దీనికి సరేనన్న మహిళ స్కామర్ చెప్పిన డబ్బు పంపింది. చివరికి మోసపోయినట్లు తెలుసుకుంది.
నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మోసాలు జరగటం కొత్తేమీ కాదు. 2022 జనవరి నుంచి జూన్ మధ్యలోనే ఏకంగా 280 నేరాలు (సైబర్) జరిగినట్లు, దీని ద్వారా చాలా డబ్బు మోసపోయినట్లు సియోల్‌లోని కొరియా యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో తెలిసింది. మోసపోయినవారిలో 71.4 శాతం మంది మహిళలే ఉండటం ఇక్కడ గమనించదగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment