‘హాలో.. డాక్టర్‌ పూజానా‘.. మీరు అశ్లీల చిత్రాలు షేర్‌ చేస్తున్నారా? | Noida Doctor Puja Goyal Loses Of Rs 59 Lakh By Scammers As A Digital Arrest | Sakshi
Sakshi News home page

‘హాలో.. డాక్టర్‌ పూజానా‘.. మీరు అశ్లీల చిత్రాలు షేర్‌ చేస్తున్నారా?

Published Thu, Jul 25 2024 4:07 PM | Last Updated on Thu, Jul 25 2024 4:23 PM

Noida Doctor Puja Goyal Loses Of Rs 59 Lakh By Scammers  As A Digital Arrest

సైబర్‌ నేరస్తుడు : హలో పూజానా మాట్లాడేది. 

డాక్టర్‌ పూజా : హా చెప్పండి నేనే డాక్టర్‌ పూజాని మాట్లాడుతున్నాను.

సైబర్‌ నేరస్తుడు : మేడం మేం టెలిఫోన్‌ రెగ్యులరేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) నుంచి మాట్లాడుతున్నాం. మీ ఫోన్‌ నుంచి అశ్లీల చిత్రాలు షేర్‌ అవుతున్నాయని మాకు సమాచారం అందింది. మీరు ఆ ఫోన్‌ను అందుకే వినియోగిస్తున్నారంటగా? నిజమేనా? 

డాక్టర్‌ పూజా : అయ్యో లేదు సార్‌..నేను డాక్టర్‌ని, నేను ఫోన్‌ చాలా తక్కువగా వినియోగిస్తాను. అశ్లీల చిత్రాలు ఎందుకు షేర్‌ చేస్తాను. అసలు ఆ విషయం గురించి నాకు తెలియదు. 

సైబర్‌ నేరస్తుడు : లేదు.. లేదు. మీరు అశ్లీల చిత్రాలు షేర్‌ చేస్తున్నట్లు మా విచారణలో తేలింది. 

డాక్టర్‌ పూజా : లేదండి నేను నిజమే చెబుతున్నాను.  అశ్లీల చిత్రాలు షేర్‌ అవుతున్నాయని నాకు తెలియదు.  

సైబర్‌ నేరస్తుడు : సరే సరే మీరు నిజం చెబుతున్నారు. అలా అని మేం ఎలా నమ్మాలి. మీరు ఓ పని చేయండి. మేం మీకు వీడియో కాల్‌ చేస్తాం. ఆ వీడియో కాల్‌లో మీరే మాతో మాట్లాడాలి.  

డాక్టర్‌ పూజా : సరే ఇప్పుడే ఫోన్‌ చేయండి. నేనే మీతో వీడియో కాల్‌లో మాట్లాడుతాను

సైబర్‌ నేరస్తుడు : అవతలి నుంచి వీడియో కాల్‌ వచ్చింది. వీడియో కాల్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడింది. ఫలితం 48 గంటల పాటు డిజిటల్‌ అరెస్ట్‌ అయ్యింది. రూ.59 లక్షలు పోగొట్ఠుకుంది.

సైబర్‌ నేరస్తులు తెలివి మీరారు. ఈజీ మనీకోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. టెక్నాలజీ సాయంతో డిజిటల్‌ అరెస్ట్‌ చేసి బాధితుల్ని అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలా తాజాగా, డిజిటల్‌ అరెస్ట్‌తో నోయిడాకి చెందిన డాక్టర్ పూజా గోయల్‌ రూ.59 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది.  

నోయిడా సెక్టార్ 77లో నివసించే డాక్టర్ పూజా గోయల్‌కి జూలై 13న కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ట్రాయ్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆపై అశ్లీల  చిత్రాల్ని షేర్‌ చేసేందుకు మీ ఫోన్‌ వినియోగిస్తున్నారని మాకు సమాచారం అందిందంటూ పూజా గోయల్‌ని హెచ్చరించే ప్రయత్నం చేశాడు. పలు మార్లు  చేసిన తప్పు ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడు. అయితే బాధితురాలు పూజా మాత్రం జంకకుండా నా ఫోన్‌ నుంచి ఎలాంటి నీలి చిత్రాలు షేర్‌ చేయలేదని గట్టిగా బదులిచ్చింది. దీంతో కంగుతిన్న సైబర్‌ నేరస్తుడు డాక్టర్‌ పూజను తనదారికి తెచ్చేందుకు సంభాషణను కొనసాగించాడు.

 చివరికి తాను అనుకున్నట్లుగానే పూజ వీడియో కాల్‌ మాట్లాడేలా చేశాడు. వీడియో కాల్‌ ఆన్‌ చేసిన తర్వాత పూజా మాట్లాడింది. మాట్లాడే సమయంలో 48 గంటల పాటు ఓ రూంలో నిర్భందించాడు. ఆమె ఎక్కడి వెళ్లిపోకుండా తాను డాక్టర్‌ పూజా ఫోన్‌ గురించి చెప్పేది నిజమేనని నమ్మేలా చేశాడు. 48 గంటల నిర్భందంలో నిందితుడు బాధితురాలు ఫోన్‌ నుంచి రూ.రూ 59 లక్షల 54 వేల రూపాయలను తన బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను వదిలేశాడు. ఆ తర్వాతనే  బాధితురాలికి అర్ధమైంది తాను మోసపోయానని. లబోదిబో మంటూ నోయిడా సెక్టార్ 36లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

పూజా ఫిర్యాదుపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్) వివేక్ రంజన్ రాయ్ మాట్లాడుతూ.. బాధితురాలు ఏ బ్యాంక్‌ అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్‌ ఫర్‌ చేశారో సంబంధిత ఆధారాలు తమవద్ద ఉన్నాయని, వాటిపై ఓ స్పష్టత వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇలాంటి సైబర్‌ నేరాలు ఢిల్లీ-ఎన్సీఆర్‌ కేంద్రంగా ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయని, ఇప్పటికే ఇలాంటి డిజిటల్‌ అరెస్ట్‌కు సంబంధించిన ఓ పది కేసులు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు.  కాగా, అనుమానాస్పద కాల్స్‌ చేసి తాము ఫలానా డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రభుత్వ అధికారులమని, మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు బెదిరించినా, లేదా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం కోసం అడిగితే వెంటనే స్థానిక పోలిస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.  

డిజిటల్‌ అరెస్ట్‌ అంటే..
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్‌ నేరాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో సైబర్‌ నేరస్తులు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి సైబర్‌ మోసాల్లో ఈ డిజిటల్‌ అరెస్ట్‌ ఒకటి. ఇందులో సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్‌ కార్డు, ఆధార్‌ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్‌ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్‌ అరెస్ట్‌’.

డిజిటల్‌ అరెస్ట్‌ కొత్త సైబర్‌ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. డాక్టర్‌ పూజా గోయల్‌లాంటి ఘటనలే దీనికి నిదర్శనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement