ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో.. | Cyber Fraud Crime Cases Massive Increase in India 2024 | Sakshi
Sakshi News home page

ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో..

Published Fri, Nov 8 2024 7:13 PM | Last Updated on Sat, Nov 9 2024 2:03 PM

Cyber Fraud Crime Cases Massive Increase in India 2024

50 వేలు కట్టండి.. లక్ష రూపాయలు ఇస్తాం.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి మీ డబ్బులు డబుల్‌ త్రిపుల్ అవుతాయి.. మీరు డిజిటల్‌ అరెస్ట్ అయ్యారు.. ఇంత డబ్బులు చెల్లించకపోతే జైలు ఊసలు లెక్కపెడతారు..! మీ మొబైల్‌కి ఓటీపీ వచ్చిందా? అయితే ఇక్కడ టైప్ చేయండి లేదంటే మీ మొబైల్‌ హ్యాక్‌ అవుతుంది..! ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడితే రోజుకు 50 వేలు సంపాదించవచ్చు.. ఓ సారి ట్రై చేయండి..! ఇవన్నీ మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో విన్న మాటలు. ఇవి నమ్మినవాళ్లు ఇప్పటికీ చాలా డబ్బులే పొగొట్టుకోని ఉంటారు.

గతంలో సైబర్‌ ఫ్రాడ్‌ అంటే ఏదో న్యూస్‌లో వస్తే విన్న సందర్భాలే కానీ ఇప్పుడు మాత్రం ఆన్‌లైన్‌ మోసాల బాధితులు మన పక్కనే కనిపిస్తారు.. మన ఫ్రెండ్సో, ఫ్యామిలీ మెంబర్సో కేటుగాళ్ల వలలో చిక్కుకుని మన దగ్గర లబోదిబోమని బాధపడిన సందర్భాలు ఎక్కువే ఉండి ఉంటాయి. ఇప్పుడు సైబర్‌ ఫ్రాడ్‌ లెక్కలు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోటిపడుతున్నాయి.

త్వరలోనే సైబర్ ఫ్రాడ్ మోసాల ఎకానమీ సైజు...ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకుంటాయట. ఇది పోలీసులతో పాటు అనేకమంది ఆర్థిక నిపుణులు చెబుతున్న వాస్తవం! ఏంటి నమ్మడం లేదా? అయితే ఇప్పుడు మేం చెప్పబోయే లెక్కలు వింటే మీకే అర్థమవుతోంది.

రోజుకు 15,000 సైబర్‌ మోసాలు
ప్రతి 6 సెకన్లకు ఒకటి.. నిమిషానికి 10.. రోజుకు 15,000.. ఏడాదికి 50లక్షలు.. ఇది సైబర్‌ ఫ్రాడ్‌ మోసాల లెక్కలు. దేశంలో ప్రతి ఆరు సెకన్లకు ఓ వ్యక్తి సైబర్‌ వలలో చిక్కుకోని విలవిలలాడుతున్నడంటే నమ్మగలరా? ఒక్క 2022లోనే ఈ ఆన్‌లైన్‌ మోసాలకు 1.24 లక్షల కోట్లు కేటుగాళ్ల జేబుల్లోని వెళ్లాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సైబర్‌ ఫ్రాడ్‌ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ పౌరులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రతిరోజూ రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టపోతున్నారు.  

దేశంలోని మొదటి ఐదు సైబర్‌ ఫ్రాడ్‌ బాధిత రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక 2022లో అయితే సైబర్‌ ఫ్రాడ్‌ కేసుల్లో తెలంగాణ టాప్‌ పొజిషన్‌లో నిలిచింది. 96శాతం సైబర్ నేరాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇందులో మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయడం, ఇతరులతో పాటు మోసగాళ్లతో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం లాంటివి చేయడం కారణంగానే సైబర్‌ ఫ్రాడ్‌ కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెబుతోంది.

ఏడాదికి లక్షల కోట్లు
సైబర్ క్రైమ్ మోసాల డబ్బుల లెక్కలు ఏడాదికి లక్షల కోట్లు దాటుతుంది. ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ కనిపిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే 2035 నాటికి గ్లోబల్ సైబర్ క్రైమ్ నష్టం 10.5 ట్రిలియన్ల డాలర్లకు చేరుతుందన్నది నిపుణుల మాట. 10.5 ట్రిలియన్‌ డాలర్స్‌ అంటే ప్రస్తుత లెక్కల ప్రకారం 87 లక్షల కోట్లు. అంటే USA, చైనా తర్వాత ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఇది సమానం. ఇక అన్నిటికంటే బాధకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా సైబర్ ఫ్రాడ్‌ కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా టాప్‌-3లో ఉంది.

2023లో ఆన్‌లైన్ స్కామ్స్‌లో భారత్‌  భయంకరమైన పెరుగుదలను చూసింది. ఆ ఒక్క ఏడాదే దాదాపు 8 కోట్ల సైబర్‌ దాడులు రికార్డయ్యాయి. ఇటు తెలంగాణలో సైబర్ మోసాల కేసులు 2022 నుంచి బాగా పెరిగాయి. ముఖ్యంగా సైబరాబాద్‌ పరిధిలోని ఏరియాల్లో సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. 2023లో 5,342 సైబర్ మోసం కేసులు ఈ ఏరియాల్లోనే రికార్డయ్యాయి. ఈ కేసులకు సంబంధించి సుమారు రూ.46 కోట్ల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రికార్డవని కేసులు, పరువు పోతుందన్న భయంతో పోలీస్‌స్టేషన్‌ గడప వరకు రాని కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

సైబర్ నేరాలకు హాట్‌స్పాట్‌లు
ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి పట్టణాలు సైబర్ నేరాలకు హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి, కేసుల్లో దాదాపు 40శాతం సిటీస్‌ నుంచే రికార్డవుతున్నాయి. అయితే అటు గ్రామీణ ప్రాంతాల ప్రజలనే కేటుగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. పల్లెటూర్లు, టౌన్స్‌ నుంచి సిటీలకు చదువు కోసం ఉద్యోగాల కోసం వచ్చేవారిలో ఎక్కువగా బాధితులు ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే విలేజ్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్నవారికి డిజిటల్ భద్రతా పద్ధతులపై అవగాహన తక్కువగా ఉంటుందట. అందుకే మోసగాళ్ల ట్రాప్‌లో చిక్కుకుని వీరంతా బలైపోతున్నారు.

నకిలీ క్రిప్టోకరెన్సీ పాత్ర
సైబర్‌ ఫ్రాడ్‌ కేసుల్లో నకిలీ క్రిప్టోకరెన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముందుగా కొంచెం ఇన్‌వెస్ట్‌ చేయమని అడుగుతారు. ఈ పెట్టుబడికి తగ్గట్టుగా కాస్త డబ్బు ఇస్తారు. ఆ తర్వాత పెట్టుబడి ఎక్కువ పెట్టాలని.. అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపెడతారు.. ఆ తర్వాత మొత్తం దోచుకుంటారు. ఇక KYC అప్‌డేట్‌ మెయిల్ లింక్స్‌, వాట్సాప్‌లో ఇన్‌స్టాంట్‌ లోన్‌ మెసేజీలు పట్ల కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇక బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు లేదా మార్కెట్‌లో మంచి పేరున్న కంపెనీలను డూప్‌ చేస్తూ నకిలీ ఇమెయిల్స్‌ పంపుతారు. ఆ మెసేజీలు అచ్చం బ్యాంక్‌వారు పంపినట్టే ఉంటాయి.. లోగో కూడా వారిదే ఉంటుంది. ఆ తర్వాత అక్కడున్న లింకులు క్లిక్‌ చేస్తే మొబైల్‌ హ్యాక్‌కు గురవుతుంది. ఇలాంటి ఎన్నో ఫ్రాడ్లు నిత్యం జరుగుతున్నాయి. ఇక ఇటీవల బడా పారిశ్రమికవేత్తలు డిజిటల్‌ అరెస్టుల ఫ్రాడ్‌లకు చిక్కుతున్నారు. కోట్ల రూపాయలు పొగొట్టుకుంటున్నారు.

డిజిటల్‌ అరెస్ట్ తర్వాత వచ్చే వీడియో కాల్‌లో సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు సెటప్‌ ఉంటుంది. నేరుగా డూప్‌ సీజేఐ మాట్లాడతారు..! కేటుగాళ్ల తెలివి ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే. అందుకే ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిస్తే అంతే సంగతి, కష్టపడి సంపాదించుకున్నదంతా క్షణకాలంలో ఆవిరైపోతుంది. బతుకులను వీధిపాలు చేస్తుంది, ప్రాణాలను కూడా బలితీసుకుంటుంది. మీ పిల్లలను, తల్లిదండ్రులను దిక్కులేనివారిని చేస్తుంది..! సో బీకేర్ ఫుల్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement