విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్ MaaSharma Comments On Increase Of Cyber Crime Rates | Sakshi
Sakshi News home page

విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్

Published Sun, May 19 2024 1:35 PM

MaaSharma Comments On Increase Of Cyber Crime Rates

సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుఆపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ కొత్త కొత్త రూపాలలో ఈ నేరాలు వెలుగుచూస్తున్నాయి. పోలీస్ డ్రెస్ వేసుకొని, పోలీస్టేషన్ ఆఫీస్ బ్యాంక్ గ్రౌండ్‌లో కూర్చొని పోలీసులమని చెబుతూ  నేరగాళ్ళు అమాయకులతో ఆడుకుంటున్నారు. మీమీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మీ పేరుతో మొబైల్ నెంబర్  తీసుకున్నట్లు సమాచారం వుందని, ఆ నెంబర్ నుంచి నేరమయమైన కమ్యూనికేషన్ ఉందని, మీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఉందని, అందులో కోట్లాదిరూపాయల లావాదేవీలు జరిగాయని, మనీ ల్యాండరింగ్ కేసు బుక్ అయిందని, విదేశాల లావాదేవీలు కూడా జరిగాయని, మీరు వెంటనే ముంబయి పోలీస్ స్టేషన్‌కు రావాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని, మీరు మాకు సహకరిస్తే, మిమ్మల్ని ఈ మోసం నుంచి కాపాడుతామని చెబుతూ, అమాయకుల నుంచి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడం మొదలైన చర్యలు ఈ నేరగాళ్ళు చేస్తున్నారు.

పోలీసులు వేషాలతో, పోలీసులు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లుగా వాట్సాప్‌లో వీడియో కాల్‌లో మాట్లాడుతూ అమాయకులతో ఆడుకుంటున్నారు. పోలీస్ వేషంలో ఉండడంతో, నిజమైన పోలీసులే ఆనుకొని, తమ నిజాయితీని నిరూపించుకొనే దిశగా అమాయకంగా సమాచారం ఇస్తూ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ అని, ఇలా ఎన్నో రకాలుగా సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ ఎదుర్కొంటున్నవాళ్ళలో మేధావులు, చదువుకున్నవాళ్ళు కూడా ఉండడం గమనించదగిన అంశం. జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ ఉన్నత ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన కలిపించే దిశగా పోలీసులు, సైబర్ సాంకేతిక నిపుణులు, సంబంధిత వర్గాలు, మేధావులు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు కృషి చేస్తూనే వున్నారు.

కమ్యూనికేషన్ రంగం విస్తృతంగా ప్రజలకు చేరుతోంది. దానికి తగ్గట్టుగా విజ్ఞానం, మెలుకువలు పెరగడం లేదన్నది వాస్తవం. దేశంలోనూ,ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది సైబర్ మోసాలకు బలవుతున్నారు. మోసపోతున్నవారిలో నిరక్షరాస్యులే కాదు అక్షరాస్యులు కూడా ఉంటున్నారు. ఆ మధ్య మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఈ తీరుకు అద్దం పట్టింది. న్యాయస్థానంలో సూపరింటెండెంటుగా పనిచేసి రిటైరయిన ఓ మహిళ ఏకంగా కోటి రూపాయలకు పైగా పోగొట్టుకుంది.

కేవలం సోషల్ మీడియాలో పరిచయాలు, తదనంతర పరిణామాలు ఈ మోసానికి ఆసరాగా నిలిచాయి. బంగారం బహుమతులుగా అందుకోండని యూకే నుంచి వచ్చిన ఫోన్ కు ఆమె చిక్కుకున్నారు. కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పగానే వెంటనే 1.12 కోట్లు ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, ఫోన్ కు కూడా అందకుండా ఉన్న పరిస్థితి ఎదురైంది. మోసపోయానని గ్రహించిన తర్వాత ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బహుమతులు వచ్చాయి, పన్ను కట్టాలని ఫోన్ వచ్చినప్పుడే పోలీసులను సంప్రదించి వుంటే? ఆమె నష్టపోయేది కాదు.

చేతిలో ఫోన్ ఉంది కదా! అని ముక్కుముఖం తెలియనివారితో స్నేహం చేయడమే మొదటి తప్పు. మనకు సంబంధించిన సమాచారం అందరితో పంచుకోవడం రెండో తప్పు. బహుమతులకు ఆశపడడం ఇంకో తప్పు. ఇటువంటి ఫోన్స్, మెసేజెస్ వచ్చినప్పుడు ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళక పోవడం అంతకు మించిన తప్పు.

జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఎవరినన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇలా ఎన్నో మోసాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈమెయిల్స్, మెసేజెస్ రూపంలో ప్రతిరోజూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇక లోన్ యాప్ ల దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మెసేజెస్ రావడమే ఆలస్యం వెంటనే క్లిక్ చేసి కొంతమంది దొరికిపోతున్నారు.

లక్ష పెట్టుబడితో కేవలం 8 నెలల్లోనే 4 కోట్లు సొంతం చేసుకోండని కనిపించిన యాప్‌ను చూసి వెంటనే డబ్బులు కట్టేసి ఎంతోమంది మోసపోయిన వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్‌లో ఆ భారీ మోసం జరిగింది. ఈ మోసం విలువ 100కోట్ల పైనేనని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పూర్తిగా దర్యాప్తు జరిగితే మోసాల చిట్టా మరింత బయటపడుతుంది. ఇలాంటి సంస్థలు దేశ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

మోసపోయాక లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తున్నారు. సాధారణంగా ఆన్ లైన్ ట్రేడింగ్‌కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి. ప్రజలవ్వేమీ చూసుకోవడం లేదు. మొదటిది అవగాహన లేకపోవడం, రెండోది అత్యాశ. ఫోన్స్ హ్యాక్ చేస్తూ కోట్లాది రూపాయలు కొట్టేసిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాం. నకిలీ యాప్స్ తో పాటు నకిలీ పేర్లతో సోషల్ మీడియా వేదికలు కూడా నిర్మించి మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ మెయిల్స్ కూడా సృష్టిస్తున్నారు.

వాట్సాప్ స్టేటస్‌లు చూసి కొందరు మోసపోతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆధార్ కార్డు అనేక విభాగాలతో అనుసంధానమై ఉండడం వల్ల కూడా ఇటువంటి నేరాలకు అవకాశం ఇస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంపై విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే సామాన్యుల రక్షణ ప్రశ్నార్ధకమవుతోంది. బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకోవాలా? లేదా అనే సందేహాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి.

ఈ సైబర్ మోసాలు ఇన్నిన్ని కాదయా! అని చెప్పవచ్చు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం, అత్యాశకు పోకుండా ఉండడం, అందరినీ నమ్మకుండా ఉండడం, ముందుగానే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించడం తప్ప వేరు మార్గాలు లేవు. కోట్లాదిగా పెరిగిపోతున్న నకిలీ సైబర్ వ్యవస్థలను పూర్తిగా నియంత్రించే శక్తి ఏ ప్రభుత్వాలకు ఉండదు. స్వయం నియంత్రణ కూడా అవసరం.
-మాశర్మ

Advertisement
 
Advertisement
 
Advertisement