బెదిరింపులతో బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్ల యత్నాలు
మోసపోవద్దంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) పేరిట వచ్చే తప్పుడు లేఖలు, నోటీసులు నమ్మి మోసపోవద్దని ఐ4సీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ‘మీరు ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూశారు..ఇది సైబర్ నేరం కిందకు వస్తుంది..మీరు వెంటనే మా నోటీసులకు స్పందించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది..’అని ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్) సీఈఓ పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ నోటీసులు పంపుతున్నారు.
మీరు చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినట్టుగా మీ ఐపీ అడ్రస్ మా దగ్గర ఉందంటూ బెదిరిస్తున్నారు. విషయం తెలియక, ఈ బెదిరింపులకు హడలిపోయి ఎవరైనా వారిని సంప్రదిస్తే అప్పుడు అసలు మోసానికి తెరతీస్తున్నారు. కేసు నమోదు కాకుండా చూడాలంటే సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇవి అచ్చంగా నిజమైన అధికారుల నుంచే వచ్చినట్టుగా నమ్మించేలా ఈ నోటీసులను తయారు చేస్తున్నారు.
ఇందులో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోల లోగోలు, అధికారుల పేరిట సంతకాలు, వాటి కింద స్టాంప్‌లు సైతం ఉంటున్నాయి. పోక్సో, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామంటూ ఆ నోటీసులలో పేర్కొంటున్నారు. ఇలా అచ్చంగా నిజమైనవిగా భ్రమింపజేసే నోటీసులతో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఐ4సీ అధికారులు వెల్లడించారు. అలాంటి లేఖలు, నోటీసులన్నీ ఫేక్ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇలాంటి నోటీసులకు స్పందించవద్దని, నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment