CCC
-
మీరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూశారు!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) పేరిట వచ్చే తప్పుడు లేఖలు, నోటీసులు నమ్మి మోసపోవద్దని ఐ4సీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ‘మీరు ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూశారు..ఇది సైబర్ నేరం కిందకు వస్తుంది..మీరు వెంటనే మా నోటీసులకు స్పందించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది..’అని ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్) సీఈఓ పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ నోటీసులు పంపుతున్నారు. మీరు చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినట్టుగా మీ ఐపీ అడ్రస్ మా దగ్గర ఉందంటూ బెదిరిస్తున్నారు. విషయం తెలియక, ఈ బెదిరింపులకు హడలిపోయి ఎవరైనా వారిని సంప్రదిస్తే అప్పుడు అసలు మోసానికి తెరతీస్తున్నారు. కేసు నమోదు కాకుండా చూడాలంటే సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇవి అచ్చంగా నిజమైన అధికారుల నుంచే వచ్చినట్టుగా నమ్మించేలా ఈ నోటీసులను తయారు చేస్తున్నారు. ఇందులో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోల లోగోలు, అధికారుల పేరిట సంతకాలు, వాటి కింద స్టాంప్‌లు సైతం ఉంటున్నాయి. పోక్సో, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామంటూ ఆ నోటీసులలో పేర్కొంటున్నారు. ఇలా అచ్చంగా నిజమైనవిగా భ్రమింపజేసే నోటీసులతో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఐ4సీ అధికారులు వెల్లడించారు. అలాంటి లేఖలు, నోటీసులన్నీ ఫేక్ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇలాంటి నోటీసులకు స్పందించవద్దని, నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. -
బాలీవుడ్ vs టాలీవుడ్ టీ20 మ్యాచ్ (ఫొటోలు)
-
సీసీసీ నిత్యావసరాలు కొందరికే..
జూబ్లీహిల్స్: లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన సీసీసీ కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న నిత్యావసరాలు కొందరికే పంపిణీ చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని నిరసిస్తూ కార్మికులు ఇందిరానగర్ ప్రాంతంలోని కార్యాలయాల వద్ద బుధవారం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సీసీసీ ఆధ్యర్యంలో మొదటి విడతగా కార్మికులకు నేరుగా సరుకులు అందించగా రెండో విడత కార్మిక యూనియన్ల ద్వారా అందించాలని నిర్ణయించారు. తరువాత మాటమార్చిన సీసీసీ అందరికి ఇవ్వలేమని, కొందరు సభ్యులకు మాత్రమే ఇస్తామని పేర్కొంది. దీంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. కేవలం సగం మందికే సరుకులు ఇస్తామని చెప్పడంతో యూనియన్ నాయకులకు కూడా ఏమిచేయాలో అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న తెలుగు సినీటీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్, తెలుగు లైట్‌మెన్ యూనియన్, తెలుగు సినీ స్టూడియోవర్కర్స్ యూనియన్లకు చెందిన సభ్యులు బుధవారం కార్యాలయాలను ముట్టడించి ఆందోళనకు దిగారు. మూడునెలలుగా షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమస్యను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు. -
'సినీ ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాదే'
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారితో సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోయిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సినిమా, సీరియళ్ల షూటింగ్‌కు సంబంధించి త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుదంటూ ఇండస్ట్రీకి చెందిన పలువురు మంగళవారం తలసానిని కలిసి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. 'కరోనా వల్ల ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికి ఇబ్బంది, నష్టం కలిగిన మాట వాస్తవమే. కానీ త్వరలోనే మంచి రోజులు వస్తాయి. సినిమా, సీరియళ్ల షూటింగ్లపైనే ఆధార పడి చాలా మంది కార్మికులు బతుకుతున్నారు. వారందరికి రేషన్ కార్డుల ద్వారా ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం.అలాగే కరోనా క్రైసిస్ చారిటీ(సిసిసి) ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇప్పటివరకు సిసిసి ద్వారా 14 వేల మంది సినీ కార్మకులను ఆదుకోవడం గొప్ప విషయం. సినిమా పెద్దలతో మీటింగ్ లు జరిగాయి. కరోనాతో బ్రేక్ పడింది.. కానీ బెస్ట్ పాలసీ తో ముందుకు వస్తాం. లాక్డౌన్ తర్వాత ఇండస్ట్రీ తో చర్చలు జరుపుతాం. సింగిల్ విండో పాలసీ తో ముందుకు వెళ్తాము. షూటింగ్ విషయం లో ఒక నిర్ణయం తప్పకుండా తీసుకుంటాం. జూన్ నుంచి షూటింగ్ లు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై రెండు రాష్ట్రాలు చర్చించి త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తాం' అంటూ తలసాని పేర్కొన్నారు. సినీ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ... చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీకి లీడ్ తీసుకొని చెయ్యడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు . ఇప్పటివరకు 14వేల మంది సినీ వర్కర్స్ కి నిత్యావసరాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికీ వైజాగ్, విజయవాడ, తిరుపతి లో కూడా వున్న సినీ వర్కర్స్ కి ఇచ్చామని, ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ సీసీసీ సహాయం చేస్తుందని వెల్లడించారు. లాక్ డౌన్ తరువాత చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వం తో చర్చలు జరుపుతామని తెలిపారు. (ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు..) (‘జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగితే గయ్యిమని ఎగవడకు’) -
పక్కా వ్యూహంతో ప్రశాంతం
సాక్షి, సిటీబ్యూరో: దాదాపు రెండు నెలలుగా అధికారులు తీసుకున్న చర్యలు, పోలీసుల వ్యూహం ఫలించాయి. ఫలితంగా గురువారం కనీసం ఒక్క ఉదంతం కూడా లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) నుంచి ఉన్నతాధికారులు పరిస్థితుల్ని ఆద్యంతం పర్యవేక్షించారు. నగర కోత్వాల్ అంజనీ కుమార్‌తో పాటు ప్రత్యేకాధికారిగా వచ్చిన ఐజీ శశిధర్‌రెడ్డి సైతం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బేరీజు వేయడంతో పాటు డీజీపీ కార్యాలయంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పరిస్థితిని సమీక్షించారు. 2014 ఎన్నికల నేపథ్యంలో సిటీలో మొత్తం 24 కేసులు నమోదు కాగా... ఈసారి ఒక్కటీ నమోదు కాకపోవడం గమనార్హం. మూడు విభాగాలుగా విభజించి.. ఎన్నికల నోటిషికేషన్ వెలువడిన నాటి నుంచి రంగంలోకి దిగిన సిటీ ఎలక్షన్ సెల్ వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. పోటీ చేసే అభ్యర్థులు, వారి వివరాలు, అనుచరుల కదలికలు తదితర అంశాలను పక్కాగా బేరీ జు వేయగలిగింది. నగర నిఘా విభాగమైన స్పెష ల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు, క్షేత్రస్థాయి సి బ్బంది అందించిన సమాచారం కీలకంగా మారింది. వీటి ఆధారంగా పోలీసులు అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను పక్కాగా గుర్తించగలిగారు. ఫలితంగా నాలుగు నియోజకవర్గాలతో పాటు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలను ఈ కేటగిరీల్లోకి తీసుకువచ్చారు. షాడో పార్టీల సమాచారంతో.. దాదాపు ప్రతి అభ్యర్థితో పాటు అనుచరుల్లోనూ కీలకమైన వారిని అనునిత్యం వెంటాడటానికి నగర పోలీసులు షాడో టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు వారి కదలికల్ని కనిపెట్టి సమాచారం అందిస్తూ వచ్చాయి. వీటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. పోలింగ్ రోజున కూడా దాదాపు 100 పార్టీలు విధుల్లో ఉన్నాయి. ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోగలిగారు. మరోపక్క రెండు నెలలుగా రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులకు కౌన్సిలింగ్, బైండోవర్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టి పెట్టారు. నగరం బయట, అజ్ఞాతంలో ఉన్న వారి వల్లా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ ‘రెండు’ గంటలు.. పోలింగ్ రోజు చివరి రెండు గంటలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 మధ్య సమయం అత్యంత కీలకం. ఈ వేళల్లోనే దొంగ ఓట్లు ఎక్కువగా పడటం, ఘర్షణలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్‌కు రాని వారి వివరాలు సేకరించే కొన్ని పక్షాలు వారి పేర్లతో వేరే వారిని పంపి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నింస్తుంటారు. దీన్ని అడ్డుకోవడానికి ఇతర పార్టీలు ప్రయత్నాలు చేయడం ఘర్షణలు, గొడవలు దారి తీస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ‘ఆ రెండు’ గంటలూ అత్యంత అప్రమత్తమైంది. రిజర్వ్‌లో ఉన్న బలగాలను సైతం ఏరియాల్లోకి పంపించి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. ఈసారి పోలింగ్ బూత్లబాధ్యత కేంద్ర బలగాలకు.. కేంద్ర ఎన్నికల సంఘం గతానికి భిన్నంగా ఈసారి పోలింగ్ బూత్‌ల బాధ్యతల్ని కేంద్ర సాయుధ బలగాలకు అప్పగించింది. స్థానికంగా పని చేసే పోలీసు అధికారులు ఫలానా వ్యక్తి గెలుస్తాడనో, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో పరోక్షంగా వారికి సహకరించే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడం కోసం ఈసారి కూడా ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాన్నే ఇక్కడా అమలు పరిచింది. అక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే స్థానిక పోలీసుస్టేషన్ ఇన్చార్జ్ (జిల్లాల్లో ఎస్ఐ, కమిషనరేట్లలో ఇన్స్పెక్టర్)లతో పాటు పోలీసు సిబ్బందికి బూత్‌ల బాధ్యతలు అప్పగించలేదు. అక్కడి భద్రత, బందోబస్తుల్ని కేంద్ర బలగాలకు అప్పగించింది. ఇదే వి«ధానాన్ని ఇక్కడా అమలు చేస్తూ ఎస్ఎస్బీ బలగాలను పోలింగ్ బూత్ ఎంట్రన్స్‌ల వద్ద మోహరించింది. సైబరాబాద్, రాచకొండ పరిధిలో.. సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే జీడిమెట్ల, భగత్‌సింగ్ నగర్, చింతల్, షాపూర్‌నగర్, గాజులరామారం, ఎల్లమ్మబండ, మూసాపేట్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నౌ నంబర్, సిక్ చావనీ, ఎన్ఎఫ్డీబీ, హసన్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లిలోని పద్మశాలీపురం, శాస్త్రిపురం, కాటేదాన్ పోలింగ్ కేంద్రాలను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు, టెంట్లు, వృద్ధులకు వీల్ చైర్లు తదితర వసతులను పరిశీలించారు. అంతకు ముందు నాంపల్లిలోని వ్యాయామ్ శాల హై స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో భార్య అనుపతో కలిసి ఓటు హక్కును సజ్జనార్ వినియోగించుకున్నారు. అలాగే మల్కాజ్గిరి, భువనగిరితో పాటు మరో మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. భువనగిరి, మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గాల్లోని పొలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి భద్రతా ఏర్పాట్లను వీక్షించారు. -
తిరుపతిపై నిఘా నేత్రం!
కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఆలయ పట్టణం తిరుపతిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూసేందుకు రాష్ట్ర పోలీసు విభాగం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిఘా నేత్రాన్ని మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పటికే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)ని నెలకొల్పి పట్టణవ్యాప్తంగా 184 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. వీటి సంఖ్యను 600కు పెంచాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అదేసమయంలో ఈ పైలట్ ప్రాజెక్టును రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నాలకూ విస్తరించాలని యోచిస్తోంది. తిరుపతి సురక్షితానికే: శరవేగంగా విస్తరిస్తున్న తిరుపతిని సురక్షిత ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ జాస్తి వెంకట రాముడు గతంలో ఆదేశాలిచ్చారు. ఆ మేరకు రాయలసీమ ఐజీ వి.వేణుగోపాలకృష్ణ, చిత్తూరు ఎస్పీ జి.శ్రీనివాస్ తిరుపతిలో నేరగాళ్లకు చెక్ చెప్పడంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకోసం వినియోగానికి, భద్రతాంశాలకు సమప్రాధాన్యమిస్తూ సీసీసీ ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిదశలో.. కీలకంగా భావిస్తున్న 184 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సీసీసీతో అనుసంధానించారు. ఇక్కడుండే సిబ్బంది అనునిత్యం సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న దృశ్యాలను అధ్యయనం చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్నవారికి అవసరమైన సూచనలిస్తుంటారు. ఇది అందుబాటులోకొచ్చిన రెండు నెలల్లోనే చెప్పుకోదగిన ఫలితాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. పలు చైన్స్నాచింగ్స్తోపాటు ఇతర నేరాలు జరిగిన కొన్ని నిమిషాల్లోనే నిందితుల్ని గుర్తించి పట్టుకున్నారు. ఇటీవల సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం దృష్టికి అధికారులు ఈ అంశాలను తీసుకెళ్లారు. సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం నిఘా నేత్రం విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పట్టణంలోకి దారితీసే రహదారులతోపాటు పలుప్రాంతాల్లో 600 కెమెరాల ఏర్పాటుకు డీజీపీ కార్యాలయం ప్రతిపాదనలు రూపొందిస్తోంది. కెమెరాలేగాక వీడియో అనలిటిక్స్ పేరుతో ఆధునిక సాఫ్ట్‌వేర్స్‌ను సమీకరించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు తిరుపతిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకొచ్చాక రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నారు. వీడియో అనలిటిక్స్‌లో ఉండేవివీ.. ఫేసియల్ రికగ్నేషన్ సిస్టం: సీసీసీలోని సర్వర్‌లో పాత నేరగాళ్లు, వాంటెడ్ వ్యక్తులేగాక మిస్సింగ్ కేసుల్లోని వారి ఫొటోలను నిక్షిప్తం చేస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌వల్ల పట్టణంలోని ఏ కెమెరా ముందుకైనా వీరొస్తే కంప్యూటర్ తక్షణం గుర్తించి సిబ్బందికి తెలియజేస్తుంది. సస్పీషియస్ అలార్మింగ్ సిస్టమ్: ఎవరైనా అనుమానిత వ్యక్తి, వస్తువు, వాహనం ఓ ప్రదేశంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు కదలకుండా ఉంటే దాన్ని కెమెరా ద్వారా కంప్యూటర్ గుర్తించి అలారమ్‌తో సమాచారమిస్తుంది. ఆటోమేటెడ్ నంబర్‌ప్లేట్ రికగ్నేషన్ సిస్టం(ఏఎన్పీఆర్): వాహనాల నంబర్ప్లేట్లను గుర్తించడానికి ఇది ఉపకరిస్తుంది. చోరీ వాహనాలు, హిట్ అండ్ రన్ కేసుల్లో ఉన్నవాటితోపాటు భారీగా ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలు పట్టణంలో ఎక్కడ తిరిగినా గుర్తించే కెమెరాలు సీసీసీలో ఉన్నవారిని అప్రమత్తం చేస్తాయి. సిట్యువేషన్ మేనేజ్మెంట్ సిస్టం పట్టణవ్యాప్తంగా ఎక్కడైనా బాంబు పేలినా, తుపాకీ కాల్పులు జరిగినా, అగ్నిప్రమాదం సంభవించినా ఈ సిస్టంతో అనుసంధానించి ఉన్న కెమెరాలు గుర్తించి సమాచారమిస్తాయి.