తిరుపతిపై నిఘా నేత్రం! | Tirupati, the eye of intelligence! | Sakshi
Sakshi News home page

తిరుపతిపై నిఘా నేత్రం!

Published Fri, Feb 13 2015 3:56 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

తిరుపతిపై నిఘా నేత్రం! - Sakshi

తిరుపతిపై నిఘా నేత్రం!

  • కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
  • సాక్షి, హైదరాబాద్: ఆలయ పట్టణం తిరుపతిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూసేందుకు రాష్ట్ర పోలీసు విభాగం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిఘా నేత్రాన్ని మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పటికే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)ని నెలకొల్పి పట్టణవ్యాప్తంగా 184 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. వీటి సంఖ్యను 600కు పెంచాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అదేసమయంలో ఈ పైలట్ ప్రాజెక్టును రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నాలకూ విస్తరించాలని యోచిస్తోంది.
     
    తిరుపతి సురక్షితానికే: శరవేగంగా విస్తరిస్తున్న తిరుపతిని సురక్షిత ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ జాస్తి వెంకట రాముడు గతంలో ఆదేశాలిచ్చారు. ఆ మేరకు రాయలసీమ ఐజీ వి.వేణుగోపాలకృష్ణ, చిత్తూరు ఎస్పీ జి.శ్రీనివాస్ తిరుపతిలో నేరగాళ్లకు చెక్ చెప్పడంతోపాటు ట్రాఫిక్  నియంత్రణకోసం వినియోగానికి, భద్రతాంశాలకు సమప్రాధాన్యమిస్తూ సీసీసీ ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిదశలో.. కీలకంగా భావిస్తున్న 184 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సీసీసీతో అనుసంధానించారు.

    ఇక్కడుండే సిబ్బంది అనునిత్యం సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న దృశ్యాలను అధ్యయనం చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్నవారికి అవసరమైన సూచనలిస్తుంటారు. ఇది అందుబాటులోకొచ్చిన రెండు నెలల్లోనే చెప్పుకోదగిన ఫలితాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. పలు చైన్‌స్నాచింగ్స్‌తోపాటు ఇతర నేరాలు జరిగిన కొన్ని నిమిషాల్లోనే నిందితుల్ని గుర్తించి పట్టుకున్నారు. ఇటీవల సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం దృష్టికి అధికారులు ఈ అంశాలను తీసుకెళ్లారు.

    సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం నిఘా నేత్రం విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పట్టణంలోకి దారితీసే రహదారులతోపాటు పలుప్రాంతాల్లో 600 కెమెరాల ఏర్పాటుకు డీజీపీ కార్యాలయం ప్రతిపాదనలు రూపొందిస్తోంది. కెమెరాలేగాక వీడియో అనలిటిక్స్ పేరుతో ఆధునిక సాఫ్ట్‌వేర్స్‌ను సమీకరించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు తిరుపతిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకొచ్చాక రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నారు.
     
    వీడియో అనలిటిక్స్‌లో ఉండేవివీ..

    ఫేసియల్ రికగ్నేషన్ సిస్టం: సీసీసీలోని సర్వర్‌లో పాత నేరగాళ్లు, వాంటెడ్ వ్యక్తులేగాక మిస్సింగ్ కేసుల్లోని వారి ఫొటోలను నిక్షిప్తం చేస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌వల్ల పట్టణంలోని ఏ కెమెరా ముందుకైనా వీరొస్తే కంప్యూటర్ తక్షణం గుర్తించి సిబ్బందికి తెలియజేస్తుంది.
     
    సస్పీషియస్ అలార్మింగ్ సిస్టమ్: ఎవరైనా అనుమానిత వ్యక్తి, వస్తువు, వాహనం ఓ ప్రదేశంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు కదలకుండా ఉంటే దాన్ని కెమెరా ద్వారా కంప్యూటర్ గుర్తించి అలారమ్‌తో సమాచారమిస్తుంది.
     
    ఆటోమేటెడ్ నంబర్‌ప్లేట్ రికగ్నేషన్ సిస్టం(ఏఎన్‌పీఆర్): వాహనాల నంబర్‌ప్లేట్లను గుర్తించడానికి ఇది ఉపకరిస్తుంది. చోరీ వాహనాలు, హిట్ అండ్ రన్ కేసుల్లో ఉన్నవాటితోపాటు భారీగా ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలు పట్టణంలో ఎక్కడ తిరిగినా  గుర్తించే కెమెరాలు సీసీసీలో ఉన్నవారిని అప్రమత్తం చేస్తాయి.
     
    సిట్యువేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం

    పట్టణవ్యాప్తంగా ఎక్కడైనా బాంబు పేలినా, తుపాకీ కాల్పులు జరిగినా, అగ్నిప్రమాదం సంభవించినా ఈ సిస్టంతో అనుసంధానించి ఉన్న కెమెరాలు  గుర్తించి సమాచారమిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement