fake notice
-
మీరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూశారు!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) పేరిట వచ్చే తప్పుడు లేఖలు, నోటీసులు నమ్మి మోసపోవద్దని ఐ4సీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ‘మీరు ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూశారు..ఇది సైబర్ నేరం కిందకు వస్తుంది..మీరు వెంటనే మా నోటీసులకు స్పందించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది..’అని ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్) సీఈఓ పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ నోటీసులు పంపుతున్నారు. మీరు చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినట్టుగా మీ ఐపీ అడ్రస్ మా దగ్గర ఉందంటూ బెదిరిస్తున్నారు. విషయం తెలియక, ఈ బెదిరింపులకు హడలిపోయి ఎవరైనా వారిని సంప్రదిస్తే అప్పుడు అసలు మోసానికి తెరతీస్తున్నారు. కేసు నమోదు కాకుండా చూడాలంటే సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇవి అచ్చంగా నిజమైన అధికారుల నుంచే వచ్చినట్టుగా నమ్మించేలా ఈ నోటీసులను తయారు చేస్తున్నారు. ఇందులో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోల లోగోలు, అధికారుల పేరిట సంతకాలు, వాటి కింద స్టాంప్‌లు సైతం ఉంటున్నాయి. పోక్సో, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామంటూ ఆ నోటీసులలో పేర్కొంటున్నారు. ఇలా అచ్చంగా నిజమైనవిగా భ్రమింపజేసే నోటీసులతో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఐ4సీ అధికారులు వెల్లడించారు. అలాంటి లేఖలు, నోటీసులన్నీ ఫేక్ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇలాంటి నోటీసులకు స్పందించవద్దని, నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. -
Odisha College: ‘ఆ రోజులోపు బాయ్‌ఫ్రెండ్ ఉండాల్సిందే’
పారాదీప్(ఒడిశా): ‘కళాశాలలో చదివే ప్రతి ఒక్క అమ్మాయి ప్రేమికుల దినోత్సవం రోజుకల్లా బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించాలి. లేదంటే కాలేజీలోకి అనుమతించబోము’ అంటూ ఒడిశాలో ఒక కాలేజీ తరఫున అధికారికంగా వెలువడిందని చెబుతున్న నోటీసు ఒకటి సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతోంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదుచేసి తప్పుడు నోటీస్ తయారుచేసిన నిందితుల కోసం వెతికే పనిలో పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని ఎస్వీఎం అటానమస్ కాలేజీ ప్రిన్సిపల్ పేరిట ఒక నకిలీ నోటీసు వెలువడింది. కాలేజీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో బిజయ్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంతకాన్ని దుర్వినియోగం చేశారని, అది నకిలీ నోటీసు అని కాలేజీ పరువు తీసేందుకు కావాలనే ఎవరో కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మంత్రి గంగుల కమలాకర్‌కు నకిలీ ఈడీ నోటీసు
సాక్షి, హైదరాబాద్ : మంత్రి గంగుల కమలాకర్‌కు ఈడీ పేరిట నకిలీ నోటీసు పంపారు ఆగంతకులు. ఆయన సోదరులను అరెస్ట్ చేస్తామని, అరెస్ట్ వద్దనుకుంటే ఈడీతో మాట్లాడి సెటిల్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గంగుల ఈడీ అధికారులను సంప్రదించారు. ఈ నకిలీ నోటీసుపై ఈడీ అధికారులు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తుల్లో భాగంగా సైబర్ క్రైమ్ మంత్రి గంగులకు ఫోన్ చేసింది. అయితే, ఈడీ నకిలీ నోటీసుపై మంత్రి గంగుల ఇప్పటివరకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం. చదవండి : కేసీఆర్‌తోనే కుల వృత్తులకు పూర్వ వైభవం -
బాయ్‌ఫ్రెండ్ లేకపోతే కాలేజీకి రావొద్దు
లక్నో : ఆగ్రాలోని ఓ ప్రముఖ కాలేజీ అమ్మాయిలకు వింత సర్క్యులర్‌ను జారీ చేసింది. అందులో 'వాలెంటైన్స్ డే నాటికి ప్రతి అమ్మాయికి కనీసం ఒక్క బాయ్‌ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే. లేకపోతే కాలేజీలోకి అనుమతించం. అలాగే మీకు బాయ్‌ప్రెండ్ ఉన్నాడని నిరూపించడానికి అతనికి మీరు దిగిన లేటెస్ట్ ఫోటోలను మాకు చూపించాలి. సింగిల్ అమ్మాయిలను కాలేజీకి రావడానికి అనుమతించం. ఇది మీ భద్రత కోసమే' అంటూ ఓ కాలేజీ పేరిట సర్క్యులర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (బాడీ ఉంటే సరిపోదు.. బుర్ర కూడా ఉండాలి) ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ప్రముఖ సెయింట్ జాన్స్ కాలేజీ పేరిట విడుదలైన ఈ సర్క్యులర్ ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్రొ.అశిశ్ శర్మ (అసోసియేట్ డీన్) సంతకంతో జనవరి 14న ఈ సర్క్యులర్ జారి అయింది. మొదట స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన ఈ సర్క్యులర్‌ను విద్యార్థులు సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం ఇది ఫేక్ నోటీసు అని జవాబిచ్చింది. తమ కాలేజీ పరువు తీయడానికే ఎవరో కావాలని ఈ చెత్త సర్క్యులర్‌ను వ్యాప్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి నోటీసులు కాలేజీ ఇవ్వదని స్పష్టం చేశారు. (వైరల్: వయసు తాత్కాలికం.. భార్య చేతి కర్ర శాశ్వతం) Agra's St John's college circular asks girls to get a boyfriend by Feb 14, principal calls it fake! 😉😃🤣 pic.twitter.com/wqoyOYum36 — ASParsh! ❄️ (@ASP_009) January 27, 2021 -
ఐటీ నోటీసులు వచ్చాయా.. చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తమ పేరుతో పన్ను చెల్లింపుదారులకు వస్తున్న నోటీసులపై అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. అలాంటి నోటీసులు వచ్చినప్పుడు తమ అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మోసపూరితమైన నోటీసులు తమ పేరుతో పన్ను చెల్లింపుదారులకు వస్తున్నాయన్న విషయం మా దృష్టికి వచ్చింది. అందులో ఆదాయపు పన్ను శాఖ అధికారిక చిహ్నాలు, హోదాలు, అధికారుల పేర్లు కూడా వాడుతున్నారు. అలాంటి నోటీసులు అందుకున్న చెల్లింపుదారులు స్పందించి సమాధానమిచ్చే ముందు 040-23425200, 8985970011 ఫోన్ నంబర్ల ద్వారా బి.వి.వినోద్ (పీఆర్వో)అనే అధికారిని సంప్రదించి, సదరు నోటీసులు జారీ చేసిన అధికారి వివరాలు తెలుసుకుని, ఆయనతో మాట్లాడిన తర్వాతే సమాధానమివ్వాలి. అవసరమైతే పోలీసు ఫిర్యాదు కూడా చేయండి’ అని పేర్కొన్నారు.