ఐటీ నోటీసులు వచ్చాయా.. చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తమ పేరుతో పన్ను చెల్లింపుదారులకు వస్తున్న నోటీసులపై అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. అలాంటి నోటీసులు వచ్చినప్పుడు తమ అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మోసపూరితమైన నోటీసులు తమ పేరుతో పన్ను చెల్లింపుదారులకు వస్తున్నాయన్న విషయం మా దృష్టికి వచ్చింది. అందులో ఆదాయపు పన్ను శాఖ అధికారిక చిహ్నాలు, హోదాలు, అధికారుల పేర్లు కూడా వాడుతున్నారు.
అలాంటి నోటీసులు అందుకున్న చెల్లింపుదారులు స్పందించి సమాధానమిచ్చే ముందు 040-23425200, 8985970011 ఫోన్ నంబర్ల ద్వారా బి.వి.వినోద్ (పీఆర్వో)అనే అధికారిని సంప్రదించి, సదరు నోటీసులు జారీ చేసిన అధికారి వివరాలు తెలుసుకుని, ఆయనతో మాట్లాడిన తర్వాతే సమాధానమివ్వాలి. అవసరమైతే పోలీసు ఫిర్యాదు కూడా చేయండి’ అని పేర్కొన్నారు.