‘పోలీస్‌’ హ్యాకర్‌..20 ఏళ్ల విద్యార్థి | Telangana police arrested Hawkeye app hacker | Sakshi
Sakshi News home page

‘పోలీస్‌’ హ్యాకర్‌..20 ఏళ్ల విద్యార్థి

Published Mon, Jun 10 2024 4:34 AM | Last Updated on Mon, Jun 10 2024 4:34 AM

Telangana police arrested Hawkeye app hacker

ఢిల్లీలో అరెస్ట్‌.. హైదరాబాద్‌కు తెచ్చిన పోలీసులు.. గతంలోనూ అతడిపై సైబర్‌ నేరాల కేసులు నమోదు  

తెలంగాణ పోలీస్‌ యాప్‌ల నుంచి ఏ పౌరుడి సమాచారం పోలేదు  

ఏ వినియోగదారుడి డేటా లీక్‌ కాలేదు  

సహ నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది : డీజీపీ

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పోలీస్‌యాప్‌లు హాక్‌ఐ, టీఎస్‌కాప్‌లను హ్యాక్‌ చేసిన నిందితుడిని ఢిల్లీలో శనివారం అరెస్టు చేశారు. నిందితుడు యూపీలోని ఝాన్సీకి చెందిన విద్యార్థి జతిన్‌కుమార్‌(20) అని డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్‌ యాప్‌ల హ్యాకింగ్‌తో ఏ వినియోగదారుడికి  సంబంధించిన సున్నితమైన, ఆర్థిక పరమైన సమాచారం లీక్‌ కాలేదని డీజీపీ స్పష్టం చేశారు. నిందితుడిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించినట్టు తెలిపారు. హాక్‌ఐ యాప్‌ హ్యాక్‌ అయినట్టు గుర్తించిన వెంటనే తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగిందన్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. హ్యాకర్‌ పోలీస్‌ యాప్‌లలోని సమాచారాన్ని పబ్లిక్‌ ప్లాట్‌పారంలలో అమ్మకానికి పెట్టినట్టు ఉంచిన పోస్టులను ఆధారంగా చేసుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లారని, పక్కా సమాచారంతో టీజీసీఎస్‌బీ అధికారులు ఢిల్లీకి వెళ్లి, అక్కడ హ్యాకర్‌ జతిన్‌కుమార్‌ను గుర్తించి అరెస్టు చేశారని డీజీపీ తెలిపారు. నిందితుడికి సైబర్‌ నేరచరిత్ర ఉందని, గతంలో ఇలాంటి హ్యాకింగ్‌ కేసులో ప్రమేయం ఉందన్నారు.

న్యూఢిల్లీలోని స్పెషల్‌ సెల్‌ ద్వారక పోలీస్సే్టషన్‌లో  క్రైం. నంబర్‌ 291/2023లో ఇంతకముందు అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడు ఆధార్‌ కార్డులకు సంబంధించిన డేటా, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్‌ చేశారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్‌యాప్‌ల డేటా చోరీ కేసులో ప్రమేయమున్న అదనపు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు.  

అత్యాధునిక టెక్నాలజీతో గుర్తింపు  
హ్యాకింగ్‌ సమాచారం అందిన వెంటనే టీజీసీఎస్‌బీ అధికారులు రంగంలోకి దిగారని, అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్‌ జాడను  విజయవంతంగా తెలుసుకోగలిగారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. హ్యాకర్‌ పోలీస్‌ యాప్‌ల నుంచి చోరీ చేసిన వివరాలను databreachforum.st లో పోస్ట్‌ చేశాడని, చోరీ చేసిన డేటాను ు150  డాలర్లకు అమ్మకానికి పెట్టాడని పేర్కొన్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు హాక్‌ ఐ ,టీఎస్‌కాప్‌ డేటాను కొనేందుకు తనను సంప్రదించవచ్చని  టెలిగ్రామ్‌ ఐడీలు   Adm1nfr1end ,  Adm1nfr1 ends  ఇచ్చాడని తెలిపారు. సోషల్‌ ఇంజినీరింగ్‌ పద్ధతులను ఉపయోగించి నిందితుడి వివరాలు తెలుసుకున్నామన్నారు. 

పౌరుల సమాచారం సురక్షితం  
హాక్‌ఐ, టీఎస్‌కాప్‌ యాప్‌లు హ్యాకింగ్‌ గురైనా పౌరులందరి సమాచారం సురక్షితంగానే ఉందని, ఎలాంటి ఆందోళన వద్దని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. డేటా లీక్‌ అయినట్టు మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. హాక్‌ఐ యాప్‌లో డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్‌ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్‌ ఐడీల వంటి వినియోగదారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని డీజీపీ తెలిపారు. అయితే బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హ్యాకర్‌ హాక్‌ఐ డేటాలోకి యాక్సెస్‌ పొంది ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు.

టీఎస్‌కాప్‌ యాప్‌ అనేది పూర్తిగా పోలీస్‌ విధుల్లో అంతర్గత పనుల కోసం వాడతామని తెలిపారు. ఇందులో సందర్శకులు, హోటళ్ల డేటా సేకరిస్తారన్నది అవాస్తవం అని డీజీపీ తెలిపారు. టీస్‌కాప్‌ ద్వారా థర్డ్‌పారీ్టలకు డేటా వెళ్లే ఆస్కారమే లేదన్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌  ఎస్‌ఎంస్‌ సర్వర్‌ యూఆర్‌ఎల్‌ విషయంలో, చొరబాటుదారుడి క్లెయిమ్‌లు పూర్తిగా అబద్ధమని, ఈ యూఆర్‌ఎల్‌  ఏప్రిల్‌ 2022 నుంచి పనిచేయలేదని స్పష్టం చేశారు. హ్యాక్‌ అయినట్టు చెబుతున్న యూఆర్‌ఎల్‌ను హైదరాబాద్‌ సిటీ పోలీసులు చాలా కాలం ముందు నిలిపివేశారని పేర్కొన్నారు.   

భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు  
అన్ని పోలీసు అంతర్గత,  బాహ్య నెట్‌వర్క్‌లు, వెబ్, మొబైల్‌ అప్లికేషన్లు, క్లౌడ్‌ , ఎండ్‌ పాయింట్‌లలో ఏవైనా సైబర్‌ సెక్యూరిటీ లోపాలు ఉంటే గుర్తించి పరిష్కరిస్తామని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు  తెలిపారు.  ఈ విషయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వారిపై పోలీస్‌శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని డీజీపీ హెచ్చరించారు. పోలీస్‌యాప్‌ల హ్యాకింగ్‌ కేసును టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ పర్యవేక్షణలో రికార్డు సమయంలోనే అధికారులు ఛేదించారన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన  ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్‌ కంపాటి, డీఎస్పీలు, కేవీఎం ప్రసాద్, ఏ.సంపత్, ఇన్‌స్పెక్టర్‌ ఆశిషిరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌  సురే‹Ùలను డీజీపీ రవిగుప్తా ప్రత్యేకంగా అభినందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement