రైతు సమస్యల పట్టింపేదీ? | Uttam Kumar Reddy Comments on Farmers' problems | Sakshi
Sakshi News home page

రైతు సమస్యల పట్టింపేదీ?

Published Mon, Oct 3 2016 3:50 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

రైతు సమస్యల పట్టింపేదీ? - Sakshi

రైతు సమస్యల పట్టింపేదీ?

ప్రభుత్వంపై ఉత్తమ్ ధ్వజం
* సీఎం తీరు అత్యంత బాధ్యతారాహిత్యం
* మరో రెండేళ్లు కరువు ఉండదంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు
* ప్రభుత్వ తాత్కాలిక లెక్కల ప్రకారమే 4.45 లక్షల ఎకరాల్లో పంట నష్టం
* కరువు, వరదల వల్ల ఎదురైన పంట నష్టాలకు పరిహారం ఇవ్వాలి
* రైతు సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో కరువు మరో రెండేళ్ల దాకా ఉండదంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయం, రైతు సమస్యల పరిష్కారంకన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైన, ప్రాధాన్యమైన అంశాలేమున్నాయని ప్రశ్నించారు. రైతు సమస్యలపై చర్చించి, పరిష్కరించేందుకు వీలుగా వెంటనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావుతో కలసి ఆదివారం గాంధీభవన్‌లో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు.

ప్రభుత్వ తాత్కాలిక లెక్కల ప్రకారమే 4,45,792 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని, క్షేత్రస్థాయిలో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. కరువు, వరదలతో పంటలు చేతికందక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. దీనికితోడు మూడో విడత రుణ మాఫీ సొమ్ము విడుదల కాకపోవడం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల అప్పుల వేధింపులు పెరగడం వంటి సమస్యలను రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. ఇలాంటి సంక్షోభ తరుణంలో కరువు, వరదల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి వివరించి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించడం క్షమించరాని నేరమన్నారు.
 
పూర్తి నష్టం అంచనా వేయకుండానే..
రాష్ట్రంలో కనీసం ఇప్పటిదాకా వ్యవసాయం, రైతు సమస్యలపై సమగ్ర సమీక్ష కూడా జరగలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. సమగ్ర సమాచారం లేకుండా, వరద ప్రభావం ఇంకా పోకుండా, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేయకుండా కొందరు మంత్రులను ఢిల్లీకి పంపడం వల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కరువు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు, వాణిజ్య పంటలకు రూ. 20 వేలు, పప్పు ధాన్యాలకు రూ. 35 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలకు సంబంధించిన కల్తీ విత్తనాలతో ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారన్న ఉత్తమ్...ఇందుకు కారణమైన కంపెనీల అనుమతులను రద్దు చేయాలని, రైతులకు నష్ట పరిహారం ఇప్పించాలన్నారు. కరువులో రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దేని కోసం వినియోగించిందో చెబుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 
రైతు వ్యతిరేక సీఎంగా కేసీఆర్: పొన్నాల
రైతు, వ్యవసాయ వ్యతిరేక ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పొన్నాల విమర్శించారు. కరువు, రైతు సమస్యలపై కేంద్రానికి నివేదికలు ఇస్తే ధనిక రాష్ట్రం హోదా పోతుందన్న ఆలోచనతో వాస్తవ నివేదికలను పంపడంలేదని ఆరోపించా రు. కరువు వచ్చినప్పుడు 50 రోజులు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించాల్సిన ప్రభుత్వం... పని దినాలను తగ్గించడం దారుణమన్నారు. 211 కోట్ల కూలీ బకాయిలు పెండింగ్‌లో ఉండటం సిగ్గు చేటని విమర్శించారు. రాష్ట్రానికి కేం ద్రం రూ. 90 వేల కోట్లు ఇచ్చినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారని, ఆ నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement