సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ఆర్మూర్: రానున్న ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ‘ఆర్మూర్ డిక్లరేషన్’ పేరుతో మేనిఫెస్టో అంశాలను ప్రకటించింది. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో జరిగిన రైతు సదస్సులో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటాడారు. 2019లో అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వంద రోజుల్లో రైతుల పంట రుణాలను రూ.2 లక్షల వరకు ఒకేసారి మాఫీ చేస్తామన్నారు.
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులకు సంబంధించి బీమా ప్రీమియాన్ని చెల్లిస్తామని చెప్పారు. రైతు సంక్షేమం–రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలపై ‘ఆర్మూర్ డిక్లరేషన్’ పేరుతో పలు అంశాలను ఉత్తమ్ ప్రకటించారు. అంతకుముందు దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమీపంలో ఉన్న పసుపు పంటను పరిశీలించారు. పంటల వారీగా మద్దతు ధరలను ప్రకటించారు. ఏటా రూ.5 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కేటాయిస్తామన్నారు.
రైతులకు అందే ప్రయోజనాలన్నింటినీ కౌలుదారులకూ అందేలా చూస్తామన్నారు. నూతన విత్తన చట్టాన్ని తీసుకొచ్చి, కల్తీ విత్తనాలను అరికడతామన్నారు. ఏటా రెవెన్యూ రికార్డుల జమాబందీ నిర్వహిస్తామని, రైతుల ఉత్పత్తులపై విధించే జీఎస్టీని ప్రభుత్వమే భరిం చేలా చూస్తామన్నారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. వీటినే ఎన్నికల మేనిఫెస్టోగా భావించాలన్నారు.
రైతులకు శాపంగా కేసీఆర్ పాలన
సీఎం కేసీఆర్ పాలన రైతులకు శాపంగా మారిందని ఉత్తమ్ ఆరోపించారు. నాలుగేళ్లలో రూ.5 లక్షల కోట్ల బడ్జెట్‌లో రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర అందించేందుకు పైసా కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు.
విడతల వారీగా చేసిన రుణమాఫీతో ఏర్పడిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 3,500 మంది రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే బాధ్యుడని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని అప్పట్లోనే వైఎస్‌ఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని కాంగ్రెస్ రైతువిభాగం నేత కోదండరెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వై.ఎస్.రాజశేఖరరెడ్డిదేనని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ గుర్తు చేశారు.
గవర్నర్‌పై అట్రాసిటీ కేసు నమోదునుపరిశీలించాలి: మధుయాష్కీగౌడ్
ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను ఫెలో అంటూ సంబోధించిన గవర్నర్ నరసింహన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసే అంశాన్ని ఎందుకు పరిశీలించకూడదని ఏఐసీసీ నేత మధుయాష్కీగౌడ్ అన్నారు. మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బంధువులే రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎర్ర జొన్నకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ వార సులుగా రైతుల వద్దకు వచ్చామని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, పీసీసీ కార్యదర్శి బొమ్మా మహేశ్‌కుమార్ గౌడ్, నాయకులు అరికెల నర్సారెడ్డి, ఈరవత్రి అనిల్, సౌధాగర్ గంగారాం, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్‌హందాన్, ఇతర నేతలు వెంకట్రాంరెడ్డి, రత్నాకర్, నగేశ్‌రెడ్డి, రాజారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పంటల వారీగా ఉత్తమ్ ప్రకటించిన కనీస మద్దతు ధరలు (రూ.లలో)
పంట మద్దతు ధర
(క్వింటాలుకు..)
వరి ధాన్యం 2,000
పత్తి 6,000
సోయాబీన్ 3,500
కందులు 7,000
మినుములు 7,000
పెసర్లు 7,000
పొద్దుతిరుగుడు 5,000
సజ్జ, జొన్న 2,000
మిర్చి 10,000
పసుపు 10,000
ఎర్రజొన్న 3,000
Comments
Please login to add a commentAdd a comment