సంక్షోభంలో రైతులుంటే కేసీఆర్‌కు అవార్డా?
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్... విద్యుత్ అమరవీరులకు నివాళులు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన, రైతుల ఆత్మహత్యలకు స్పందించని సీఎం కేసీఆర్‌కు ఒక ప్రైవేటు సంస్థ అవార్డు ఇవ్వడం హాస్యాస్పదమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యుత్ అమరవీరుల స్తూపానికి సోమవారం నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు, ప్రజావ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. కరెంటు చార్జీలను పెంచి, ప్రజలను ఇబ్బందులు పెట్టి, రైతులను హింసించిన పాలకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో తెలంగాణలో టీడీపీని చూస్తే అర్థమైపోతుందన్నారు.
అనంతరం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. 17 ఏళ్ల క్రితం రైతులు, ప్రజలు అప్పటి పాలకుల నిరంకుశ విధానాలపైన, విద్యుత్ ధరలు పెంపుపైన తిరగబడి పోరాటాలు చేశారన్నారు. అందులో బషీర్‌బాగ్ ఉద్యమం కీలకమైందని, ఆ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంటే కేసీఆర్‌కు ఏదో బ్రోకర్‌గా పనిచేసే ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అవార్డును ఇప్పించుకోవడం, దాన్ని ఏదో సాధించినట్టుగా ప్రచారం చేసుకోవడం ఆయన దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. బూటకపు సర్వేలతో సొంత పార్టీ ఎమ్మెల్యేలను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.