2,500 హెక్టార్లలో నష్టం | Agriculture Officers Visit Rainy Crops in Mahabubnagar | Sakshi
Sakshi News home page

2,500 హెక్టార్లలో నష్టం

Published Thu, Apr 9 2020 1:22 PM | Last Updated on Thu, Apr 9 2020 1:22 PM

Agriculture Officers Visit Rainy Crops in Mahabubnagar - Sakshi

మద్దిగట్లలో వరి పంటను పరిశీలిస్తున్న ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): జిల్లాలో రెండు రోజులుగా కురిసిన అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటల లెక్కను వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. 4,168 మంది రైతులకు చెందిన 2,500 హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లింది. అత్యధికంగా వర్షపాతం నమోదైన ముసాపేట, భూత్పూర్, మహబూబ్‌నగర్‌ అర్బన్, హన్వాడ మండలాల్లో వరి పంట తుడిచిపెట్టుకపోవడంతో రైతులు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈదురుగాలులతో కురిసిన వర్షం కారణంగా వరి పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించిన అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఇదిలాఉండగా మంగళవారం సాయంత్రం అకాల వర్షం కురియడంతో జిల్లా సరాసరి 320 మి.మీ. నమోదైంది. అత్యధికంగా ముసాపేట మండలంలో 57 మి.మీ, హన్వాడ మండలంలో 43 మి.మీ, మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలంలో 42.5 మి.మీ, భూత్పూర్‌ మండలంలో 42 మి.మీ. నమోదైంది. అత్యల్పంగా బాలానగర్, మిడ్జిల్‌ మండలాల్లో 1.1 మి.మీ. వర్షం కురిసింది. 

ఏయే మండలాల్లో..
జిల్లాలో రెండు రోజులుగా కురిసిన అకాల వర్షం కారణంగా 2,500 హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లింది. ఈనెల 6వ తేదీ సాయంత్రం కురిసిన వర్షానికి 129.68 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలంలో 13.25 హెక్టార్లు, గండీడ్‌లో 72, హన్వాడలో 26.4, నవాబుపేటలో 18 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 7వ తేదీ సాయంత్రం కురిసిన వర్షం కారణంగా 2,370హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని భూత్పూర్‌ మండలంలో 870.8 హెక్టార్లు, గండీడ్‌లో 502, దేవరకద్ర లో 357.2 హెక్టార్లు, అడ్డాకులలో 368.4, హన్వాడలో 128, మహబూబ్‌నగర్‌ రూరల్‌లో 50.5, మిడ్జిల్‌లో 13.6, నవాబుపేటలో 14.4, కోయిలకొండలో 6.48 హెక్టార్లు, చిన్నచింతకుంటలో 48 హెక్టార్లు, మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలంలో 10.6 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.  

అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు  
భూత్పూర్‌:  దేవరకద్ర ఏడీఏ యశ్వంత్‌ రావు, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, ఏఓ రాజేందర్‌రెడ్డి బుధవారం మద్దిగట్ల గ్రామంలో నేలరాలిన వరి పంటను పరిశీలించారు. జరిగిన నష్టంపై  సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటయ్య, కోఆప్షన్‌ సభ్యుడు శేషగిరి రావు,  ఏఈఓ హన్మంతు, మా నస, వీఆర్వో దీప్తి పాల్గొన్నారు.
దేవరకద్ర: మండలంలోని మీనుగోనిపల్లి, గుడిబండ, లక్ష్మీపల్లి, గోపన్‌పల్లి, పుట్టపల్లి, కౌకుంట్ల, ఇస్రంపల్లి, రేకులంపల్లి, చౌదర్‌పల్లి, హజిలాపూర్, బస్వాయపల్లి, పేరూర్, దేవరకద్రలో గ్రామాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను బుధవారం మండల వ్యవసాయ అధికారి రాజేందర్‌ అగర్వాల్, విస్తరణ అధికారులతో కలిసి పరిశీలించారు.  
నవాబుపేట:  మండలంలోని తీగలపల్లి, కాకర్లపహ డ్, చాకలపల్లి గ్రామాల్లో  దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారులు నష్టపోయిన పంటలను పరిశీలించారు. నివేదికను తయారు చేసి పరిహారం అందేలా చూస్తామన్నారు. పంటల పరిశీలనలో మండల వ్యవసాయ అధికారి కృష్ణకిషోర్, గౌతమి, వెంకటేష్, చెన్నయ్య, శేఖర్, పీఏసీఎస్‌ చైర్మన్‌ నర్సింహులు, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య ఉన్నారు. ఈ çసందర్భంగా మార్కెట్‌ చైర్మెన్‌ డీఎన్‌రావు, మండల వైస్‌ఎంపీపీ సంతో‹ష్, చెన్నయ్య, సర్పంచ్‌లు గోపాల్, రాములమ్మ, జంగయ్య, లక్ష్మమ్మ పరామర్శించారు.  

దెబ్బతిన్న పంటల పరిశీలన
మూసాపేట: మండల కేంద్రంతో పాటు, కొమిరెడ్డిపల్లి, జానంపేట, నిజాలాపూర్, మహ్మదుస్సేన్‌పల్లి, సంకలమద్ది, పోల్కంపల్లి గ్రామాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను మంగళవారం మండల వ్యవసాయాధికారులు పరిశీలించారు. కొమిరెడ్డిపల్లిలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు లక్ష్మీనర్సింహ యాదవ్, జానంపేటలో విండో చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. వారి వెంట ఆయా గ్రామాల సర్పంచులు సాయిరెడ్డి, శ్రీనివాసులు, ఆంజనేయులు, అనిల్‌రెడ్డి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement