తాండూరు, న్యూస్‌లైన్: కుండపోత వర్షాలతో జిల్లాలో వివిధ పంటలకు అపార నష్టం వాటిల్లిందని, రైతులకు ప్రభుత్వం నుంచి వీలైనంత తొందరగా పరిహారం ఇప్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా పత్తి, వరి తదితర పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పంట నష్టం, విద్యుత్ సమస్యలపై శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు.
ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించి పంట నష్టంపై సర్వే చేయించనున్నట్టు తెలిపారు. సర్వే నివేదికలన్నింటినీ క్రోడీకరించి పరిహారం కోసం త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అన్నారు. గతేడాది నీలం తుపానుతో జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం అందకపోవడంపై విచారణ జరిపించి, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మొక్కజొన్నల కొనుగోలుకు జిల్లాలో 20 కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.1310 చెల్లిస్తారని... రైతులు వీటిని వినియోగించుకోవాలని కోరారు. బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తే క్వింటాలుకు రూ.300 తక్కువ ధర వస్తుందన్నారు.
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు మెజార్టీ అవసరం లేదు...
గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆయా అసెంబ్లీల్లో బిల్లు పెట్టి అందరి ఆమోదం పొందే అవకాశం ఉండేదని, అయితే ఇప్పుడు అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెడితే మెజార్టీ అవసరం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూసీ నిర్ణయం, నోట్‌కు కేబినెట్ ఆమోదం తెల్పిన తర్వాత ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేల వలసలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు మంత్రి విముఖత చూపారు. వికారాబాద్‌లో 50 ఎకరాల్లో సుమారు రూ.30కోట్లతో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కానుందని, దీంతో సుమారు 2వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ పార్కుకు స్థలాల కేటాయింపు, అభివృద్ధితో ఏపీఐఐసీకి ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీకి సంబంధించి నామినేటెడ్ పోస్టులు తర్వలో భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టుల భర్తీ ఆగిపోయిందని వివరించారు.
తెలంగాణలో వికారాబాద్ జిల్లా కేంద్రం...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వికారాబాద్ జిల్లా కేంద్రం అవుతుందని మంత్రి ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్‌లో విశ్వవిద్యాలయంతోపాటు వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాండూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అధికారులతో మాట్లాడతానన్నారు. వికారాబాద్ లారీ అసోసియేషన్ విన్నపం మేరకు ఇసుక తరలింపు సమస్యపై కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. జిల్లాలో 12 ఎస్సీ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి స్థలాల కేటాయింపు తదితర ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
పెద్దేముల్ కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు సుమారు రూ.25 కోట్ల జైకా నిధులు రానున్నాయని, మరో 11 ప్రాజెక్టుల అభివృద్ధికీ ప్రతిపాదనలు పంపించామని మంత్రి వివరించారు. తాండూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.2కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడతానన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి, రమేష్, విశ్వనాథ్‌గౌడ్, అల్విన్ అనంత్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అపూ(నయీం), అలీం తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టం అపారం
Published Sat, Oct 26 2013 12:17 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement