![Owners of paper mills are positive to pay fair price to farmers - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/4/kakani.jpg.webp?itok=eWAS0kfX)
ఉత్పత్తులను విడుదల చేస్తున్న మంత్రి కాకాణి
సాక్షి, అమరావతి: సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు పేపర్ మిల్లుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ప్రస్తుతం చెల్లిస్తున్న ధరపై టన్నుకు కనీసం రూ.200 పెంచేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర కల్పనపై పేపర్ మిల్లుల ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం సచివాలయంలో చర్చలు జరిపారు.
మంత్రి కాకాణి మాట్లాడుతూ గిట్టుబాటు ధర విషయంలో సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు పేపర్ మిల్లుల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. దీనిపై పేపర్ మిల్లుల ప్రతినిధులు స్పందిస్తూ టన్నుకు కనీసం రూ.200 నుంచి సాధ్యమైనంత ఎక్కువ పెంచేందుకు చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకే నేరుగా డబ్బులను చెల్లించాలని కంపెనీల ప్రతినిధులను మంత్రి ఆదేశించారు.
వ్యయసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ కె.లక్ష్మీభాయి, ఐటీసీ ప్రతినిధి గోబల కన్నన్, ఆంధ్రా పేపర్ మిల్స్ (రాజమండ్రి) ప్రతినిధి కె.బాలకృష్ణ, సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రతినిధి ఎన్‌ఎస్ కన్నబాబు, గుజరాత్ పేపర్ మిల్స్ ప్రతినిధులు టీఎస్ భగవాన్, వై.రుషికేశ్వరరావు, బీఐఎల్‌టీ ప్రతినిధి జీవీడీ ప్రసాద్ పాల్గొన్నారు.
మరో మూడు సేంద్రియ ఉత్పత్తులు
మార్కప్ బ్రాండ్ పేరుతో కొత్తగా మరో మూడు రకాల సేంద్రియ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఇప్పటికే మార్కప్ ద్వారా 17 రకాల సేంద్రియ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురాగా... తాజాగా సేంద్రీయ బెల్లం, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పును కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
మార్కెట్‌లోకి కొత్తగా 7 వంగడాలు
రైతులకు కొత్తగా మరో ఏడు వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, పత్తిలో 2, రాగి/చోడిలలో ఒకటి చొప్పున ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ పరిశోధనా కేంద్రాలు అభివృద్ధి చేశాయి. రెండు నెలల కిందట రాష్ట్రస్థాయిలో 10వంగడాలను విడుదల చేయగా, తాజాగా మరో 7 వంగడాలు జాతీయస్థాయిలో వినియోగించుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment