సాక్షి, హైదరాబాద్: రాబోయే వానాకాలం సీజన్‌లో 24.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎరువుల ప్ర ణాళికను ఖరారు చేసింది. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం కేటాయించిన ఎరువులు వానాకాలం సీజన్‌కు పూర్తిస్థాయిలో సరిపోతాయని తెలిపాయి.
ఎరువుల్లో అత్యధికంగా 9.50 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా కేటాయించారు. 9.40 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను, 2.30 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 1.25 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, లక్ష మెట్రిక్ టన్నుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్‌ను కేటాయించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది.
కాగా, ఏడాదికేడాదికి యూరియా వాడకం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చరొట్ట విత్తనాలను సరఫరా చేయడం వల్ల, గతం కంటే ఐదారు వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం తగ్గుతోందంటున్నారు.
మండలాలకు ఎరువుల సరఫరా...
వచ్చే నెల మొదటి వారంలో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఒక వర్షం పడితే చాలు రైతులు దుక్కులు దున్నుతారు. దీంతో ముందస్తుగా మొదటి దఫా ఎరువులను మండలాలకు సరఫరా చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. మండలాల్లోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), ఆగ్రోస్ రైతు సే వా కేంద్రాల ద్వారా ఎరువులను సరఫరా చేశా రు.
రైతులకు ఎరువులు నిత్యం అందుబాటు లో ఉండేలా చూడాలని ప్యాక్స్, రైతు సేవా కేంద్రాలను వ్యవసాయశాఖ ఆదేశించింది. ఎరు వుల కొరత రాకుండా, ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఎరువులను రేక్ పాయింట్ల నుంచి రవాణా చేసేందుకు మార్క్‌ఫెడ్ ఇటీవల ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసింది.
మొత్తం 20 రేక్ పాయింట్ల నుంచి ఎరువులను తీసుకెళ్లేందుకు మూడు ఏజెన్సీలకు అవకాశం ఇచ్చింది. అందులో ఒక ఏజెన్సీకే 18 రేక్ పాయింట్లు వచ్చాయి. మిగిలిన రెండు రేక్ పాయింట్లు మరో రెండు ఏజెన్సీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఎరువుల రవాణా కోసం రూ. 96 కోట్లు ఖర్చు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment