
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో వారంలో వ్యవసాయ సీజన్ మొదలవనున్న నేపథ్యంలో అధికారులు ఎరువుల సరఫరా ప్రారంభించారు. ఈ సీజన్‌లో 25 లక్షల టన్నుల ఎరువులు అవసర మవగా అందులో 10 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్ప టికే అన్ని జిల్లాలకు కలిపి 4.20 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు మార్క్‌ఫెడ్ 2.13 లక్షల యూరియా నిల్వలను ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే 11,857 టన్నుల డీఏపీ, 41,540 టన్నుల కాంఫ్లెక్స్ ఎరువులు బఫర్ స్టాక్‌లో ఉన్నట్లు మార్క్‌ఫెడ్ వర్గాలు వెల్లడిం చాయి. ఎక్కడా ఎరువుల కొరత రాకుండా సిద్ధం గా ఉండాలని మార్క్‌ఫెడ్‌ను వ్యవసాయశాఖ ఆదేశించింది. వానాకాలం సీజన్‌లో ఎరువుల సరఫరా, పంపిణీ, పర్యవేక్షణపై వ్యవసాయశాఖ మార్గదర్శకాలు తయారు చేసింది.
మార్గదర్శకాలు ఇవీ..
♦రిటైల్ డీలర్లకు రెండు ట్రక్కుల కంటే ఎక్కువగా ఎరువులను కేటాయించకూడదు.
♦ఏదో ఒక కంపెనీ లేదా బ్రాండ్‌లకు చెందిన వాటిని ప్రోత్సహించేలా జిల్లా వ్యవసాయా ధికారులు వ్యవహరించకూడదు.
♦అంతర్రాష్ట్ర అనధికారిక ఎరువుల సరఫరాను అడ్డుకోవాలి. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలి.
♦ప్రతి నెలా మొదటి వారంలో ఎరువుల డీలర్ల సమావేశాన్ని జిల్లా వ్యవసాయాధికారి నిర్వహించాలి.
♦ఎరువుల లైసెన్సులను మాన్యువల్ ప్రాతి పదికన జిల్లా వ్యవసాయశాఖ అధికారులు జారీచేయకూడదు.
♦జిల్లాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఎంఆర్‌పీ కంటే ఎక్కువ వసూలు చేసే వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి.