Plant Doctors For farmers in Andhra Pradesh - Sakshi
Sakshi News home page

AP: దేశంలోనే తొలిసారిగా.. రైతుల కోసం మొక్కల డాక్టర్లు

Published Sun, Oct 30 2022 5:30 AM | Last Updated on Sun, Oct 30 2022 12:22 PM

Plant doctors for farmers in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు త్వరలో ప్లాంట్‌ అండ్‌ సాయిల్‌ క్లినిక్‌లుగానూ సేవలందించనున్నాయి. ఆర్బీకేల్లో సేవలందిస్తున్న గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్లాంట్‌ డాక్టర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పంటలకు సోకే తెగుళ్లు, మట్టి నమూనాలను పరీక్షించేందుకు వచ్చే మార్చి నాటికి ప్రతి ఆర్బీకేకు ప్లాంట్‌ డాక్టర్‌ కిట్‌లను అందించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ప్లాంట్‌ డాక్టర్ల వ్యవస్థను వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.

భూసారం, పోషకాలు, నీటి, సూక్ష్మ పోషక లోపాలకు సంబంధించి క్షణాల్లో పరీక్ష ఫలితాలను అందించడమే కాకుండా.. సకాలంలో తగిన సలహాలు, సూచనలు అందించేలా ప్లాంట్‌ డాక్టర్‌ విధానానికి రూపకల్పన చేసింది. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో రూ.75 వేల విలువైన సాయిల్‌ టెస్టింగ్‌ పరికరాలు (భూ పరీక్షక్‌), పంటల ఆధారిత లీఫ్‌ కలర్‌ చార్ట్‌ (ఎల్‌సీసీ), సూక్ష్మ పోషకాల లోపాల చార్ట్, మేగ్నిఫయింగ్‌ లెన్స్, జీపీఎస్, డిజిటల్‌ కెమెరా తదితర పరికరాలను మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొస్తారు. ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కోసం మొబైల్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

రైతులు భూసారం, పోషకాలు.. నీటి యాజమాన్యం, సూక్ష్మపోషక లోపాల గుర్తింపు, పురుగులు–తెగుళ్లు, వ్యాధి నిర్ధారణ, కలుపు నివారణ చేపట్టాలంటే వెంటనే పరీక్ష ఫలితాలు వస్తేనే సాధ్యమవుతుంది. గతంలో భూసార, నీటి పరీక్షలు చేయాలంటే రోజులు, వారాల సమయం పట్టేది. ఫలితాలొచ్చేలోగా అదును దాటిపోయేది. దీంతో చేసేది లేక మూస పద్ధతిలోనే భూసారంతో సంబంధం లేకుండా మోతాదుకు మించి ఎరువులు, పురుగుల మందులు వినియోగించేవారు. దీంతో పంటలు తరచూ తెగుళ్ల బారినపడి ఆశించిన దిగుబడులు రాక అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందిపడేవారు.

ఇందుకు ప్రధాన కారణం తగినన్ని ప్రయోగశాలలు లేకపోవడం, సిబ్బంది కొరత ఉండేది. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి గ్రామ స్థాయిలో ప్లాంట్‌ డాక్టర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

60 సెకన్లలోనే ఫలితాలు
ఐఐటీ కాన్పూర్‌ అభివృద్ధి చేసిన భూ పరీక్షక్‌ పరికరాన్ని ప్రతి ఆర్బీకేలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులో తీసుకొస్తున్నారు. ఈ పరికరంలో మట్టి నమూనా వేస్తే.. భూమి స్వభావంతోపాటు భూమిలోని ఆరు (ఎన్, పీ, కే, ఓసీ, సీఈసీ, క్లే) పారామీటర్స్‌ను పరీక్షిస్తుంది. ఎలాంటి కెమికల్స్‌ ఉపయోగించకుండా స్పెక్ట్రోస్కోపీ, ఎల్‌ఓటీ టెక్నాలజీ ద్వారా కేవలం 60 సెకన్లలోనే ఫలితాలను అందిస్తుంది. రోజుకు వంద శాంపిల్స్‌ను పరీక్షించే సామర్ధ్యం ఉన్న ఈ పరికరాల ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా భూమిలోని లోపాలను పసిగట్టవచ్చు.

ఒక్క భూసారమే కాదు.. సూక్ష్మపోషక లోపాలు, మొక్కలకు వచ్చే తెగుళ్లు, వ్యాధులను కూడా పరీక్షించి నిర్ధారించుకోవచ్చు. ఫలితాలను రైతుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌ మెసేజిల ద్వారా పంపిస్తారు. ఫలితాల ఆధారంగా ప్లాంట్‌ క్లినిక్‌ (ఆర్బీకే) ద్వారా వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించే సిఫార్సులను రాతపూర్వకంగా (వైద్యుని ప్రిస్కిప్షన్‌ మాదిరిగా) రైతులకు అందిస్తారు. ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో ఏ సమయంలో వాడాలో రాతపూర్వకంగా రైతులకు అందిస్తారు. 

రైతులకు బహుళ ప్రయోజనాలు
► ప్రతి రైతుకు సాయిల్‌ హెల్త్‌ కార్డు ఇస్తారు. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే ఎరువులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సాయిల్‌ హెల్త్‌ కార్డుల్లో సూచించే సిఫార్సుల వల్ల ఎరువుల వినియోగం 20–25 శాతం తగ్గుతుంది
► పంటకు సోకే తెగుళ్లను ప్లాంట్‌ క్లినిక్స్‌లో ఏర్పాటు చేసే పరికరాలతో ఇట్టే పసిగట్టవచ్చు. తెగుళ్లు, వ్యాధుల ఉధృతి ఎక్కువగా ఉంటే శాంపిల్స్‌ సేకరించి వైఎస్సార్‌ అగ్రి ల్యాబ్స్‌కు పంపించి పరీక్షిస్తారు.
► వ్యాధులు, తెగుళ్లు సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల పురుగుల మందుల వినియోగం 15–25 శాతం తగ్గుతుంది.
► మొత్తంగా రైతుకు పెట్టుబడి ఖర్చులు కనీసం 15–20 శాతం తగ్గుతాయి. దిగుబడుల్లో నాణ్యత పెరుగుతుంది.  గతంతో పోలిస్తే 18–20 శాతం వరకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
► పెట్టుబడి ఖర్చులు తగ్గడం, దిగుబడులు పెరగడం వలన రైతులు కనీసం 20–25 శాతం అదనంగా ఆదాయం పొందే అవకాశం కలుగుతుంది.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచన మేరకు..
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలో భాగంగానే ‘ప్లాంట్‌ డాక్టర్‌’ విధానానికి రూపకల్పనం చేశాం. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్లాంట్‌ క్లినిక్స్‌ రైతులకు అందుబాటులోకి రానున్నాయి.
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, వ్యవసాయ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement