సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ప్రకృతి కన్నెర్ర.. మరోవైపు బ్యాంకర్ల నిర్లక్ష్యం వెరసి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారీ వర్షాలు, వరదలతో ఇప్పటికే నష్టాల అంచున ఉన్న రైతులను ఆదుకోవడంలో బ్యాంకులు మొండిచెయ్యి చూపిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులు రెండోసారి పంట వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు అలక్ష్యం ప్రదర్శిస్తున్నాయి.
ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటికి 65 శాతం వరకు పంటలు సాగు కాగా, ఇప్పటివరకు లక్ష్యంలో కేవలం 25 శాతం లోపే బ్యాంకులు పంట రుణాలు ఇచ్చాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు మొదటి వారంలోకి ప్రవేశించి సీజన్ ఊపందుకుంటున్నా.. బ్యాంకు రుణాలు సరిగా లభించకపోవడంతో, సాంకేతిక సమస్యలను సాకుగా చూపిస్తుండటంతో రైతులు ప్రైవేట్ అప్పుల వైపు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
లక్ష్యంలో 24.50 శాతమే..!
ఖరీఫ్ (వానాకాలం) సీజన్ మొదలై రెండు నెలలైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 65 శాతం పంటలు ఇప్పటికే సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. కానీ ఈ మేరకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడ్డాయి. వానాకాలం సీజన్ పంట రుణాల లక్ష్యం రూ.51,229 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం రూ.12,552 కోట్ల మేరకే ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
అంటే మొత్తం రుణ లక్ష్యంలో కేవలం 24.50 శాతమే రుణాలు ఇచ్చాయన్నమాట. రాష్ట్రంలో పట్టాదారు రైతుల సంఖ్య సుమారు 65 లక్షలు ఉండగా, అందులో బ్యాంకర్ల రుణ లక్ష్యం కేవలం 33.85 లక్షల మంది రైతులే. కాగా వీరిలో ఇప్పటివరకు 8 లక్షల మందికే రుణాలు అందినట్లు అంచనా. కాగా మిగతా రైతుల్లో చాలామంది వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ విధంగా రైతులు సుమారు రూ.7 వేల కోట్ల మేరకు ప్రైవేట్ అప్పులు తీసుకున్నట్లు ఓ అంచనా.
ధరణితో తిప్పలు..
బ్యాంకులు రైతులకు రుణాల మంజూరు విషయంలో అనేక కొర్రీలు పెడుతున్నాయి. ముఖ్యంగా ధరణి పోర్టల్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖతో జరిగిన సమావేశంలో కూడా బ్యాంకర్లు ధరణి సమస్యల వల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారని తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీసీఎల్‌ఏతో సమావేశం ఏర్పాటు చేయాలని బ్యాంకులు కోరుతున్నాయి.
ధరణి పోర్టల్‌లో కొందరు రైతుల సర్వే నంబర్లు నమోదు కావడం లేదు. పాస్‌బుక్‌లు ఉన్నా కొన్ని బ్యాంకర్ల లాగిన్‌లో కనిపించడం లేదు. కొన్నింట్లో బ్యాంకర్లు ఎంట్రీ చేయడానికి ప్రయత్నించినా నమోదు కావడం లేదు. కొన్ని గ్రామాలు ఇంకా ధరణిలో నమోదు కాలేదు. కొన్ని గ్రామాల్లో సర్వే నంబర్లలో ఉన్న భూమికి, ధరణిలో నమోదైన భూమికి మధ్య వివరాల్లో తేడాలుంటున్నాయి. ఇలాంటి కారణాలతోనే రైతులకు రుణాలు ఇవ్వలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. కాగా లక్షలాది మందికి ఈ విధంగా ధరణి సమస్యలతో రుణాలు రాకుండా పోతున్నాయి.
అయితే దీనికి పరిష్కారం చూడకుండా బ్యాంకర్లు, అధికారులు రైతులను కష్టాలు పాలు చేయ డంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో రైతుల పట్టాదార్ పాస్‌బుక్‌లు పెట్టుకుని బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా ప్రతీ జాతీయ బ్యాంకుకు ధరణి పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోర్టల్‌లోకి లాగిన్ అయి సర్వే నంబర్లు సరి చూస్తున్నారు. ప్రస్తుతం ఇదే సమస్యగా మారడంతో దాన్ని సాకుగా చూపించి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు.
రుణమాఫీ జరగకపోవడంతో..
లక్ష రూపాయల రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల కూడా బ్యాంకులు చాలామంది రైతులకు రుణాలు ఇవ్వడంలేదు. ఇప్పటివరకు కేవలం రూ.37 వేల లోపు బకాయిలున్న రైతులకు మాత్రమే రుణమాఫీ పూర్తిచేశారు. ఇంకా లక్ష రూపాయల వరకు ఉన్న బకాయిలు మాఫీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం రుణ మాఫీ డబ్బులు చెల్లిస్తే అప్పులు క్లియర్ చేసుకుందామని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 2018 వరకు ఉన్న బకాయిలపై వడ్డీకి వడ్డీ జమ అవుతోంది. అసలు, వడ్డీ కలిపి తడిసిమోపెడవుతోంది.
తొలుత రైతులు బ్యాంకు రుణాలు రెన్యువల్ చేసుకోవాలని, తర్వాత తాము చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొందరు రైతులు రెన్యువల్ చేసుకోగా.. ఎక్కువమంది రైతులు రెన్యువల్ చేసుకోలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే రుణమాఫీ సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. దీంతో బ్యాంకులు వారికి పంట రుణాలు ఇవ్వడంలేదు. కొన్నిచోట్ల రైతుబంధు సొమ్మును కూడా బ్యాంకులు రైతుల బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఆపొద్దన్నా బ్యాంకర్ల తీరులో మార్పు రావడం లేదు.
రుణం కోసం రెండు నెలలుగా తిరుగుతున్నా
పంట రుణం కోసం కోహెడలోని బ్యాంకు చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నా ఇవ్వడం లేదు. కొత్త వారికి రుణాలు మంజూరు చేసేందుకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పంట పెట్టుబడి సాయం సరిపోలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నాం.
–బోలుమల్ల కృష్ణ, రైతు, రాంచంద్రాపూర్, కోహెడ మండలం
Comments
Please login to add a commentAdd a comment