విలేకరులతో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
వైరా/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు, వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిద్ర పోతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల గోదావరి వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు.
పంట నష్టం అంచనా వేసి రైతులకు భరోసా కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆత్మస్థ్యైర్యం కోల్పోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ముధోల్‌కు చెందిన రైతు మంగారపు లక్ష్మణ్.. పంట పూర్తిగా నీటి పాలు కావడంతో తీవ్రంగా నష్టపోయి, అప్పులు తీర్చడానికి మార్గం లేక ఆత్మహత్య చేసుకోవడం ఆవేదన కలిగించిందన్నారు.
వరదల కారణంగా రాష్ట్రంలో పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వరి, తదితర పంటలకు తీవ్ర నష్టం కలిగిందని చెప్పారు. దీంతో రైతులు బాగా నష్టపోయారని, వరదలు వచ్చి 15 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేయడానికి చర్యలు తీసుకోవడం లేదని భట్టి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలకు ఇది నిదర్శనమన్నారు. పంట నష్టంపై కేంద్రానికి ఇప్పటివరకు నివేదిక ఇవ్వక పోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు.
తక్షణమే అధికారులను క్షేత్రస్థాయికి పంపించి పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. రైతులకు పంటల బీమా పథకాన్ని అమలు చేసి ప్రకృతి వైపరీత్యాలతో కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్పీనేతగా ప్రభుత్వానికి తాను పలు సూచనలు చేసి పది రోజులు అవుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment