పొద్దునలేస్తే కాంగ్రెస్‌పై ఏడుస్తున్నారు: మంత్రి తుమ్మల
ఖమ్మం వన్‌టౌన్: కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని, అందుకే సన్నాలు పండించే రైతులకు రూ.500 బోనస్ ప్రకటించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బోనస్ అంటే అర్థం తెలియని వారు కాంగ్రెస్‌పై మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రాజీవ్‌గాంధీ వర్థంతి వేడుకల్లో పాల్గొని మంత్రి మాట్లాడారు.
మా ప్రభుత్వం మూడు రోజుల్లోనే కూలిపోతుందని బీఆర్‌ఎస్ నేతలు భావించారని, అది సాధ్యం కాకపోవడంతో పొద్దున లేచింది మొదలు కాంగ్రెస్ పార్టీపై పడి ఏడుస్తున్నారన్నారు. ఎప్పుడు ఎవరి మీద ఏడవాలో తెలియని సన్నాసులు బీఆర్‌ఎస్ వాళ్లని పేర్కొన్నారు. పదేళ్ల పాటు వ్యవస్థలను నాశనం చేసిన వారు నీతులు చెబుతున్నారని విమర్శించారు. కాగా, ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపిస్తున్నారని.. ఈక్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు.
ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టిన నేత రాజీవ్‌గాంధీ అని, ప్రపంచంలో అనేక సంస్థలకు భారతీయులే సీఈఓలుగా ఉండడానికి రాజీవ్ ఇచ్చిన స్ఫూర్తే కారణమని తెలిపారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment