సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.40 వేల కోట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. బడ్జెట్‌పై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కసరత్తు చేసిన వ్యవసాయ శాఖ గతం కంటే అధికంగా నిధులు కేటాయించాలని కోరడం విశేషం. 2022–23 బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించగా, 2023–24లో రూ.26,831 కోట్లు కేటాయించింది. కాగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ మొదటి బడ్జెట్లో ఏకంగా రూ.40 వేల కోట్లు కేటాయించాలంటూ వ్యవసాయ శాఖ ప్రతిపాదించడం.. రైతుల పట్ల సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందనడానికి నిదర్శనమని అధికార వర్గాలు అంటున్నాయి.
రుణమాఫీ, రైతు భరోసాకే అధికం
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అలాగే రైతుభరోసా పేరుతో అన్నదాతలకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. రెండు పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయనుంది. దీనితో వీటికి అధిక మొత్తంలో నిధులు అవసరం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 36.68 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీకి మొత్తం రూ.19,198.38 కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే దాదాపు రూ.13 వేల కోట్ల వరకు మాత్రమే మాఫీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలంటే మొత్తం రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని, వడ్డీలతో కలిపి రూ.36 వేల కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా. కాగా మొదటి సంవత్సరానికి గాను రూ.7,200 కోట్లు చెల్లించేలా వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసింది.
బ్యాంకులకు నెలసరి వాయిదాల్లో..
రుణమాఫీ నిధులను బ్యాంకులకు ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నోడల్ బ్యాంకుతో ఒక దఫా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అవసరమైతే ఆర్‌బీఐతోనూ చర్చించాలని, బ్యాంకులకు నెలసరి వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించినప్పటికీ, రుణమాఫీ ఒకేసారి చేసేలా బ్యాంకులను ఒప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలావుండగా రుణమాఫీకి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ (గడువు తేదీ)పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రుణమాఫీ ఎలా చేయాలన్న దానిపై త్వరలో మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి. ఇక రైతుబంధు కోసం 2023–24 బడ్జెట్లో రూ.15,075 కోట్లు కేటాయించారు. తాజాగా రైతుభరోసా సొమ్ము కూడా పెరగడంతో బడ్జెట్ కూడా పెంచాల్సి ఉంది. కాబట్టి రూ.22,500 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా కాగా.. ఆ మేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపింది.
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణపైనా దృష్టి సారించాలని, ఆ మేరకు రూ.500 కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. రైతు బీమాకు ప్రభుత్వం 2022–23లో రూ.1,466 కోట్లు కేటాయిస్తే, 2023–24 బడ్జెట్లో రూ.1,589 కోట్లు కేటాయించింది. ఈసారి రూ.1,600 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు 2023–24 బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించింది. ఈసారి కూడా అంతే మొత్తంలో కేటాయించాలని ఉద్యానశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. రైతులకు విత్తనాలు సరఫరా చేసేందుకు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి, రైతు వేదికలకు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు, మైక్రో ఇరిగేషన్ తదితరాలకు కూడా నిధులు కోరుతూ వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఇక రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. దీన్ని అమలు చేయాలంటే ఆ మేరకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది.
వ్యవసాయానికి బడ్జెట్ ప్రతిపాదనలు రూ.40,000 కోట్లు!
Published Wed, Jan 24 2024 1:36 AM | Last Updated on Wed, Jan 24 2024 1:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment