సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయశాఖ అధికారులకు మధ్య దూరం పెరుగుతోంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో వ్యవసాయశాఖ వైఫల్యం కనిపిస్తోంది. మూడేళ్ల క్రితం వరకు సీజన్ ప్రారంభానికి ముందు మే నెలలో వారంపాటు రైతు చైతన్య యాత్రలను వ్యవసాయ శాఖ నిర్వహించేది.
సీజన్‌కు ముందు రైతులకు కొత్త వంగడాలు, పథకాలు, పంట రుణాలు, సాగునీటి వసతి, వర్షపాతం, విద్యుత్ తదితర అంశాలపై అవగాహన కల్పించేవారు. ఎలాంటి పంటలు వేసుకోవాలో కూడా సూచించేవారు. ప్రతీ గ్రామంలో రైతు చైతన్య యాత్రలు జరగడం వల్ల కిందిస్థాయిలో రైతులకు, అధికారులకు మధ్య సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు రైతు చైతన్య యాత్రలు నిలిచిపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
లక్షలాది రైతులకు దూరం
గతంలో రైతు చైతన్య యాత్రలకు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశు సంవర్థకశాఖ తదితర అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యేవారు. సీజన్‌కు సన్నద్ధతపై వివరించేవారు. కొత్త వంగడాలు, విత్తనాలు ఎప్పుడు చల్లాలి, ప్రభుత్వ పథకాలు, ఎలాంటి పంటలకు డిమాండ్ ఉందనే విషయాలను చెప్పేవారు. సీజన్‌ను త్వరగా ప్రారంభించేలా చైతన్యం కలిగించేవారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించేవారు.
పంట రుణాలపై బ్యాంకర్లు చెప్పేవారు. మోటార్లకు విద్యుత్ అందించే విషయంలో వివరించేందుకు విద్యుత్ అధికారులు.. సాగునీటి వసతి, కాలువల్లో నీటిని వదిలే విషయాలను వెల్లడించేందుకు నీటిపారుదల అధికారులు హాజరయ్యేవారు. ఇతరత్రా అన్ని రకాల వివరాలను చెప్పేందుకు రెవెన్యూ అధికారులు కూడా వచ్చేవారు. ఒకరకంగా రైతులకు ఇదో వర్క్‌షాప్ మాదిరిగా ఉండేది. ఇలా రాష్ట్రంలోని మొత్తం 12 వేల గ్రామాల్లో చైతన్య యాత్రలు నిర్వహించేవారు. దాదాపు 10 లక్షల మంది హాజరయ్యేవారని వ్యవసాయవర్గాలు చెప్పాయి.
ప్రత్యామ్నాయంగా నిలవని రైతు వేదికలు
రాష్ట్రంలో ప్రభుత్వం దాదాపు 2,500 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఒక్కో ఏఈవో కేంద్రంగా వీటిని నెలకొల్పింది. వాటిల్లో రైతులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. కానీ రైతు వేదికలు ఆ మేరకు సేవలు అందించలేకపోతున్నాయన్న విమర్శలున్నాయి. రైతు చైతన్య యాత్రలు ప్రతీ గ్రామంలో కొనసాగేవి.
కానీ రైతు వేదికలు చైతన్య యాత్రలకు ప్రత్యామ్నాయంగా నిలవడంలేదు. అదీగాక కిందిస్థాయిలో ఉన్న ఏఈవోలకు రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించే పరిస్థితి లేదు. అలాగే, రైతు వేదికలకు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్య, విద్యుత్, సాగునీటిపారుదల తదితర శాఖల అధికారులు వచ్చే పరిస్థితి లేదు.
గత నెలన్నర రోజులుగా అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా రైతులకు సలహాలు ఇవ్వడంలో వ్యవసాయశాఖ వైఫల్యం కనిపిస్తోంది. కనీసం క్షేత్రస్థాయికి వెళ్లడానికి కూడా రాష్ట్రస్థాయి అధికారులు ఆసక్తి ప్రదర్శించడంలేదన్న ఆరోపణలున్నాయి. కాగా, వ్యవసాయ అధికారులకు రైతుబంధు, రైతుబీమా పనులు, ఇతరత్రా రోజువారీ సమాచార సేకరణ, ఆ డేటా అప్‌లోడ్ వంటి పనులతోనే సరిపోతోందన్న వాదన ఉంది.
Comments
Please login to add a commentAdd a comment