సాక్షి, అమరావతి: రైతుల నుంచి మెరుగైన ధరలకు వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు కొనుగోలు చేయించేలా ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. తొలుత అపరాలు.. ఆ తర్వాత దశల వారీగా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కంటే మెరుగైన ధర చెల్లించి కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ శాఖతో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచన మేరకు ఫ్లిప్‌కార్ట్ ముందుకు వచ్చింది. ఆన్‌లైన్ విక్రయాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లిప్‌కార్ట్ మాల్స్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
ఎఫ్‌పీవోల ద్వారా కొనుగోళ్లు
వ్యవసాయ ఉత్పత్తులను ఇతర బహుళ జాతి సంస్థల మాదిరిగా మధ్యవర్తులు, వ్యాపారులు, మిల్లర్ల ద్వారా కాకుండా రైతుల నుంచి నేరుగా ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అనంతపురం, గుంటూరు రీజియన్ పరిధిలో పనిచేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోల) ద్వారా కొనుగోళ్లు జరుపుతుంది.
ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ హరికిరణ్‌తో ఫ్లిప్‌కార్ట్ బృందం మంగళవారం సమావేశం కానుంది. తొలి దశలో కందులు, మినుములు, పెసలు తదితర పప్పు దినుసులను ఎఫ్‌పీవోల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించనున్నామని, త్వరలో ఎంవోయూ చేసుకోనున్నామని ఫ్లిప్‌కార్ట్ ఏపీ ప్రతినిధి గిరిధర్ ‘సాక్షి’కి తెలిపారు.
రైతులకు మేలు చేసేలా ఒప్పందం
రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ సంస్థ ముందుకురావడం శుభపరిణామం. ఆహార ఉత్పత్తుల సరఫరా చైన్ మేనేజ్‌మెంట్‌ను రాష్ట్రంలో బలోపేతం చేస్తున్న వేళ ఫ్లిప్‌కార్ట్ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతోంది. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు సైతం మేలు కలుగుతుంది.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ప్రారంభం
ఈ – కామర్స్ మార్కెట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏర్పాటు చేసిన ఈ నూతన ఫెసిలిటీని సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రారంభంతో ఫ్లిప్‌కార్ట్ సరఫరా చైన్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించింది.
ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కలగడంతో పాటు వేలాది మంది స్థానిక విక్రేతలు, ఎంఎస్‌ఎంఈలు, చిన్న రైతులకు మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫెసిలిటీతో రాబోయే ప్రతిస్టాత్మక ఫ్లిప్‌కార్ట్ కార్యక్రమం బిగ్ బిలియన్ డేస్ 2022లో రోజుకు 4 వేల గ్రోసరీ ఆర్డర్లును నిర్వహించగలదు. ఈ కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment