రైతుబంధు సొమ్ము వెనక్కి | Sakshi
Sakshi News home page

రైతుబంధు సొమ్ము వెనక్కి

Published Wed, May 1 2024 4:40 AM

Rythu Bandhu money back

రైతులకు వేసిన డబ్బు మళ్లీ సర్కార్‌ ఖాతాలోకే 

రాష్ట్రవ్యాప్తంగా రైతుల గగ్గోలు 

బ్యాంకు వివరాలు సరిగా లేకపోవడమే కారణం  

సమాచారం తెలిసినా పట్టించుకోని యంత్రాంగం 

సాక్షి, హైదరాబాద్‌: అధికార యంత్రాంగ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. రైతుబంధు సొమ్ము సక్రమంగా రైతుల ఖాతాల్లో వేయకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకే వచ్చిపడుతున్నాయి. ఇటీవల యాసంగి సీజన్‌కు సంబంధించి వేసిన రైతుబంధు సొమ్ము వేలాదిమంది రైతులకు వెళ్లకుండానే వెనక్కి రావడంపై వారు భగ్గుమంటున్నారు. 

వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే 19 వేల మంది రైతుల ఖాతాల్లోకి వెళ్లాల్సిన రైతుబంధు సొమ్ము బ్యాంకుల వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది. అనేకమంది రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో రైతుబంధు సొమ్ము అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రైతుబంధు సొమ్ము వెనక్కి వచ్చినట్టు లెక్కలు తీసిన వ్యవసాయశాఖ అధికారులు, వాటిని ఇంకా పూర్తిస్థాయిలో సరిదిద్దలేదు. తిరిగి రైతుబంధు చెల్లింపులు చేయకపోవడంపైనా విమర్శలు ఉన్నాయి.  

అధికారుల తప్పుల వల్లే ఈ పరిస్థితి... 
» వ్యవసాయశాఖ అధికారుల తప్పుల వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి.  
»   ఇంటిపేర్లు, రైతుల పేర్లు తప్పుగా రాయడం, బ్యాంకు ఖాతాల నంబర్లు సరిచూసుకోకుండా నంబర్లలో తప్పులు దొర్లడం వంటి కారణాల వల్ల రైతుల ఖాతాలకు వేసిన డబ్బులు వెనక్కి వస్తున్నాయి.  
»  ఒక్క అక్షరం తప్పుగా వచ్చినా కూడా బ్యాంకులు తిరిగి వెనక్కి వేస్తున్నాయి.  
»  కొందరు రైతుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ కావడం, ఖాతాదారులు డిఫాల్టర్‌గా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్‌ అవ్వడం, రుణాలు రెన్యువల్‌ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలే వ్యవసాయశాఖ వద్ద ఉండటం తదితర కారణాలు కూడా రైతుబంధు సొమ్ము తిరిగి వెనక్కి రావడానికి కారణంగా ఉంటుందని ఒక వ్యవసాయ ఉన్నతాధికారి తెలిపారు.  
»    వ్యవసాయశాఖకు రైతులు ఫిర్యాదు చేస్తున్నా, పూర్తిస్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. 
»   సాంకేతిక సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  
»    బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

యాసంగిలో ఐదెకరాలకే రైతుబంధు పరిమితం... 
రైతుభరోసా పథకం వచ్చే వానాకాలం నుంచి ప్రారంభిస్తామని, అప్పటివరకు గత రైతుబంధు మార్గదర్శకాలనే అమలు చేస్తామని కాంగ్రెస్‌ సర్కారు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రైతుబంధు మార్గదర్శకాల ప్రకారం భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరికీ రైతుబంధు సొమ్ము వేయాలి. కానీ ఇప్పటివరకు ఐదు ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతుబంధు సొమ్ము అందజేసినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకే ఉన్నా తమకు అందలేదంటున్నారు. దీనిపై కొంత గందరగోళం నెలకొంది. గత వానాకాలం సీజన్‌ లెక్కల ప్రకారం రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షలు ఉన్నారు. ఈ యాసంగి సీజన్‌లోనూ అంతే మంది రైతులకు సొమ్ము విడుదల చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం పేర్కొంది. 

ఆ ప్రకారం 1.52 కోట్ల ఎకరాలకు రూ. 7,625 కోట్లు విడుదల చేయాలి. ఇప్పటివరకు ఐదెకరాల వరకున్న రైతులకు మాత్రమే రూ. 5,202 కోట్ల రైతుబంధు సాయం అందిందని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement