
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో మరో కొత్త పథకం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని జూన్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులందరికి నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యమని మంత్రి అన్నారు.
సుమారు 40, 000 మంది రైతులకు, 2500 నుంచి 3000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి ముగ్గురు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథక కింద పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
గత నెలలో కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు పంట నష్టం అందించనున్నట్టు మంత్రి ప్రకటించారు. మార్చిలో కురిసిన వడగళ్ల వర్షాలకు 8,408 ఎకరాల్లో జరిగిన పంట నష్టం జరిగినట్టు గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. నష్ట పరిహారం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా, ఈ నెలలో కురిసిన వడగళ్ల వానకు, ఈదురు గాలులకు పంట నష్టంపై ప్రాథమిక రిపోర్ట్ ప్రభుత్వానికి అందిందని.. పరిశీలించి వారికి కూడా నష్ట పరిహారం అందించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.