
హైదరాబాద్: కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డు బిల్లుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మీద ముస్లింలకు నమ్మకం ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ‘వక్ఫ్ బోర్డ్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డ్ బిల్లును మేము సుప్రీంకోర్టులో చాలెంజ్ చేశాం. మా తరఫున కపిల్ సిబాల్ వాదించారు. కేవలం ఒక మతానికి మాత్రమే చట్టం ఎలా చేస్తారు?. వక్ఫ్ భూములు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కావు...దాతలు ఇచ్చిన భూములు పేద ముస్లింలకు చెందాలని ఇచ్చారు. వక్ఫ్ బోర్డు లో మహిళలు ఉన్నారు
తెలంగాణలో,ఏపీలో మహిళలు కూడా ఉన్నారు. అన్ని మతాల దేవాలయాల భూములు కబ్జా చేస్తున్నారు. అన్నిటికీ చట్టం తీసుకొని రావాలి.... అప్పుడు స్వాగతిస్తం. వేరే వేరే మతాల వారిని బోర్డులో నియమించడం వల్ల గొడవలు జరుగుతాయి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
కాగా, వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు.