ఆదాయ పన్ను కట్టేవారికీ పెట్టుబడి సాయం ఇవ్వండి
మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్‌లో రైతుల సూచన
దొడ్డు వరికి కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని విజ్ఞప్తి
యంత్రాలు సరఫరా చేయాలన్న అన్నదాతలు
ప్రజాధనం వృథా కాకుండా అర్హులకే ‘రైతు భరోసా’ అందిస్తాం: మంత్రి తుమ్మల
అసెంబ్లీలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకానికి పరిమితులు విధించాలని.. గతంలో మాదిరి అందరికీ కాకుండా, పదెకరాల వరకు భూములున్న రైతులకే పెట్టుబడి సాయం అందించాలని రైతులు పేర్కొన్నారు. కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకు పరిమితి పెట్టినా మంచిదేనని అన్నారు. చాలా మంది రైతులు సాగులో ఉన్న భూమికి, సాగుచేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఆదాయ పన్ను చెల్లించే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరారు.
విదేశాలకు వెళ్లే తమ పిల్లల విద్యా రుణాల కోసం బ్యాంకులకు ఆదాయ పన్ను స్టేట్‌మెంట్లు చూపించాల్సి వస్తుందని.. కాబట్టి ఆదాయ పన్ను చెల్లించేవారికి కూడా రైతుభరోసా ఇవ్వాలని సూచించారు. ప్రతీ వారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ‘రైతు భరోసా’పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు వంటి వాటికి రైతు భరోసాను నిలిపివేయాలని కోరారు.
దొడ్డు రకాల వరికీ బోనస్ ఇవ్వాలి
సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో.. చాలా మంది రైతులు దొడ్డు రకం వరికి కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో దొడ్డు వరి సాగు చేసేవారే ఎక్కువని, వారికీ బోనస్ ఇస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. సన్న రకాలకు ఎటూ డిమాండ్ ఉంటుందని.. మార్కెట్లోనూ మద్దతు ధర కంటే ఎక్కువగా రేటు పలుకుతుందని వివరించారు. ఇక సీజన్ సమయంలో పంటల సాగుకు అవసరమైన కూలీల కొరత ఉంటుందని.. దొరికినా ఖర్చు ఎక్కువ అవుతుందని అనేక మంది రైతులు వాపోయారు. అందువల్ల వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయ యంత్రాల సరఫరా నిలిచిపోయిందని, దాంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
రైతుబంధుతో రూ.25,670 కోట్లు వృథా: మంత్రి తుమ్మల
గతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి.. 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు. 93 శాతం వాటా ఉన్న సన్న, చిన్నకారు రైతుల వాటా రైతుబంధు మొత్తంలో 68 శాతం కూడా లేదని.. దానికితోడు 17.5 శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొస్తోందని, పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.15 వేలకు పెంచుతున్నామని చెప్పారు.
అయితే రైతుబంధు తరహాలో ప్రజాధనం వృథా కాకుండా ఉండేలా పటిష్ట విధానాల రూపకల్పనకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో రైతులు వెల్లడించిన, రాత పూర్వకంగా సేకరించిన సూచనలను క్రోడీకరించి నివేదిక తయారు చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని.. పూర్తిగా అందరి అభిప్రాయాలు తీసుకున్నాక, శాసనసభలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఆలస్యమైనప్పటికీ అర్హులకు మాత్రమే అందేలా రైతుభరోసాకు రూపకల్పన చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రైతుసంఘం నాయకుడు అన్వేశ్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment