సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలురైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు చెప్పారు. గతంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇచ్చే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.7లక్షలకు పెంచడమే కాకుండా వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటే భూ యజమాని, కౌలుదారుడు అనే భేదం లేకుండా వాస్తవ సాగు దారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. సీసీఆర్సీ (పంట సాగు దారుల హక్కు పత్రం) కార్డులున్న వారికి రూ.7లక్షలు, సీసీఆర్సీ కార్డుల్లేని వారికి వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా ‘కౌలుపాశమా?’ అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించడంపై మండిపడ్డారు.
పంట సాగు హక్కుదారుల చట్టం–2019 ప్రకారం గడిచిన మూడేళ్లలో 15 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 5.76 లక్షల సీసీఆర్సీలు జారీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 2.97 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి ఈ నెలాఖరులోగా జారీ చేస్తామని తెలిపారు. సీసీఆర్సీల ద్వారా వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పెట్టుబడి రాయితీ వంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ–క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటను కౌలురైతులు ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారని చెప్పారు.
గతంలో పరిహారంపై వడ్డీనే తీసుకునే వారు
గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.5లక్షల పరిహారం ఇచ్చేవారని, ఈ మొత్తంలో 1.5 లక్షలు అప్పులకు జమ చేయగా, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునే సదుపాయం రైతు కుటుంబానికి ఉండేది కాదని వచ్చే వడ్డీని మాత్రమే తీసుకునే సదుపాయం ఉండేదన్నారు. ఎప్పుడో ఐదేళ్లకో..పదేళ్లకో నిర్ణీత గడువు ముగిసిన తర్వాత మాత్రమే ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేదన్నారు.
కానీ ప్రస్తుతం సీసీఆర్సీ కార్డు ఉంటే రూ.7 లక్షలు, లేకుంటే వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారం నేరుగా బాధిత కుటుంబ సభ్యుల ఖాతాకే జమ చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 450 మందికి మాత్రమే రూ.5లక్షల చొప్పున రూ.20.12 కోట్ల పరిహారం అందించిందన్నారు. టీడీపీ హయాంలో పరిహారం దక్కని 471 మందికి రూ.5లక్షల చొప్పున రూ.23.55కోట్ల పరిహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం అందించిందన్నారు. మూడేళ్లలో ఆత్మహత్యకు పాల్పడిన 850 మందికి రూ.7లక్షల చొప్పున రూ.59.50 కోట్ల పరిహారం అందించామన్నారు.
వారి మరణాల వెనుక వాస్తవాలివి..
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన పెన్నాడ వెంకటసుబ్బారావు, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాదుకు చెందిన షేక్ జానీబాషా, అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం బందార్లపల్లికి చెందిన సోమశేఖర్‌లు వ్యవసాయమే చేయడం లేదని శేఖర్‌బాబు తెలిపారు. ఈ ముగ్గురు కూడా కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారని త్రిసభ్య కమిటీ నివేదికల్లో స్పష్టంగా పేర్కొందని పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే వ్యవసాయంలో కలిసిరాక, అప్పుల బాధ తాళలేక వీరంతా ఆత్మహత్యలకు ఒడిగట్టినట్టుగా ఈనాడులో పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా ఇలాంటి అసత్య కథనాలు ప్రచురించడం మానుకోవాలని హితవు పలికారు.
మూడేళ్లలో కౌలురైతులకు అందిన సాయమిలా
సీసీఆర్‌సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద 2019–20లో 1.08 లక్షల మందికి రూ.146.15 కోట్లు, 2020–21లో 69,899 మందికి రూ.94.36 కోట్లు, 2021–22లో 89,877 మందికి రూ.121.33 కోట్లు చొప్పున మూడేళ్లలో 2,68,032 మందికి రూ.361.84 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించామని వివరించారు. ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా 2019–20లో 6,331 మందికి రూ.5.73 కోట్లు, 2020–21లో 1.38 లక్షల మందికి రూ.140.70 కోట్లు, 2021–22లో 68,911 మందికి రూ.77.84 కోట్ల పంట నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ)ని అందించామన్నారు.
ఖరీఫ్–2020 లో 51,238 మందికి రూ.156.80 కోట్లు, ఖరీఫ్–21 సీజన్‌లో 1,21,735 మందికి రూ.330.34 కోట్ల పంటల బీమాపరిహారాన్ని అందించామన్నారు. 3 ఏళ్లలో 1,69,088 మంది రైతులకు రూ.3,382.06 కోట్ల సబ్సిడీతో కూడిన 7,247.5 క్వింటాళ్ల విత్తనాలందించగా, 8.29 లక్షల మందికి రూ.5,421 కోట్ల రుణాలివ్వగా,రూ.లక్ష లోపు తీసుకున్న పంట రుణాలు సకాలంలో చెల్లించిన 30,044 మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment