సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల వరకు గ్రామస్థాయిలో రైతన్నలకు సేవలందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఆఫ్రికా దేశాలనూ ఆకర్షిస్తున్నాయి. ఆర్బీకేలు అనుసరిస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇథియోపియా ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక చేయూతను అందించనుంది. ఇథియోపియా ప్రతినిధి బృందం త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది.
ఆర్బీకేలతో విప్లవాత్మక మార్పు
వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఆర్బీకే వ్యవస్థను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారు. 10,778 ఆర్బీకేలు రైతులకు ఇంటి ముంగిటే అన్ని సేవలు అందిస్తున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుగ్రాసం, మిశ్రమ దాణా, రొయ్యలు, చేపల మేత.. ఇలా సాగు ఉత్పాదకాలన్నీ ఆర్బీకేలు సమకూరుస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా కళ్లాల నుంచే కొనుగోలు చేస్తున్నారు.
విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఆర్బీకేలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. వీటి సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలు సన్నద్ధమయ్యాయి. ఇటీవలే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎఒ) ఏటా అందించే ప్రతిష్టాత్మక ‘చాంపియన్’ అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ అయ్యాయి.
ఇథియోపియాలో సమృద్ధిగా సాగు భూములు
ఆఫ్రికాలో అత్యంత పేద దేశమైన ఇథియోపియాకు వ్యవసాయం, పాడి రంగాలే ఆర్ధిక పునాది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 46.3 శాతం ఈ రంగాల నుంచే వస్తున్నప్పటికీ ఏటా 4.6 మిలియన్ల మంది ఆహార కొరతతో సతమతమవుతున్నారు. మొక్కజొన్న, కాఫీ, పప్పులు, తృణధాన్యాల సాగులో ప్రత్యేక స్థానం పొందిన ఇథియోపియాలో సాగు యోగ్యమైన భూములు విస్తారంగా ఉన్నాయి.
సాగు విస్తీర్ణం, దిగుబడులు పెంచుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న భూములను సాగులోకి తేవడం, రైతుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, ఉత్పత్తి ఖర్చులను నియంత్రించడం, నాణ్యతతో కూడిన దిగుబడులను సాధించే లక్ష్యంతో సౌత్‌సౌత్ కో ఆపరేషన్ భాగస్వామి దేశాల్లో అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇథియోపియా నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆర్బీకేల తరహాలో అక్కడ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆర్బీకేలను సిఫార్సు చేసిన కేంద్రం
ఇటీవల జరిగిన ఆసియా–ఫసిపిక్ రీజియన్ సమ్మిట్‌లో ఆర్బీకేల సేవల గురించి ప్రపంచ బ్యాంకు బృందానికి కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఆర్బీకే తరహా వ్యవస్థను ఇథియోపియాలో ఏర్పాటు చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని సూచించింది. ఇందుకయ్యే వ్యయాన్ని భరించేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులో మరోసారి భేటీ కానున్న ఇథియోపియా–వరల్డ్ బ్యాంక్ –కేంద్ర బృందాలు అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి.
జూన్ లేదా జూలైలో ఇథియోపియా వ్యవసాయశాఖ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. ఆర్బీకేల సేవలు, విస్తరణ కార్యక్రమాలపై అధ్యయనం చేయనుంది. అనంతరం మన రాష్ట్ర ప్రతినిధి బృందం ఇథియోపియాలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తుంది. మన శాస్త్రవేత్తలు, అధికారులు ఇథోయోపియాలో సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఆర్బీకేల సాంకేతికతను తీసుకురావడంపై కార్యాచరణ రూపొందించనున్నారు.
ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రికలైన ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. ఐరాస –ఎఫ్‌ఏవో చాంపియన్ అవార్డుకు ఆర్బీకేలను నామినేట్ చేసిన కేంద్రం తాజాగా ఏషియన్ ఫసిపిక్ సమ్మిట్‌లో ఇథియోపియా కోసం వీటిని వరల్డ్ బ్యాంక్‌కు సిఫార్సు చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్ధిక చేయూతతో ఈ ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇది మన ఆర్బీకేలకు దక్కిన మరో గౌరవం.
–పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment