మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తుది దశకు మరో 24,600 మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణ పనులు
గన్నవరం: గడిచిన ఐదేళ్లలో గోదాముల సామర్థ్యాన్ని 40 శాతం పెంచడం రైతుల పట్ల సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా, గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రూ.11.88 కోట్లతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు, 60 టన్నుల కెపాసిటీ కలిగిన లారీ వేబ్రిడ్జిని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు కాకాణి పేర్కొన్నారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ స్థాపించిన 65 ఏళ్లలో 8.86 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన సొంత గోదాములను నిర్మించినట్లు చెప్పారు. వీటిలో 2,23,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే నిర్మించినట్లు తెలిపారు. మరో 24,600 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాముల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. పాత గోదాములను రూ.21 కోట్లతో ఆధునికీకరించినట్లు తెలిపారు. ఈ గోదాముల్లో నిల్వ చేసుకునే పంట ఉత్పత్తులకు సంస్థ జారీ చేసే నిల్వ రశీదుపై బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.
నిల్వ చార్జీల్లో 25 శాతం రైతులకు రిబేటు కల్పిస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ జనాబ్ కరిముల్లా షేక్ అమీన్ మాట్లాడుతూ.. ఈ గోదాముల్లో పంట ఉత్పత్తులు దెబ్బ తినకుండా కెమికల్ ట్రిట్‌మెంట్‌తోపాటు శిక్షణ పొందిన సిబ్బంది పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్, కో ఆపరేషన్ ముఖ్య కార్యదర్శి బాబు.ఏ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ ఎండీ జి.ఓంకార్‌రెడ్డి, పలువురు ఏఎంసీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment