సాగుకు రూ.1.27లక్షల కోట్లు  | 117528 crores for agriculture department | Sakshi
Sakshi News home page

సాగుకు రూ.1.27లక్షల కోట్లు 

Published Fri, Feb 2 2024 4:30 AM | Last Updated on Fri, Feb 2 2024 4:36 AM

117528 crores for agriculture department - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25)గాను  వ్యవసాయ మంత్రిత్వ శాఖకు  కేంద్రం రూ.1.27 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–2024)తో పోల్చుకుంటే కేటాయింపులు స్వల్పంగా  పెంచింది. రూ.1,27,469.88 కోట్లలో వ్యవసాయ విభాగానికి రూ.1,17,528 కోట్లు కేటాయించగా, వ్యవసాయ పరిశోధన, విద్య (డేర్‌) విభాగానికి రూ.9,941 కోట్లు కేటాయించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన అంచనాల ప్రకారం.. వ్యవసాయ విభాగానికి రూ.1,16,788.96 కోట్లు, డేర్‌కు రూ.9,876.60 కోట్లు కేటాయించారు. పీఎం కిసాన్‌ పథకానికివ్యవసాయ విభాగం పరిధిలోని ప్రతిష్టాత్మక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60 వేల కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.60 వేల కోట్లే కేటాయించారు. ఈ పథకం కింద కేంద్రం రైతులకు మూడు వాయిదాలుగా సంవత్సరానికి రూ.6 వేలు చొప్పున అందజేస్తోంది.  

ప్రజా పంపిణీకి రూ.8 వేల కోట్ల తగ్గింపు.. 
వినియోగదారుల వ్యవహారాలు,ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కేటాయింపులు తగ్గాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఈ శాఖకు రూ.2.13 లక్షల కోట్ల పైచిలుకు కేటాయించారు. ఇందులో వినియోగదారుల వ్యవహారా లకు 302.62 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని బడ్జెట్‌ రూ.309.26 కోట్లు కావడం గమనార్హం.

ఇక ఆహార, ప్రజా పంపిణీ విభాగానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,21,924.64 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కొంత కోత విధించి రూ.2,13,019 కోట్ల బడ్జెట్‌ మాత్రమే కేంద్రం కేటాయించింది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్‌ షాపుల ద్వారా 80 కోట్లకు పైగా ప్రజలకు ఈ విభాగం ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తోంది.  

రసాయనాలు ఎరువుల శాఖకు రూ.1.68 లక్షల కోట్లు 
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రసాయనాలు, ఎరువుల శాఖకు రూ.1.68 లక్షల కోట్లు కేటాయించారు. ఎరువుల విభాగానికి కేటాయింపులు రూ.1,88,947.29 కోట్ల నుంచి రూ.1,64,150.81 కోట్లకు తగ్గించారు. ఇక రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగానికి కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.572.63 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి కేవలం రూ.139.05 కోట్లు మాత్రమే కేటాయించారు.

అయితే ఫార్మాస్యూటికల్స్‌ విభాగానికి మాత్రం కేటాయింపులు పెరగడం గమనార్హం. దీనికి కేటాయింపులు రూ.2,697.95 కోట్ల నుంచి రూ.4,089.95 కోట్లకు పెరిగాయి. అలాగే హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలోని సహకార శాఖకు కూడా రూ.747.84 కోట్ల నుంచి రూ.1,183.39 కోట్లకు కేటాయింపులు పెరిగాయి. ఇక మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖకు రూ.7,105.74 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. 

నీళ్లకు నిధులు పెరిగాయ్‌
♦ జలశక్తి శాఖకు రూ. 98,418 కోట్లు కేటాయింపు
♦ గతేడాదికన్నా రూ. 2 వేల కోట్లు అధికం
♦ పీఎంకేఎస్‌వై ప్రాజెక్టుకు రూ. 11,391 కోట్లు 
♦ గతంకన్నా రూ. 3 వేల కోట్లు పెరుగుదల

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కేంద్ర జలశక్తి శాఖకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. గతేడాది జలశక్తి శాఖకు మొత్తంగా కేటాయించిన నిధుల కంటే దాదాపు రూ. 2 వేల కోట్ల మేర కేటాయింపులను పెంచింది. గతేడాది జలశక్తి శాఖకు రూ. 96,549 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఆ కేటాయింపులను రూ. 98,418 కోట్లకు పెంచింది. ముఖ్యంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద నిధుల మొత్తాన్ని రూ. 8,781 కోట్ల నుంచి రూ. 11,391 కోట్లకు పెంచింది.

దీనికిందే ఉన్న సమగ్ర సాగునీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పథకానికి గతేడాదికి సమానంగా రూ. 2,500 కోట్లు కేటాయించింది. ఏఐబీపీ పథకంలో తెలంగాణ, ఏపీకి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు ఈ నిధులు కేటాయించే అవకా శం ఉంది.

దీంతోపాటే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ సమయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరగా పీఎంకేఎస్‌వై పథకం కింద ప్రాజె క్టుకు ఆర్థిక సాయం అందిస్తా మని హామీ ఇచ్చారు. ఈ నిధు ల్లోనే ఆ మొత్తాలను కేటాయించాల్సి ఉంటుంది. ఇక ఆయకట్టు అభివృధ్ధి పథకం (కాడా) కింద రూ. 1,400 కోట్లు కేటాయించగా దీని కింద సైతం తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులున్నాయి.

నదుల అనుసంధానానికి పెరిగిన కేటాయింపులు...
నదుల అనుసంధాన కార్యక్రమానికి కేంద్రం నిధులు పెంచింది. గతేడాది కేవలం రూ. 1,500 కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వం.. ఈ ఏడాది దాన్ని రూ. 4 వేల కోట్లకు పెంచింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కెన్‌–బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే మొదలవ్వడం, నాలుగు రోజుల కిందటే మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ మధ్య పర్బతి–కాలిసింద్‌–చంబల్‌ నదులను తూర్పు రాజస్తాన్‌ కాలువతో కలిపే అనుసంధాన ప్రక్రియపై ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో కేటాయింపులు పెంచినట్లు తెలుస్తోంది.

అయితే గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియపై ఎలాంటి ముందడుగు ఉంటుందన్నది తేలాల్సి ఉంది. గతేడాది తుంగభద్ర జలాలపై ఆధారపడి కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర సాయం కింద రూ. 5,300 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించగా ఈ ఏడాది దాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు ముఖ్యంగా ఏపీలోని పోలవరం ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు అంశాల ప్రస్తావన లేదు. 

‘లఖ్‌పతి దీదీ’ కిందకు 3 కోట్ల మంది మహిళలు
న్యూఢిల్లీ: స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం తీసుకుని పొదుపు బాటలో పయనిస్తూ తమ దక్షతతో వ్యాపారం చేస్తూ లఖ్‌పతి దీదీ (లక్షాధి కారి)లుగా అవతరిస్తున్న మహిళల సంఖ్యను మరింత పెంచడంపై దృష్టిపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ విషయాన్ని తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘ 83 లక్షల స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీ)ల్లో దాదాపు తొమ్మిది కోట్ల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకుంటూ స్వయం ఉపాధి సాధిస్తూ, చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు.

కష్టించి వ్యాపారాన్ని నిలబెట్టుకుని తమ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది మహిళలు ఏటా కనీసం రూ. 1 లక్ష ఆర్జిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా ఇలా పొదుపు సంఘాల మహిళలు దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తూ సాధికారత, స్వావలంభన సాధిస్తూ అందరికీ స్ఫూర్తిప్రదాతలయ్యారు. ఇలాంటి లక్షాధికారి(లఖ్‌పతి దీదీ)ల సంఖ్యను రెండు నుంచి మూడు కోట్లకు పెంచడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని నిర్మల లోక్‌సభలో వ్యాఖ్యానించారు. 

ఆశ, అంగన్‌వాడీలకు ‘ఆయుష్మాన్‌ భారత్‌’
న్యూఢిల్లీ: ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు హెల్త్‌కేర్‌ కవరేజీని కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వారిని ఆయుష్మాన్‌ భారత్‌ బీమా పథకం పరిధిలోకి తీసుకువస్తు న్నట్లు 2024–25 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ ప్రకటించారు. సక్షం అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0 కింద అంగన్‌వాడీ కేంద్రాలను ఉన్నతీకరించడం ద్వారా న్యూట్రిషన్‌ డెలివరీ వేగవంతం అవుతుందని చెప్పారు. ఇప్పుడున్న ఆస్పత్రుల మౌలిక వసతు లను వినియోగించుకుని మరిన్ని మెడికల్‌ కాలేజీలు ఏర్పా టు చేయాలనే ప్రణాళికలో ప్రభుత్వం ఉందని తెలిపారు. దీనిని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామ న్నారు.

ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కేటాయింపులను రూ. 6,800 కోట్ల నుంచి రూ. 7,500 కోట్లకు పెంచినట్లు నిర్మల చెప్పారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ నియంత్రణ కోసం 9 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తామన్నా రు. సమగ్ర ఆచరణ కోసం వివిధ మాతా శిశు హెల్త్‌కేర్‌ స్కీంలను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు. మిషన్‌ ఇంద్రధనుష్‌ మరింత సమర్థంగా అమలు చేయడంలో భాగంగా కొత్తగా రూపొందించిన యు–విన్‌ పోర్టల్‌ను దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నామని తెలిపారు.  

ఆదాయ పన్ను శ్లాబ్‌లు యథాతథం..
సాక్షి,అమరావతి: మధ్యతరగతి, వేతనజీవుల ఆశలపై ఆర్థిక మంత్రి నీళ్లు కుమ్మరించారు. ఎన్నికల వేళ ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో కాసింత ఉపశమన మాటలు వస్తాయనుకున్న వారికి గతంలో చేసిన గొప్పలను ఏకరువు పెట్టి సరిపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ కావడంతో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదన్నారు.

వ్యక్తిగత ఆదాయ పన్నుల శ్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవన్నారు. గత పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రత్యక్ష పన్ను ల వసూళ్లూ 3 రెట్లకుపైగా పెరగ్గా పన్ను రిట ర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 2.4 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. 2013– 14 ఆర్థిక సంవత్సరానికి దేశంలో పన్ను చెల్లించాల్సినవసరం లేని ఆదాయ పరిమితి రూ.2.2 లక్షలు ఉంటే ఇప్పుడు 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఒక్క రూపాయి పన్ను చెల్లించా ల్సిన పని లేదన్నారు.

కొత్త పన్నుల విధానం ఎన్నుకున్న వారికే ఇది వర్తింపు
7 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదన్న ఆర్థిక మంత్రి మాటలపై మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం కొత్త పన్నుల విధానం ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని, పాత పన్ను ల విధానంలో ఉన్న వారికి ఈ రిబేటు పరిమితి రూ.5 లక్షలే ఉందన్న విషయాన్ని వారు గుర్తుచేశారు. నాలుగేళ్ల కిందట కొత్త పన్నుల విధానం తీసుకొచ్చారు. పాత విధానంతో పోలి స్తే తక్కువ పన్ను రేట్లతో అన్ని వయసుల వారికి ఒకే విధమైన శ్లాబ్‌ రేట్ల ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ఎంచుకుంటే సెక్షన్‌ 80సీ, గృహ రుణాలు, స్టాండర్డ్‌ డిడక్షన్, ఆరోగ్య బీమా వంటి పలు సెక్షన్ల కింద లభించే ప్రయోజనాలను పొందడానికి వీలుండదు. మొత్తం ఆదాయం మీద పన్ను చెల్లించా ల్సి వస్తుంది.

కొత్త పన్నుల విధానంలో 7 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించన వరం లేకుండా సెక్షన్‌ 87ఏ కింద రిబేటు ప్రకటించింది. దీనికింద రూ.25,000 ప్రయో జనం లభిస్తుంది. అదే పాత పన్నుల విధానం ఎంచుకుంటే సెక్షణ్‌ 87ఏ రిబేటు పరిమితిని రూ.5 లక్షల ఆదాయం వరకు పరిమితం చేశారు. పాత పన్నుల విధానం ఎంచుకున్న వారికి కేవలం రూ.12,500 మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. పాత విధానం నుంచి కొత్త విధానంలోకి మార్చాలన్న ఉద్దే శ్యంతో నిర్మాల ఈ నిర్ణయం తీసుకున్నారు.

రిటైల్‌ వ్యాపారుల ఊహాజనిత ఆదాయం పరిమి తిని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు, వృత్తినిపుణుల ఊహాజనిత ఆదాయ పరిమితిని రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో పన్ను రిట ర్నులు సులభంగా దాఖలు చేసే విధంగా పలు చర్యలు తీసుకున్నామని, దీంతో 2013– 14లో 93 రోజులుగా ఉన్న రిఫండు సమయాన్ని ఇప్పుడు పదిరోజులకు తగ్గించినట్లుగా తెలిపారు. 

గ్రామీణాభివృద్ధికి..రూ.1.77 లక్షల కోట్లు
2024–25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.1.77 లక్షల కోట్లు ప్రకటించారు. గతేడాది రూ.1.57 లక్షల కోట్ల కంటే 12 శాతం ఎక్కువగా కేటాయించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86,000 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌లో చేసిన రూ.60,000 కోట్ల కంటే ఇది 43 శాతం ఎక్కువ. వచ్చే ఐదేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన– గ్రామీణ్‌ పథకానికి రూ.54,500 కోట్లు కేటాయించారు.

‘లఖ్‌ పతి దీదీ’ల లక్ష్యాన్ని రెండు కోట్ల నుంచి 3 కోట్లకు పెంచినట్లు సీతారామన్‌ ప్రకటించారు. జాతీయ జీవనోపాధి మిషన్‌–అజీవికకు రూ.15,047 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.14,129.17 కోట్ల కంటే ఇదిదాదాపు 6% ఎక్కువ. కాగా, ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజనకు కేటాయింపులు తగ్గాయి. ఈ బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు కేటాయించారు.  

పర్యావరణ శాఖకు..రూ.3,265 కోట్లు
కేంద్ర ప్రభుత్వం 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో పర్యావ రణ శాఖకు రూ.3,265 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఈ మొత్తం రూ.3,231 కోట్లు ఉండగా, ఈ సారి కొద్దిగా పెరి గింది. అలాగే కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర జూ అథారిటీ, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ,ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ సంస్థలకు గతేడాది బడ్జెట్‌లో 158.60 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.192 కోట్లు కేటాయించారు.

కాగా, స్వయంప్రతిపత్తి సంస్థలైన జీబీ పంత్‌ హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎన్వి రాన్‌మెంట్, భారత అటవీ పరిశోధన, అభి వృద్ధి మండలి, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలకు కేంద్రం గతేడాది బడ్జెట్‌లో రూ.573.73 కోట్లు కేటాయించగా, తాజా మధ్యంతర బడ్జె ట్‌లో రూ.391 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇక అడ వుల్లో జంతు ఆవాసాల సమీకృత అభివృద్ధికి రూ.450 కోట్లను కేటాయించింది. అలాగే అడవుల పరిరక్షణ, పచ్చ దనం పెంపునకు సంబంధించి జాతీయ గ్రీన్‌ ఇండియా మిషన్‌కు గత బడ్జెట్‌లో రూ.160 కోట్లు ఉన్న కేటాయింపులను ఈ సారి రూ.220 కోట్లకు పెంచింది.  

సామాజిక న్యాయం, సాధికారతకు..రూ.14,225 కోట్లు
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 మధ్యంతర బడ్జె ట్‌లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ.14,225.47 కోట్లు కేటాయించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖకు రూ.13,000 కోట్లు కేటాయించగా.. వికలాంగుల సాధికారత శాఖకు రూ.1,225.27 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌ రూ.11,078.33 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 28.4% పెరిగింది. వికలాంగుల సాధికారత విభా గం కింద జాతీయ వికలాంగుల సంక్షేమానికి రూ.615 కోట్లు కేటా యించారు.

సామాజిక న్యాయం, సాధికారత శాఖ కింద షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి పథకానికి రూ.9,559.98 కోట్లు కేటాయించగా, బలహీ న వర్గాల అభివృద్ధి కార్యక్రమానికి రూ.2,150 కోట్లు కేటా యించారు. జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్, వెనుక బడి న తరగతుల జాతీయ కమిషన్, సఫాయి కర్మచారుల జాతీ య కమిషన్‌కు మొత్తం రూ.7,175 కోట్లు కేటాయించారు. 

గిరిజన మంత్రిత్వ శాఖకు..రూ.13వేల కోట్లు
2024–25 మధ్యంతర బడ్జెట్‌లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేంద్రప్రభుత్వం రూ.13,000 కోట్లు కేటాయించింది. ఇది గత కేటాయింపుల కంటే భారీ అనగా 70 శాతం ఎక్కువ. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గిరిజన మంత్రిత్వ శాఖకు రూ.7,605 కోట్లు కేటాయించారు. 2024– 25లో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (ఈఎమ్‌ ఆర్‌ఎస్‌) నిర్మాణానికి కేంద్రం రూ.6,399 కోట్లు కేటాయించింది. ఇది 2023–24లో కేటాయించిన రూ.2,471.81 కోట్ల కంటే 150 శాతం ఎక్కువ. ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్‌ గ్రామ యోజనకు కేటాయింపులు రూ.300 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచారు.

ఈ పథకం కింద విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి–ఆదాయ కల్పన వంటి రంగాల్లోని అంతరాలను తగ్గించడానికి గిరిజన ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులను అందిస్తారు. గిరిజన పరిశోధనా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని రూ.50 కోట్ల నుంచి రూ.111 కోట్లకు పెంచారు. కాగా, జాతీయ ఫెలోషిప్, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య, స్కాలర్‌షిప్‌ కోసం బడ్జెట్‌ కేటాయింపులు 2023–24లో రూ.230 కోట్ల నుంచి 2024–25లో రూ.165 కోట్లకు తగ్గించారు.  

రాష్ట్రాలకు రూ. 75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు
వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాకారం చేసే చర్యల్లో భాగంగా సంస్కరణల బాటపట్టే రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ. 75 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తామని కేంద్రం తెలిపింది. 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యసాధన కోసం ఈ మేరకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు ఎన్నో అభివృద్ధి ఆధారిత సంస్కరణలను చేపట్టాల్సి ఉందన్నారు. అన్ని రంగాల సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా మోదీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. 

అంతరిక్షానికి అదనంగారూ. 2,000 కోట్లు
అంతరిక్షంలో భారత కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా కలిగిన అంతరిక్ష విభాగానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.2 వేల కోట్లు అదనంగా కేటాయించారు. ఈ విభాగానికి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.13,042.75 కోట్లు కేటాయించారు. 2023–24 సవరించిన అంచనాల ప్రకారం ఈ విభాగానికి రూ.11,070.07 కోట్ల కేటాయింపులు జరిగాయి.

2035 కల్లా భారత్‌ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని, 2040 కల్లా భారతీయ వోమగామి చంద్రునిపై కాలు మోపాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఇలావుండగా స్పేస్‌ టెక్నాలజీకి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో రూ.8,180 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.10,087 కోట్లుగా ప్రతిపాదించారు.   

మహిళా శిశు అభివృద్ధికి రూ.26 వేల కోట్లు 
మధ్యంతర బడ్జెట్‌లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.26 వేల కోట్ల కేటాయింపులు దక్కాయి. 2023–24 బడ్జెట్‌తో పోలిస్తే ఇది 2.52 శాతం అధికం. అత్యధికంగా సాక్షం అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0లకు రూ.21,200 కోట్లు కేటాయించారు. మిషన్‌ శక్తికి రూ.3,145.97 కోట్లు ప్రతిపాదించారు. మహిళలకు భద్రత, రక్షణ అలాగే వారు తమ హక్కులు పొందడం, పలు ప్రభుత్వ పథకాలు చేరువ చేయడం లక్ష్యంగా మిషన్‌ శక్తి (సంబల్‌)కి కేంద్రం శ్రీకారం చుట్టింది.

కాగా మిషన్‌ వాత్సల్య (బాలల రక్షణ సేవలు, బాలల సంక్షేమ సేవలు)కు రూ.1,472 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం..2023–24లో మహిళా శిశు అభివృద్ధి శాఖకు రూ.25,448.68 కోట్లు కేటాయించారు. అటానమస్‌ సంస్థలకు రూ.168 కోట్ల నుంచి రూ.153 కోట్లకు బడ్జెట్‌ తగ్గింది. ఈ సంస్థల్లో సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ ఏజెన్సీ, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్, నేషనల్‌ 
కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ ఉన్నాయి.   

ఇది కార్పొరేట్ల బడ్జెట్‌
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కార్పొరే ట్లకు లాభాలు కట్టబెట్టే, ఓటర్లను భ్రమల్లో పెట్టే బడ్జెట్‌ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.  ఈ బడ్జెట్‌ దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి ప్రయోజనం కల్పించేది కాదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. కేంద్రం ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ, మరోవైపు రాయితీలకు కోత పెడుతోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement