పెద్దపల్లి జిల్లాలో క్రిమిసంహారక మందును పిచికారీ చేస్తున్న డ్రోన్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయమంటే దుక్కి దున్నడం నుంచి పంట కోత దాకా ఎన్నో పనులు.. తీరిక లేని శ్రమ.. కూలీల కొరత ఓ వైపు, సమయాభావం మరోవైపు ఇబ్బందిగా మారిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో రైతన్నలకు వ్యవ‘సాయం’ కోసం డ్రోన్లతో ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి పెట్టింది.
కేవలం పురుగు మందులు పిచికారీ చేయడానికే పరిమితం కాకుండా.. విత్తనాలు, ఎరువులు చల్లడం.. పంటలో చీడపీడలు, తెగుళ్లను, పూత, కాత పరిస్థితిని గుర్తించేలా ఫొటోలు తీయడం.. దిగుబడి ఏ మేరకు వచ్చే అవకాశం ఉందనే అంచనా వేసేందుకు వీలైన సమాచారం సేకరించడానికి వీలుగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. డ్రోన్లను సరైన తీరులో వినియోగించడం ద్వారా.. సాగులో పురుగు మందులు, ఎరువుల వృధాను అరికట్టవచ్చని, కూలీల కొరతకు చెక్‌పెట్టవచ్చని వర్సిటీ అధికారులు చెప్తున్నారు.
వరిలో విత్తనాలు వెదజల్లేలా..
డ్రోన్ల ద్వారా వరి విత్తనాలను వెదజల్లి సాగు చేసే విధానాన్ని వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేస్తోంది. దీనిపై పరిశోధన కొనసాగుతోందని, త్వరలో రైతులకు అందుబాటులోకి తెస్తామని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వరి నారు పెంచడానికి కొన్ని రోజులు పడుతుందని, తర్వాత నారు తీసి నాట్లు వేయడానికి సమయం పడుతుందని.. ఇదే సమయంలో కూలీల కొరత, ఖర్చు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.
ఈ క్రమంలో వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తే బాగుంటుందని, దీనికి డ్రోన్ సాంకేతికతను వినియోగించేలా పరిశోధన చేస్తున్నామని వివరించారు. డ్రోన్‌తో రోజుకు ఏకంగా 30 ఎకరాల్లో ఐదు వరుసల్లో వరి విత్తనాలను వెదజల్లవచ్చని చెప్తున్నారు. దీనివల్ల రైతులకు కూలీల ఖర్చు తగ్గుతుందని, సమయం కలిసివస్తుందని అంటున్నారు. కలుపు మందును కూడా డ్రోన్ల సాయంతో చల్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటున్నారు.
డ్రోన్లపై శిక్షణ కోసం అకాడమీ
రాష్ట్రంలో నిరుద్యోగులకు, ఆసక్తి కలిగిన వారికి డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని.. ఇందుకోసం డ్రోన్ అకాడమీని నెలకొల్పాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర రంగాల్లో డ్రోన్లను ఎలా వాడాలో శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. 18 ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న వారికి శిక్షణ అవకాశం ఉంటుందని.. ఇందుకోసం తప్పనిసరిగా పాస్‌పోర్ట్ ఉండాలని, కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని వెల్లడించారు. ఆరు రోజులపాటు సమగ్రంగా శిక్షణ ఇచ్చేందుకు రూ.45 వేలు ఫీజు ఖరారు చేశారు. ప్రధానంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఉంటుంది.
పురుగు మందులు చల్లడంపై ప్రత్యేకంగా..
రాష్ట్రంలో ప్రధానంగా సాగు చేసే వరి, పత్తి, వేరుశనగ, కంది, పొద్దు తిరుగుడు, ఆముదం, సోయాబీన్ పంటల్లో డ్రోన్ల ద్వారా పురుగు మందులను చల్లడంపై ప్రత్యేక శిక్షణ ఉంటుందని వ్యవసాయ వర్సిటీ వెల్లడించింది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను రూపొందించింది. ఉదాహరణకు డ్రోన్ల ద్వారా పురుగు మందు చల్లేటపుడు వాటి రెక్కల నుంచి వచ్చే గాలి వేగానికి వరి చేను విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎంత ఎత్తు నుంచి డ్రోన్లను ఉపయోగించాలి, ఎంత స్థాయిలో మందును విడుదల చేయాలన్నది నిర్ణయించారు.
► ఇక సాధారణ తైవాన్ స్ప్రేయర్ల ద్వారా ఎకరా పంటకు పురుగుమందు పిచికారీ చేయాలంటే 150 లీటర్ల నుంచి 200 లీటర్ల నీటిని వాడుతారు. అదే డ్రోన్ల ద్వారా అయితే కేవలం 20 లీటర్లతో పిచికారీ చేయొచ్చు. ఒక రోజులో ఏకంగా 30 ఎకరాల్లో మందును చల్లవచ్చు. ప్రత్యేక పరికరాలను అమర్చడం ద్వారా.. కాండం మొదట్లోకి పురుగు మందు చేరేలా చేయవచ్చు.
► కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన నానో యూరియాను కూడా డ్రోన్ల ద్వారా పంటలపై చల్లవచ్చని వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంగోపాల్ వర్మ తెలిపారు. పురుగు మందులను తక్కువ వ్యవధిలో, పొదుపుగా, సమర్థవంతంగా చల్లడానికి డ్రోన్లతో వీలవుతుందని వివరించారు.
అదనపు పరికరాలను అమర్చి..
పంటలకు డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు చల్లడానికి సంబంధించి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని పంటలకు పైపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. మరికొన్నింటికి కాండం మొదట్లో చల్లాల్సి ఉంటుంది. దీనితోపాటు పంట పరిస్థితి ఏమిటి? ఏవైనా చీడపీడలు ఆశించాయా? అన్నది తెలుసుకునేందుకు ఫొటోలు తీయాలి.
వాటిని వ్యవసాయాధికారికి పంపాలి. ఈ క్రమంలోనే ఆయా అవసరాలకు అనుగుణంగా డ్రోన్లకు ప్రత్యేక పరికరాలను అమర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఇక పంటల పూత, కాత ఎలా ఉంది? దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశం ఉంది వంటి ప్రతి అంశాన్ని సూక్ష్మస్థాయిలోనూ పర్యవేక్షించేలా డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
రైతులకు సబ్సిడీపై డ్రోన్లు
రాబోయే రోజుల్లో గ్రామాల్లో సాగు కోసం డ్రోన్ల వినియోగం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా.. ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరి కోత యంత్రాలు వంటివి ఇవ్వగా.. భవిష్యత్తులో డ్రోన్లను అందజేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వాటిని ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులకు సబ్సిడీపై ఇవ్వాలని యోచిస్తున్నారు.
డ్రోన్ల సాగులో దేశానికే మార్గదర్శకంగా..
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి తెలంగాణ దేశానికే మార్గనిర్దేశం చేస్తోందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. వివిధ పంటల్లో డ్రోన్ల వినియోగం, నిర్వహణకు సంబంధించి జయశంకర్ యూనివర్సిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక (ఎస్‌ఓపీ)నే కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించిందని అంటున్నారు.
వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై సాధారణ మార్గదర్శకాలివీ..
► నీటి వనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాసం పంటలు, ప్రజా వినియోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటికి దూరంగా డ్రోన్లను వినియోగించాలి.
► డ్రోన్ వాడకానికి సంబంధించి గ్రామ పంచాయతీ, సంబంధిత వ్యవసాయ అధికారి కనీసం 24 గంటల ముందుగా అనుమతి ఇస్తారు.
► డ్రోన్ మంచి స్థితిలో ఉందని, సురక్షితంగా ప్రయాణించడానికి సరిపోతుందని ముందే సరిచూసుకోవాలి.
► దానితో పిచికారీ చేసే సమయంలో ఆయా ప్రాంతాల్లోకి జంతువులు, వ్యక్తులు ప్రవేశించకూడదు.
► ఆపరేటర్లు డ్రోన్ ఆపరేషన్, సురక్షితమైన పురుగు మందుల పిచికారీ.. ఈ రెండింటిపై శిక్షణ పొంది ఉండాలి.
► ముందుగానే ప్రతిపాదిత ప్రాంతం, సరిహద్దు, అడ్డంకులు (గోడలు, చెట్లు)ను పరిశీలించి ఆ ప్రకారం డ్రోన్‌ను ఆపరేట్ చేయాలి.
► ప్రభుత్వ సంస్థలు, సైనిక స్థావరాలపై లేదా డ్రోన్లకు అనుమతి లేని జోన్ల మీదుగా ఎగురవేయవద్దు. అనుమతి ఇవ్వని ప్రైవేట్ ఆస్తులపైనా డ్రోన్ ఎగరవేయవద్దు.
Comments
Please login to add a commentAdd a comment