సాక్షి, అమరావతి: సూక్ష్మసేద్యాన్ని విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2022–23లో లక్ష్యానికి మించి తుంపర, బిందు సేద్య పరికరాలు అందించగా.. 2023–24లో రూ.902 కోట్లను వెచ్చించి కనీసం 2.5 లక్షల ఎకరాల్లో విస్తరణకు శ్రీకారం చుట్టింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పరికరాల పంపిణీ ప్రారంభించింది.
లక్ష్యానికి మించి పంపిణీ
సూక్ష్మ సేద్యంలో దేశంలోనే మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా.. టాప్–20 జిల్లాల్లో ఐదు జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇటీవలే నూరు శాతం బోర్ల కింద బిందు, తుంపర పరికరాలు అమర్చిన గ్రామంగా వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి గ్రామానికి జాతీయ పురస్కారం దక్కించుకుంది. రాష్ట్రంలో 12.62 లక్షల మంది రైతులు 35.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేస్తుండగా, ఏటా 2.50 లక్షల ఎకరాల చొప్పున మరో 18.65 లక్షల ఎకరాల్లో విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేశారు.
టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.936 కోట్ల బకాయిలు చెల్లించడంతో రాష్ట్రంలో సూక్ష్మసేద్యం విస్తరణ వేగం పుంజుకుంది రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5–12.5ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీగా ప్రభుత్వం భరిస్తోంది. 2022–23లో 1.87 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యం కాగా.. రికార్డు స్థాయిలో 82,289 మంది రైతులకు చెందిన 2.26 లక్షల ఎకరాల్లో విస్తరించారు. వీటికోసం రైతులు తమ వాటాగా రూ.174 కోట్లు చెల్లించగా, ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.465 కోట్లు భరించింది.
2023–24లో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరణ
2023–24లో రూ.902 కోట్ల అంచనా వ్యయంతో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. అంచనా మొత్తంలో రైతుల వాటా రూ.145 కోట్లు కాగా, సబ్సిడీ రూపంలో రూ.757 కోట్లు ప్రభుత్వం భరించనుంది. ఏప్రిల్ నుంచి ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టి ఇప్పటివరకు 5.07లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాల అమరిక కోసం 1.72 లక్షల మంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ఎలాంటి సిఫార్సులు లేకుండా క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల ఎంపిక చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో ఇప్పటివరకు 1.55 లక్షల ఎకరాల్లో సర్వే చేయగా.. 1.45 లక్షల ఎకరాల్లో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
పండగ వాతావరణంలో పరికరాల పంపిణీ
45,255 ఎకరాల్లో ఏర్పాటు కోసం 16,630 మంది రైతులు తమ వాటా సొమ్మును చెల్లించారు. 10,556 మంది రైతులకు చెందిన 29,070 ఎకరాల్లో అమర్చేందుకు అవసరమైన బిందు, తుంపర పరికరాల పంపిణీకి శనివారం శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిందు, తుంపర పరికరాల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పరికరాల పంపిణీ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment