‘సాక్షి’ కథనంపై స్పందించిన వ్యవసాయ శాఖ
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ‘సాగు ఢమాల్.. రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం’శీర్షికన ‘సాక్షి’మెయిన్‌లో శనివారం ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కథనంలో వచ్చిన వివరాలను ఆరా తీయడంకోసం వ్యవసాయశాఖ.. మహబూబ్‌నగర్ జిల్లాలోని రైతు వద్దకు సంబంధిత అధికారులను పంపి వివరాలు సేకరించింది. ‘సాక్షి’కి తన అభిప్రాయాన్ని తెలియజేసిన మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని మాచన్‌పల్లికి చెందిన రైతు మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి వద్దకు ఏఈఓ ఎండీ హనీఫ్ వెళ్లి ఆయన పొలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
తనకు సొంతంగా నాలుగున్నర ఎకరాల పొలం ఉందని, దాంతోపాటు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటానని, ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో కేవలం మూడున్నర ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేశానని, మిగతా 17 ఎకరాల్లో పంట సాగు చేయడానికి భారీ వర్షాలు రాకపోవడమే కాకుండా బోర్లలో సరిపడా నీరు ఇంకా పెరగలేదని ఆ రైతు ఏఈఓకు వివరించారు.
17 ఎకరాలకు సరిపడా నారుమడి సిద్ధంగా ఉందని, భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపారు. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో పంటల సాగు ఇంత అధ్వానంగా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెదవి విరిచినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే వాస్తవాలు తెలుసుకోవడానికి అధికారులను రైతుల వద్దకు పంపినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment