సాక్షి, హైదరాబాద్: రైతుల బ్యాంకుఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
3 గంటల పాటు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్ర మాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడిసాయం అందించాలన్నారు. రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేసే విధానం గతంలో ఉన్న మాదిరిగానే కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు.
68.99 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల మేరకు రుణమాఫీ చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
వారానికి రెండ్రోజులు
ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు
ప్రజాదర్బార్‌ప్రజావాణిగా మార్పు
ప్రజాదర్బార్‌ను ఇకనుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం ఆదేశించారు. దీనిని ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణికి ఉదయం 10లోగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు.
తొలి ప్రజాదర్బార్ శుక్ర వారం నిర్వహించగా, ఆ తర్వాత రెండు రోజులు శని ఆదివారాలు సెలవు కావడంతో ప్రజా దర్బార్ నిర్వహించలేదు, సోమ వారం ప్రజా దర్బార్ ఉన్నా, సీఎం రేవంత్‌రెడ్డి కాకుండా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించారు, ఇకపై దీనికి ఎవరెవరు హాజరవుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీఎం ప్రజావాణికి హాజరై విజ్ఞప్తులు స్వీకరిస్తే అవి త్వరితగతిన పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment