రాష్ట్రంలోని ఉత్తర,తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన సాధారణ వర్షపాతం 13.07 సెంటీమీటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణ స్థితిలో నమోదైనప్పటికీ.. కొన్ని జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉంది. ఈ మూడు రోజుల పాటు వర్షాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
13.07 సెంటీమీటర్ల వర్షపాతం
రాష్ట్రంలో నైరుతి సీజన్‌లో జూన్ నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఈ నెలలో గురువారం నాటికి నమోదు కావాల్సిన సగటు వర్షపాతం 11.14 సెంటీమీటర్లు కాగా.. 13.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, మూడు జిల్లాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 8 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు చెపుతున్నాయి. సాగు పనులు ముందుకెళ్లాలంటే ఈ వారం వర్షాలే కీలకం కానున్నాయి. సాగు విస్తీర్ణం పెరుగుదలకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment